నేటి (మే12) నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు

నేటి (మే12) నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు
  • జూన్ 30 నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికి చర్యలు
  • రీషెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2026-–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్  రీఅడ్మిషన్ల షెడ్యూల్‌  రిలీజ్  అయింది. ఈనెల 12 నుంచి ఫస్ట్ ఫేజ్  అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా,  31 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనున్నది.  ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్-ఎయిడెడ్, రెసిడెన్షియల్, కేజీబీవీ సహా అన్ని జూనియర్  కాలేజీలు ఈ షెడ్యూల్  పాటించాలని ఇంటర్  బోర్డు ఆదేశించింది.

ఈ మేరకు బోర్డు సెక్రటరీ అభిలాష ఒక ప్రకటన రిలీజ్ చే శారు. గతంలో అడ్మిషన్  షెడ్యూల్  రిలీజ్  చేయగా.. సీఎం ఆదేశాలతో దాన్ని వెనక్కి తీసుకున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండగానే జూన్ 1వ తేదీ నుంచే జూనియర్  కాలేజీల్లో క్లాసులు ప్రారంభం కానున్నాయి. మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియను జూన్ 30 వరకు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, రెసిడెన్షియల్, కేజీబీవీ సహా అన్ని రకాల జూనియర్  కాలేజీలు ఈ షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని సెక్రటరీ ఆదేశించారు. పదో తరగతి ఫలితాల్లో వచ్చిన జీపీఏ, సబ్జెక్టుల వారీ గ్రేడ్  పాయింట్ల ఆధారంగానే సీట్లు కేటాయించాలని, అడ్మిషన్ల కోసం ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదని స్పష్టంచేశారు. 

యాంటీ డ్రగ్ అఫిడవిట్ ఉండాల్సిందే

ఈసారి అడ్మిషన్ల ప్రక్రియలో బోర్డు కీలక మార్పులు చేసింది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా 'యాంటీ డ్రగ్ అఫిడవిట్' సమర్పించడం తప్పనిసరి చేసింది. అలాగే అడ్మిషన్  తీసుకునే ప్రతి విద్యార్థి ఆధార్  నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. జోగిని పిల్లల  విషయంలో తండ్రి పేరుకు బదులు తల్లి పేరును రికార్డుల్లో నమోదు చేయాలని ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు.