
కరీంనగర్: కరీంనగర్ టీఆర్ఎస్ లో వర్గ విభేదాలు మళ్లీ భగ్గమన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ లో మేయర్ సునీల్ రావుతో టీఆర్ఎస్ కార్పొరేటర్లు వాగ్వివాదానికి దిగారు. దీంతో కౌన్సిల్ మీటింగ్ ఒక్కసారిగా వేడెక్కింది. కార్పొరేషన్ పరిధిలోని పనులకు మేయర్ సునీల్ రావు కమీషన్ తీసుకుంటున్నారని మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆరోపించారు. దీంతో సునీల్ రావు వర్గానికి చెందిన కార్పొరేటర్లు రవీందర్ సింగ్ తో వాగ్వివాదానికి దిగారు. గతంలో తాను మేయర్ గా ఉన్నప్పుడు ఎవరి దగ్గరినుంచి డబ్బు తీసుకోలేదా అంటూ కొంత మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు రవీందర్ సింగ్ తో గొడవకు దిగారు. దీంతో మనస్థాపానికి గురైన రవీందర్ సింగ్ కౌన్సిల్ నుంచి బయటకి వెళ్లిపోయారు. మరోవైపు తన డివిజన్ లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని టీఆర్ఎస్ కార్పొరేటర్ కమల్జీత్ కౌర్ ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. నాలుగున్నర నెలలుగా తన డివిజన్ లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదన్నారు. ఏఈ, డీఈ, ఎస్ఈ లకు అనేకసార్లు చెప్పినా పట్టించుకోవడలేదన్నారు. తాను మాజీ మేయర్ రవీందర్ సింగ్ బంధువుననే కారణంతో తన డివిజన్ లో పనులు కాకుండా వేధిస్తున్నారననారు.