‘కుక్కే సుబ్రహ్మణ్య’ ఆసక్తికర సంగతులు

‘కుక్కే సుబ్రహ్మణ్య’ ఆసక్తికర సంగతులు

అడ్వెంచర్స్​ చేసేవాళ్లకు, భక్తులకు, ప్రకృతి ప్రేమికులకు కేరాఫ్​ ఆ ప్లేస్. అక్కడ కనిపించే ప్రతి విషయం వెనక కొన్ని కథలుంటాయి. ఆ కథలన్నీ దైవానికి సంబంధించినవే. అందుకే ఆ ఊరి పేరు కూడా దేవుడి పేరే అయింది. ఆ ఊరే.. ‘కుక్కే సుబ్రహ్మణ్య’. ఆ ఊళ్లో ఆసక్తికర సంగతులు చాలా ఉన్నాయి. వాటి గురించి చెప్పుకోవాలంటే ముందు అక్కడ ఉన్న గుడి గురించి తెలియాలి. అవన్నీ తెలుసుకోవాలంటే కర్నాటక వెళ్లాల్సిందే!  

కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉంది ‘సుబ్రహ్మణ్య’. ఈ ఊరి ఒరిజనల్ పేరు ‘కుక్కే పట్టణ’. ఈ ఊళ్లో ఐదు వేల ఏండ్ల నాటి పురాతన ‘కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్’​ ఉంది. ఆ టెంపుల్​ వల్లే ఈ ఊరు ఫేమస్ అయింది. ఇక్కడ సుబ్రహ్మణ్యుడిని పాములా పూజిస్తారు. ఈ ఊరి చుట్టుపక్కల ‘కుమారధార’ అనే నది ఉంది. ఈ నదికి ఉపనది అయిన ‘దర్పణ తీర్థ’ గుడి వెనక ప్రవహిస్తుంది. అక్కడి​కి వెళ్లిన వాళ్లు ఉండేందుకు టెంపుల్​ ఆధ్వర్యంలో నడిచే గెస్ట్​హౌస్​లు ఉన్నాయి. లేదంటే పక్క ఊళ్లో ప్రైవేట్ లాడ్జ్​లు, హోటల్స్​లో ఉండొచ్చు.  

తపస్సు చేస్తే వెలసిన ఆలయం

వాసుకి, ఇతర పాములు సుబ్రహ్మణ్య గుహలలో సుబ్రహ్మణ్య దేవుని కింద ఆశ్రయం పొందాయని నమ్ముతారు. ఎందుకంటే... స్కంధ పురాణం ప్రకారం, గరుత్మంతుడు ఆకలితో పాములను వేటాడుతున్నాడు. గరుడి నుంచి తప్పించుకోవడానికి పాములకు రాజైన వాసుకి ‘బిలద్వార’ అనే గుహలో దాక్కున్నాడు. అయినా గరుడు వాసుకిని గుర్తించి, దాడి చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు కశ్యప ముని అనే ఒక రుషి పాముల్ని వేటాడటానికి రమణక ద్వీపాల(ప్రస్తుత ఫిజి ఐలాండ్)కు వెళ్లమని గరుడుడిని ఆదేశించాడు. రక్షించమని శివుడికి ప్రార్థన చెయ్యమని వాసుకికి చెప్పాడు రుషి. దాంతో వాసుకి గరుడుడి నుంచి పాములను రక్షించమని శివుడిని కోరాడు. వాసుకి తపస్సుకు మెచ్చి శివుడు పాములను రక్షించడానికి కొడుకైన సుబ్రహ్మణ్యుడిని పంపాడు. అప్పటి నుంచి ఆయన పాములకు రక్షకుడిగా పూజలు అందుకుంటున్నాడు. వాసుకి తపస్సు చేసిన చోటే ఆలయం ఉంది. ఆలయంలో గరుడ గోపురం కూడా కనిపిస్తుంది. ఆలయం లోపల వాసుకి ఉంటుందని నమ్ముతారు భక్తులు. ఈ ఆలయంలో చేసే ముఖ్యమైన పూజలు ఆశ్లేష బలి, సర్ప సంస్కారాలు. మరొక పురాణం ప్రకారం, యుద్ధంలో  తారకాసురుడు అనే రాక్షసుని సుబ్రహ్మణ్యుడు చంపిన తరువాత, తన ఖడ్గాన్ని పక్కనే ఉన్న నీటి ప్రవాహం ‘ధార’లో కడుగుతాడు. ఆ విధంగా ఆ ప్రవాహానికి ‘కుమారధార’ అనే పేరు వచ్చింది అని చెప్తారు.

కుక్కే అంటే..

కుక్కే అంటే కన్నడలో బుట్ట అని అర్థం వస్తుంది. ఎందుకంటే పురాతన కాలంలో భక్తులు ఈ లింగాలను ఒక బుట్టలో ఉంచి పూజించేవారట. అయితే, కుక్కే అనేది పాత సంస్కృత పదం ‘కుక్షి’ నుంచి వచ్చిందని కొందరంటారు.‘కుక్షి’ అంటే ‘గుహ’. అలాగే, వాసుకి అనే పాము ఈ లింగాలను మొదట ఒక గుహలో ప్రతిష్ఠించిందని కొందరు నమ్ముతారు. కొన్ని హిందూమత గ్రంథాల ప్రకారం, సుబ్రహ్మణ్యస్వామి శివలింగాలను టెంపుల్ చుట్టూ మూడు చోట్ల పెట్టాడు. ఆయన్ను అనుసరిస్తూ చాలామంది దేవుళ్లు, దేవతలు చిన్న చిన్న లింగాలను పెట్టారట. కాలం గడిచేకొద్దీ ప్రజలు ఆ లింగాలన్నింటినీ తెచ్చి కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్​లో పెట్టి పూజిస్తున్నారు.   

గుళ్లో చేసే పండుగలు...

చంపషష్టి మహోత్సవం : కార్తీక మాసమంతా రథయాత్ర జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని అలంకరించి, వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తారు. అలాగే లక్ష దీపోత్సవం కూడా చేస్తారు. ఈ పండుగ రోజుల్లో భక్తులకు ‘మూల మృత్తికె’ ప్రసాదం పెడతారు. అది గర్భగుడిలో తవ్విన మట్టి. దాన్నే ప్రసాదంగా ఇస్తారు. ఆ మట్టిని తిన్నా లేక నీళ్లలో కలుపుకుని తాగినా  అనారోగ్యాలు పోతాయని నమ్ముతారు.

మకర సంక్రాంతి : ప్రజలు వాళ్లు పండించిన పంటలు తెచ్చి సంక్రాంతి పండుగనాడు ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాకుండా గర్భగుడిలో ఉన్న లింగాలను బయటకు తీసి ఊరంతా ఊరేగిస్తారు.

మేష శంకరనామ : ఈ పండుగ ఏప్రిల్​లో జరుగుతుంది. పండుగ రోజున పూజలు, భజనలు చేస్తారు. 

మహా శివరాత్రి : ఈ పండుగ ఫిబ్రవరి– మార్చి మధ్య జరుగుతుంది. భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా భజనలు చేస్తారు. కీర్తనలు పాడతారు. 

నాగ పంచమి : జూన్​లో వచ్చే ఈ పండుగ నాడు పాములను పూజిస్తారు.



డ్రెస్​ కోడ్ లేకుంటే : కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్​లోకి వెళ్లాలంటే డ్రెస్​ కోడ్ ఉంటుంది. టెంపుల్ ఆవరణలోకి వెళ్లేటప్పుడు  మగవాళ్లు చొక్కా, బనియన్​ తీసేయాలి. అలాగే కోట్లు, టోపీలు, బెర్ముడాలు, షార్ట్స్​, లుంగీ వేసుకుంటే ఆలయంలోకి అనుమతించరు. ఆడవాళ్లు చీరలు, చుడీదార్​ వంటి ట్రెడిషనల్ డ్రెస్​లు వేసుకోవాలి. 

ఎలా వెళ్లాలి ?
విమానంలో మంగళూరు​లోని బజ్పె ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​కి వెళ్లాలి. అక్కడి నుంచి కారులో వెళ్లాలి. ట్రైన్​లో వెళ్తే సుబ్రహ్మణ్య రోడ్​ స్టేషన్​లో దిగాలి. ఇది టెంపుల్​కు12కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. బస్​ జర్నీ చేసేవాళ్లు కర్నాటకలోని ఏ టౌన్​లో అయినా బస్​ ఎక్కి వెళ్లొచ్చు. ఈ ఊరికి వెళ్లడానికి బెస్ట్​ టైం సెప్టెంబర్​ నుంచి మార్చి. 

స్పెషల్ అట్రాక్షన్స్ 

శృంగేరి మఠం


టెంపుల్​తోపాటు ఇక్కడ చూడదగ్గవి చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి శృంగేరి మఠం. దీనికి గొప్ప చరిత్ర ఉంది. ఆదిశంకరుడు క్రీ.శ. 8వ శతాబ్దంలో కట్టించాడు. ఇది తుంగభద్ర నది ఒడ్డున ఉంది. శృంగేరి మఠం నాలుగు ఆమ్నాయ పీఠాలలో మొదటిది. అంటే వేదాల సింహాసనం, సంతాన ధర్మ పవిత్ర సంప్రదాయాల గౌరవార్థం స్థాపించినది. ఈ ఆలయం సరస్వతీ దేవికి అంకితం చేశారు.  

కుమార పర్వత ట్రెక్



ఈ కుమార పర్వతం అభయారణ్యంలో ఉన్న ఎత్తైన కొండ. దీన్ని ‘పుష్పగిరి’ అని కూడా పిలుస్తారు. ఇది కర్నాటకలో ఎత్తైన కొండల్లో ఆరవది. ఇక్కడ ట్రెక్కింగ్​ చేయడం చాలెంజింగ్​గా ఉంటుంది. చూడ్డానికి ఒక పర్వతంలా కనిపించినా, ఇందులో మూడు కొండలు ఉన్నాయి. వాటి పేర్లు శేష, సిద్ధ, కుమార పర్వతాలు.

మత్స్య, పంచమి తీర్థాలు

కుమారధార నది దగ్గర మత్స్య, పంచమి తీర్థాలు ఉన్నాయి. ఇవి చాలా పవిత్రమైన తీర్థాలుగా చెప్తారు. భక్తులు పాపాలు కడుక్కోవడానికి ఆ తీర్థాల్లో స్నానం చేస్తారు. చాలామంది భక్తులు అక్కడ నీటిలో ఉండే గులకరాళ్లను ఒకదానిమీద ఒకటి పేర్చుతారు. 

ధర్మ స్థల

ధర్మస్థలంగా పేరుగాంచింది ఆ ప్రదేశం. అక్కడ వారసత్వం, కల్చర్, మతం అన్నీ కలగలిపిన అందమైన టెంపుల్​ టౌన్ అది. ఇది నేత్రావతి నది ఒడ్డున ఉంది. ధర్మ స్థల టెంపుల్​ 800 ఏండ్ల నాటిది. అక్కడ నవంబర్ – డిసెంబర్​లలో లక్ష దీపోత్సవం పండుగ జరుగుతుంది. ఇక్కడ చూడదగ్గ మరో అట్రాక్షన్​.. బాహుబలి విగ్రహం. ఒకే రాతి మీద 39 అడుగులతో చెక్కిన విగ్రహం అది. 

ముల్లయనగిరి 

అడ్వెంచర్స్ చేసేవాళ్లకు, ట్రెక్కర్స్​కు పాపులర్​ ప్లేస్ ముల్లయనగిరి. నాలుగు కిలో మీటర్ల ఈ ట్రెక్ స్టార్టింగ్​ పాయింట్ సర్పధారి. ఇది ఏటవాలుగా ఉంటుంది. మౌంటెన్, రోడ్ బైకింగ్ వంటివి చేయొచ్చు. ముల్లయనగిరి పర్వతానికి దగ్గర్లో చిక్​మగళూరు ఉంది. శిఖరానికి దిగువన ఉన్న చిన్న గుహలు చూడొచ్చు. కొండపైన శివుడి ఆలయం ఉంది.