ఐటెక్స్ గురించి ఇంట్రెస్టింగ్​ సంగతులు

ఐటెక్స్ గురించి ఇంట్రెస్టింగ్​ సంగతులు

కాటుక అంటే ఐటెక్స్, ఐటెక్స్ అంటే కాటుక అని తరతరాలుగా మైండ్​లో రిజిస్టర్​ అయిపోయింది జనాలకి. మనదేశంలో మారుమూల ఏ పల్లెలో చూసినా పసిపాపల కళ్లకు దిద్దే కాటుక నుంచి నుదుట పెట్టుకునే బొట్టు వరకు ఐటెక్స్​ కేరాఫ్​ అయింది. అంతగా ప్రజల మనసులు దోచుకున్న ఐటెక్స్ కంపెనీ గురించి ఇంట్రెస్టింగ్​ సంగతులివి. ఐటెక్స్​ కంపెనీకి పునాది వేసిన అతను ఒక ప్రముఖ గాయని దగ్గర డ్రైవర్​గా పనిచేసేవాడు​. అతను ‘ప్రతి నెలా జీతం వస్తుంది. చాలని’ అనుకుని ఉంటే ఈ రోజు కాస్మొటిక్ ప్రపంచంలో ఐటెక్స్ అనేది ఉండేది కాదు. ఆ డ్రైవర్​కి వచ్చిన ఒక ఆలోచనతో మార్కెట్​లోకి కాటుక వచ్చింది. దాన్ని అనుసరిస్తూ కుంకుమ వచ్చిచేరింది.

ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి మరెన్నో ప్రొడక్ట్స్​ మార్కెట్​లోకి వచ్చాయి. ఐటెక్స్​ కంపెనీ మొదలుపెట్టిన అతను అమ్మేశాడు. కానీ, ప్రజల్లో దానికున్న స్థానాన్ని మాత్రం ఎవరూ మార్చలేకపోయారు. అందుకే మనదేశంలోని టాప్​ టెన్​ కాస్మొటిక్స్​లో ఐటెక్స్ ఒకటైంది.1938లో మొదలైన దీని ప్రస్థానం ఈ ఏడాది సెప్టెంబర్​కి 85 ఏండ్లు పూర్తి చేసుకోబోతుంది. ఆ జర్నీ విశేషాలు ఇవి... 

కె. వాసుదేవన్. ప్రముఖ కర్నాటిక్ సింగర్​ ఎమ్.ఎస్​. సుబ్బులక్ష్మి దగ్గర డ్రైవర్​గా ఉంటూనే... ఆమెకి అసిస్టెంట్​గా పనిచేసేవాడు. పనైతే చేస్తుండేవాడు కానీ అతనికి వ్యాపారం పెట్టాలనే ఆలోచన ఉండేది. ఆ వ్యాపారం కూడా కాటుక అయితే బాగుండు అనుకున్నాడు. అందుకు పురాణాలు చదివాడు. వాటిలో కళ్లకి కాటుక ఎలా వాడాలో తెలుసుకున్నాడు. కాటుక తయారీకి కావాల్సిన సామాగ్రిని తెచ్చుకుని తనే స్వయంగా చేత్తో తయారుచేయడం మొదలుపెట్టాడు. అది సక్సెస్ కావడంతో​ కంపెనీ పెట్టాలనుకున్నాడు వాసుదేవన్. అలా1938వ సంవత్సరం, చెన్నైలోని ట్రిప్లికేన్​లో ‘అరవింద్ లాబొరేటరీస్’ పేరుతో ఒక చిన్న స్టోర్​ తెరిచాడు. ఆ తర్వాత దాన్ని ‘ఐటెక్స్’ బ్రాండ్​ పేరుతో మార్కెట్​లోకి తీసుకొచ్చాడు. మొట్టమొదట తమిళనాడులోని ట్రిప్లికేన్​లో ఉన్న పుష్పవనం స్టోర్స్​ దగ్గర అమ్మకాలు మొదలుపెట్టాడు. కంపెనీ మొదలుపెట్టిన రోజుల్లోనే వ్యాపారం బాగా సాగడంతో కాటుకతోపాటు లిక్విడ్​ కుంకుమ (తిలకం) తయారుచేసి, గ్లాస్​ బాటిల్స్​లో అమ్మడం మొదలుపెట్టాడు.

మహిళా వర్కర్లే ఎక్కువ

ఎ.వి శ్రీనివాసన్ అనే కెమికల్ సైంటిస్ట్​ ఐటెక్స్​ కంపెనీని1958లో​ కొన్నాడు. అంత బాగా నడుస్తున్న కంపెనీని వాసుదేవన్​ ఎందుకు అమ్మాడనే విషయం స్పష్టంగా తెలియదు. కానీ, వాసుదేవన్ తర్వాత కంపెనీ పగ్గాలు చేపట్టిన శ్రీనివాసన్​ కూడా ఐటెక్స్​ని డెవలప్​ చేయడంలో బాగా కృషి చేశాడు. ​మొదట్లో ఆయన కూడా కాటుకను చేత్తోనే తయారుచేసేవాడు. వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో చెన్నైలోని వెస్ట్​ మాంబలంలో అద్దెకు ఉంటున్న కొందరు మహిళలను వర్కర్లుగా పెట్టుకుని కాటుక తయారుచేయించేవాడు. ఆ తర్వాత నుంచి కూడా మగవాళ్లతో పోలిస్తే ఎక్కువశాతం ఆడవాళ్లే పనిచేస్తున్నారు ఇక్కడ. చాలామంది దశాబ్దాలుగా ఆ కంపెనీలోనే పనిచేయడం చెప్పుకోదగ్గ విషయం. వ్యాపారం బాగా నడుస్తుండడంతో1960 నాటికి తమిళనాడు రాష్ట్రాన్ని దాటి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటకలకు విస్తరించింది. ఆ తర్వాత పదేండ్లలో మహారాష్ట్ర, గుజరాత్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఐటెక్స్ నిలదొక్కుకుంది. రికార్డుల బట్టి ప్రస్తుతం ఈ బ్రాండ్ ఇండియాలోని 22 రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది.

సబ్ బ్రాండ్స్ కూడా..

కంపెనీలో మొదటి మాన్యుఫాక్చరింగ్ యూనిట్​ని 1968లో రామాపురంలో ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే కొన్ని సబ్ బ్రాండ్స్ తీసుకొచ్చింది ఐటెక్స్. వాటిలో ‘పల్లవి, దివ్య, పూర్ణిమ’ రకాలను1970,1980ల కాలంలో పరిచయం చేసింది. వాటిలో ఐ–లైనర్ లిక్విడ్, ఐబ్రో పెన్సిల్స్​, పేస్ట్, లిక్విడ్​ పెన్సిల్, స్టిక్కర్ వంటి కుంకుమ వెరైటీలు ఉన్నాయి. రామాపురంలో ఫ్యాక్టరీ మొదలయ్యాక1982, 1996 సంవత్సరాల్లో ఇంకాస్త స్థలాన్ని తీసుకుని యూనిట్​ను విస్తరించారు. 2016 సంవత్సరం వరకు ఆ ఫ్యాక్టరీ అదే ప్లేస్​లో ఉంది. అయితే,1981లో అరవింద్​ ‘లెవన్​ ఇన్ వన్’​ అనే ట్యాగ్​తో లిక్విడ్ కుంకుమ (తిలకం) ప్రొడక్ట్​ని లాంచ్ చేసింది. ఆ ప్రొడక్ట్​లో పదకొండు రంగుల కుంకుమను గుండ్రని బాక్స్​లో ప్యాక్ చేసింది. ​అది కూడా సక్సెస్​ కావడంతో ఇక ఆ కంపెనీ వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత 2002లో ‘డాజ్లర్’ అనే బ్రాండ్​ పేరుతో ఐ–లైనర్, నెయిల్ పాలిష్​, లిప్​స్టిక్, మస్కారా, ఫేస్​వాష్​, స్క్రబ్, లిప్ జెల్ వంటివి తయారుచేసింది. ఆ తర్వాత ఒకటి కొంటే మరొకటి ఉచితం అనే ఆఫర్​తో కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీకి తెరతీసింది. తమ కంపెనీకి చెందిన ఏ ప్రొడక్ట్ అయినా రెండు ప్యాక్​లు కొంటే ఒకటి ఉచితం అని ప్రకటించింది. ‘ఐటెక్స్’ అనేది కాస్మొటిక్ పార్ట్​నర్​గా కొన్ని టీవీ షోలు కూడా స్పాన్సర్​ చేసింది. సెలబ్రిటీలతో యాడ్స్ చేస్తుంది. 

సేఫ్టీకి చిరునామా

నిజానికి కొన్నిరకాల స్కిన్ లేదా ఐ ప్రొడక్ట్స్ వాడితే దురద, ఇన్ఫెక్షన్ వంటివి వస్తుంటాయి. కారణం వాటిలో వాడే ఇంగ్రెడియెంట్స్ కావచ్చు లేదా తయారీలో ఏదైనా పొల్యూట్​ అయి ఉండొచ్చు. కానీ, ఐటెక్స్ విషయానికొస్తే... అలాంటి సమస్యలు ఇప్పటివరకు రాలేదు. ‘‘అందుకు కారణం ప్రొడక్ట్​ తయారుచేసేటప్పుడు మేం తీసుకునే జాగ్రత్తలే అంటుంది ఆ కంపెనీ. ముడిసరుకు నుంచి ప్రొడక్ట్ తయారీ వరకు ప్రతీది టెస్ట్ చేయాలనేది మా రూల్. అలాగే డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ ప్రకారం, బిఐఎస్​ స్పెసిఫికేషన్ ఉండేలా చూసుకుంటాం. చట్టపరంగానే కాకుండా కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటిస్తాం. కంటి కోసం కాబట్టి సహజమైన నూనెలు వాడి కాటుక తయారుచేస్తాం. అంతెందుకు మా బ్రాండ్ కుంకుమ స్టిక్కర్స్ వాడినా సేఫ్​. కుంకుమ స్టిక్కర్ తయారీలో నాన్ ఒవెన్ ఫ్లాక్ ఫ్యాబ్రిక్, ‘బ్రీత్​’ అనే ప్రత్యేకమైన వెల్వెట్ ఉపయోగిస్తాం. నుదుటి చర్మం మీద ఉన్న పీహెచ్ లెవల్​కు సరిపోయేలా దాన్ని తయారుచేయడం మనదేశంలోనే మొదటిసారని గర్వంగా చెప్పగలం” అంటారు ఆ కంపెనీ ప్రతినిధులు. 

ప్రొడక్ట్స్ ‘క్యూ’ కట్టాయి

కస్టమర్లు ఎప్పుడైతే బ్యూటీ ప్రొడక్ట్స్​లో హెల్త్ బెనిఫిట్స్ చూడడం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఈ బ్రాండ్ పేరు ఫేమస్​ అయిపోయింది. కలర్ కాస్మొటిక్స్​లో డాజ్లర్ పేరుతో ఫేస్ వాష్​, లోషన్, లిప్​స్టిక్, టాల్కం పౌడర్, హెయిర్ వాష్​, నెయిల్ పాలిష్ రిమూవర్ వంటివి ఉన్నాయి. ఆ తర్వాత డియోడరెంట్లు, మాయిశ్చరైజర్లు, షేవింగ్​ క్రీములు... ఇలా బోలెడు ప్రొడక్ట్స్​ ఉన్నాయి. 

ఇలా ఎదిగింది

కాటుక ధర పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఉండేది. ఐటెక్స్ మొదలుపెట్టినప్పుడు పోటీ చాలా తక్కువ ఉన్నప్పటికీ సేఫ్టీ, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. 2007 నాటికి దాదాపు పాతిక కోట్ల టర్నోవర్​కు చేరింది కంపెనీ. ఇండియాలోని  గ్రామీణ ప్రాంతాల్లో ఐటెక్స్ ప్రొడక్ట్స్ సేల్స్​ 60 శాతానికి పైనే. వాటిలో ఎక్కువగా కుంకుమ, కాటుక ఉన్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీకి దేవనాథన్ హరిప్రసాద్, దేవనాథన్ బాలాజీ, కృష్ణస్వామి శ్రీనివాసన్, శాంతి రాజగోపాల్ అనే నలుగురు డైరెక్టర్స్​గా ఉన్నారు.