సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ ప్రాక్టికల్స్

సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ ప్రాక్టికల్స్
  • ఫిబ్రవరి 2 నుంచి ప్రయోగ పరీక్షలు ప్రారంభం
  • 1,908 సెంటర్లు.. 3.5 లక్షల మంది విద్యార్థులు 
  • ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో వెబ్ కాస్టింగ్ నిఘా 
  • సీసీ కెమెరాలన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌కి లింక్  
  • ప్రాక్టికల్స్‌‌కు సర్వం సిద్ధం చేసిన ఇంటర్ బోర్డు 

హైదరాబాద్, వెలుగు డెస్క్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు ఇంటర్ బోర్డు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. పరీక్షల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. మౌలిక వసతులు, ల్యాబ్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉన్న కాలేజీలనే సెంటర్లుగా ఎంపిక చేసింది. 

ఈ ఏడాది గవర్నమెంట్ సెక్టార్ కాలేజీల్లో సెంటర్లకు కోత పెట్టడంతో.. భారీగా సెంటర్లు తగ్గాయి. ఇది వచ్చే విద్యాసంవత్సరం నుంచి జంబ్లింగ్ విధానం అమలు చేసేందుకు ఈ విధానం ఎంపిక చేసినట్టు అధికారులు చెప్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అదే నెల 21తో ముగియనున్న పరీక్షలకు మూడున్నర లక్షల మంది పరీక్షలకు అటెండ్ కానున్నారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,908 పరీక్షా కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. 

వీటిలో ఒకేషనల్ స్టూడెంట్ల కోసం 484, జనరల్ విద్యార్థుల కోసం 1,424 సెంటర్లను రెడీ చేశారు. అయితే, గతేడాది 2,327 సెంటర్లుంటే.. ఈ ఏడాది భారీగా కొత్త పడింది. అయితే, జనరల్ విభాగంలో ఏకంగా 440 సెంటర్లు తగ్గడం గమనార్హం. వీటిలో గవర్నమెంట్ సెక్టార్ కాలేజీలతో పాటు గవర్నమెంట్ కాలేజీలు తగ్గాయి. 

నిఘా నీడలో.. 

ప్రాక్టికల్స్ నిర్వహణలో సీసీ కెమెరాలు కీలకంగా మారుతున్నాయి. ప్రధానంగా ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో జరిగే పరీక్షలపై ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి ల్యాబ్‌‌లలోని సీసీ కెమెరాలను ఇంటర్ బోర్డు సర్వర్‌‌తో అనుసంధానం చేస్తున్నది. పరీక్షలు జరిగే తీరును కమాండ్ కంట్రోల్ రూమ్​ నుంచి అధికారులు నేరుగా పర్యవేక్షించనున్నారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా నిఘా ఏర్పాటు చేశారు. 

జంబ్లింగ్‌‌కు సన్నాహాలు..

పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచే దిశగా బోర్డు అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది నుంచి అన్ని కాలేజీల్లో 'జంబ్లింగ్' విధానాన్ని అమలు చేసే యోచనలో ఉంది. దానికి తగ్గట్టుగానే ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తోంది. దీంట్లో భాగంగానే ఈ ఏడాది గవర్నమెంట్ సెక్టార్ కాలేజీల్లోని పిల్లలను ఇతర కాలేజీల్లో ప్రాక్టికల్స్ నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. 

దీని ద్వారా విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల పట్ల కొంత భయం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని కాలేజీల్లో ల్యాబ్స్, వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటుంది. 

మూడు విడతల్లో ప్రాక్టికల్స్.. 

ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతిరోజూ రెండు షిఫ్టులుగా.. మూడు విడతల్లో పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తొలి రెండు విడతల్లో వివిధ కారణాలతో హాజరుకాని విద్యార్థులకు మూడో విడతలో అవకాశం కల్పిస్తాం. ఈ ఏడాది అన్ని కాలేజీల ప్రాక్టికల్స్ ల్యాబుల్లోని సీసీ కెమెరాలను ఇంటర్ బోర్డుతో అనుసంధానం చేస్తున్నాం. అన్ని వసతులు ఉన్న కాలేజీల్లోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. 
- కృష్ణ ఆదిత్య, ఇంటర్ బోర్డు సెక్రటరీ