- బోర్డు కంట్రోల్ రూమ్‌కు ప్రైవేట్ కాలేజీల సీసీ కెమెరాలు అనుసంధానం
- ప్రాక్టికల్స్‌లో అక్రమాలకు చెక్.. హైదరాబాద్ నుంచే లైవ్ మానిటరింగ్
- నేటి నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు.. ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్స్
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో ఇష్టారాజ్యంగా మార్కులు వేసే కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల ఆటలకు చెక్ పడనున్నది. ల్యాబ్‌ల్లో ఏం జరుగుతుందో ఇకపై నేరుగా ఇంటర్ బోర్డు ఆఫీసు నుంచే చూసేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లోని సీసీ కెమెరాలను ఇంటర్ బోర్డులోని ‘కమాండ్ కంట్రోల్ సెంటర్’తో అనుసంధానం చేశారు. నెల రోజుల నుంచి జరుగుతున్న ఈ ప్రక్రియ 1400లకు పైగా కాలేజీల అనుసంధానం పూర్తయింది.
దీంతో ఫిబ్రవరి 2 నుంచి జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలను ఈ కంట్రోల్ సెంటర్ ద్వారానే అధికారులు లైవ్‌లో పర్యవేక్షించనున్నారు. గతేడాది సర్కారు జూనియర్ కాలేజీలతో పాటు కొన్ని ప్రైవేటు కాలేజీల కెమెరాలనూ మాత్రమే బోర్డుకు అనుసంధానించారు. ఈసారి అన్ని ప్రైవేటు కాలేజీలను కూడా దీని పరిధిలోకి తెచ్చారు. దీంతో పరీక్షల టైమ్‌లో ఎక్కడైనా మాస్ కాపీయింగ్ జరిగినా, నిబంధనలు ఉల్లంఘించినా క్షణాల్లో తెలిసిపోనున్నది. ప్రాక్టికల్స్ ను పకడ్బందీగా నిర్వహించేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్తున్నారు.
నేటి నుంచి హాల్ టికెట్లు
ఇంటర్ ప్రాక్టికల్స్ హాల్ టికెట్లను గురువారం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. విద్యార్థులు తమ కాలేజీ ప్రిన్సిపాల్స్ నుంచే హాల్ టికెట్లు పొందాలని సూచించారు. లేదంటే కాలేజీ లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి.
