గుర్తింపు ఇయ్యకుండానే.. అడ్మిషన్ నోటిఫికేషన్

గుర్తింపు ఇయ్యకుండానే.. అడ్మిషన్ నోటిఫికేషన్
  • కాలేజీలకు గుర్తింపు ఇయ్యకుండానే.. అడ్మిషన్ నోటిఫికేషన్
  • ఇంటర్ బోర్డు వివాదాస్పద నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ బోర్డు వివాదాస్పద నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్​గా మారుతోంది. ఇదివరకు అనేక అనాలోచిత నిర్ణయాలతో విమర్శల పాలైన బోర్డు.. తాజాగా అలాంటి నిర్ణయం మరొకటి తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్క కాలేజీకీ గుర్తింపు ఇవ్వకుండానే, అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అదీ మంగళవారం నుంచే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించింది. కానీ స్టూడెంట్స్ ఎలా అప్లై చేసుకోవాలో మాత్రం 
స్పష్టత ఇవ్వలేదు. 

ఒక్క కాలేజీకీ అఫిలియేషన్​ లేదు..
2021–22 అకడమిక్ ఇయర్​కు గాను కాలేజీల అఫిలియేషన్​ నోటిఫికేషన్​ను ఈ నెల ఫస్ట్ వీక్​లో ఇంటర్ బోర్డు రిలీజ్ చేసింది. ఈ నెల 24 వరకు కాలేజీలు ఫైన్ లేకుండా అప్లై చేసుకోవాలని సూచించింది. అయితే గతేడాది కంటే ఈసారి అఫిలియేషన్​ ఫీజులను పెంచింది. దీంతో ఫీజులు తగ్గిస్తేనే అఫిలియేషన్ కు అప్లై చేస్తామని ప్రైవేటు కాలేజీలు బోర్డుకు ఆల్టిమేటం ఇచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన అఫిలియేషన్​ దరఖాస్తులు 20లోపే ఉంటాయని మేనేజ్మెంట్లు చెబుతున్నాయి. మరోపక్క సర్కారు సెక్టార్ కాలేజీలు కూడా కొన్ని అప్లై చేసుకున్నాయి. అయినా వాటికి ఇంటర్ బోర్డు గుర్తింపు ఇవ్వలేదు. అడ్మిషన్ నోటిఫికేషన్ సమయానికి కాలేజీలకు గుర్తింపు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అలా కానప్పుడు కనీసం ప్రాసెస్ చివరి దశలోనైనా ఉండాలి. కానీ ప్రస్తుతం ఏ ఒక్కకాలేజీకీ గుర్తింపు ఇవ్వకుండానే, ఇంటర్ బోర్డు 2021–22 అకడమిక్ ఇయర్ అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇచ్చింది. https://tsbie.cgg.gov.in, https://acadtsbie.cgg.gov.in వెబ్ సైట్లలో గుర్తింపు ఉన్న కాలేజీల వివరాలు ఉన్నాయని, వాటిలో చూసిన తర్వాతే అడ్మిషన్లు తీసుకోవాలని నోటిఫికేషన్​లో పేర్కొంది. కానీ ఆ వెబ్ సైట్లలో ఒక్క కాలేజీ పేరు కూడా లేదు. 

ఎట్ల దరఖాస్తు చేసుకోవాలె...
ఈ నెల30 వరకు రాష్ట్రంలో లాక్​డౌన్ కొనసాగుతోంది. ఈ గడువును మరోసారి ప్రభుత్వం పెంచే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో టెన్త్ పూర్తయిన విద్యార్థులు కాలేజీల్లో ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టత ఇవ్వలేదు. స్టూడెంట్లు కాలేజీలకు నేరుగా వెళ్లి అప్లై చేసే పరిస్థితి లేదు. కనీసం ఆన్​లైన్ అప్లికేషన్లకూ ఇంటర్ బోర్డు అవకాశమివ్వలేదు.

జులై 5 వరకు అడ్మిషన్లు... 
ఇంటర్ కాలేజీల్లో 2021–22 అకడమిక్ ఇయర్ కు గాను ఫస్టియర్ లో ప్రవేశాల కోసం ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ నోటిఫికేషన్ ను ఇంటర్ బోర్డు రిలీజ్ చేసింది. గుర్తింపు ఉన్న కాలేజీల్లో మంగళవారం నుంచే అడ్మిషన్లు తీసుకోవచ్చని, ఈ ప్రక్రియ జులై 5 వరకు కొనసాగుతుందని ప్రకటించింది. జూన్ 1 నుంచి ఫస్టియర్ స్టూడెంట్లకు ఆన్​లైన్ క్లాసులు ప్రారంభించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. టెన్త్ ఇంటర్నెట్ మెమో ఆధారంగా ఫస్టియర్​లో తాత్కాలిక అడ్మిషన్లు తీసుకోవాలని సూచించారు. అడ్మిషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించారు. టెన్త్ జీపీఏ పాయింట్ల ఆధారంగా సీట్లు కేటాయించాలని, టెస్టు పెట్టి అడ్మిషన్లు ఇస్తే ఆ కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడ్మిషన్లకు స్టూడెంట్ ఆధార్ నెంబర్ తప్పనిసరి అని ప్రకటించారు. కానీ సెకండియర్ ఇయర్ స్టూడెంట్లకు క్లాసులు ఎప్పటి నుంచి అనేది మాత్రం నోటిఫికేషన్​లో పేర్కొనలేదు.