
ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడమే తనకు ఇష్టం అంటోంది నివేదా థామస్. ఆమె లీడ్ రోల్‌లో ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘35 చిన్న చిత్రం కాదు’. నందకిషోర్ ఈమాని దర్శకుడు. రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నివేదా థామస్ ఇలా ముచ్చటించింది.
‘‘ఇదొక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ స్టోరీ. తిరుపతి నేపథ్యంలో నంద కిషోర్ అద్భుతంగా రాశారు. కథ చాలా రీజినల్‌గా, రూటెడ్‌గా ఉండటం చాలా నచ్చింది. ఇరవై రెండేళ్లకు పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్ అవడం మన దేశంలో వెరీ కామన్. ఇందులో నేను పోషించిన సరస్వతి పాత్రకు, రియల్ లైఫ్‌లో నా ఏజ్‌కు పెద్ద తేడా లేదు. ఆ లెక్కన నేనీ పాత్ర చేయడంలో పెద్ద ప్రాబ్లమ్ లేదు. సరస్వతికి చిన్న వయసులోనే పెళ్లి అవుతుంది. అందుకే ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ తనలోనూ ఒక చైల్డ్ నేచర్ ఉంటుంది. ఇవన్నీ ఎక్స్‌ఫ్లోర్ చేయడం ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఒక నటిగా అన్ని రకాల పాత్రలు పోషించాలి.
నాకంటూ ఓ ఇమేజ్‌క్రియేట్‌చేసుకుని అందులోనే ఉండటం నాకిష్టం ఉండదు. పిల్లల చదువు, మ్యాథ్స్ అనేది ఈ కథలో చిన్న పార్ట్ మాత్రమే. ఆ క్లాస్ రూమ్ సీన్స్ నుంచి మాస్‌మూమెంట్స్ వస్తాయి. ఇక పిల్లల చదువులు అనగానే ‘తారే జమీన్ పర్’ లాంటి చిత్రాలతో పోల్చుతారు. కానీ ఎలాంటి పోలికలు లేవు. భార్య భర్త, పిల్లలు, టీచర్ స్టూడెంట్స్ లాంటి అనుబంధాలను చాలా అందంగా చూపించారు. ఈ ఇన్నోసెంట్ ఫ్యామిలీ స్టోరీ ప్రేక్షకులకు చాలా నచ్చుతుంది. కె. విశ్వనాథ్ గారి సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది’’.