కిటకిటలాడుతున్న కేస్లాపూర్.. నాగోబాకు పోటెత్తిన భక్తులు

కిటకిటలాడుతున్న కేస్లాపూర్..  నాగోబాకు పోటెత్తిన భక్తులు
  • నాగోబా దర్శనానికి తరలివస్తున్న భక్తులు
  • అర్ధరాత్రి మహాపూజల అనంతరం కొత్త కోడళ్లతో  భేటింగ్‌‌
  • అవ్వల్ దేవతకు సంప్రదాయ పూజలు

ఇంద్రవెల్లి, వెలుగు : ఆదిలాబాద్‌‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌‌లో నిర్వహిస్తున్న నాగోబా జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి అభిషేకం, మహాపూజలతో మెస్రం వంశీయులు జాతరను ప్రారంభించారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు సోమవారం ఉదయం నుంచే కేస్లాపూర్‌‌ బాట పట్టారు. భారీగా తరలివచ్చిన భక్తులతో నాగోబా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు నాగోబాను దర్శించుకున్న అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు కేస్లాపూర్‌‌ చేరుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. మరో మూడు రోజుల పాటు జాతర జరగనుండడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్‌తో కలిసి సోమవారం నాగోబాను దర్శించుకున్నారు. మంత్రికి కలెక్టర్‌  రాజర్షిషా, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్, మెస్రం వంశీయులు నాగోబా చిత్రపటాన్ని బహుకరించారు.

కొత్త కోడళ్లతో భేటింగ్‌‌

నాగోబా ఆలయంలో ఆదివారం రాత్రి మహాపూజల అనంతరం 200 మంది కొత్త కోడళ్లకు భేటింగ్‌‌ కార్యక్రమం నిర్వహించారు. తర్వాత కొత్త కోడళ్లు నాగోబాతో పాటు సతిక్‌‌ దేవతలను దర్శించుకొని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. 22 కితలకు చెందిన కొత్త కోడళ్లు కోనేరు నుంచి బిందెలతో నీటిని తీసుకొచ్చి గోవాడ్‌‌ను శుద్ధి చేశారు. 22 కితల నుంచి సేకరించిన నవధాన్యాలతో నైవేద్యం తయారు చేసి అందరూ పంచుకున్నారు. మెస్రం ఆడపడుచులతో పాటు కొత్త కోడళ్లు అవ్వల్‌‌ దేవతకు సంప్రదాయ పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. అనంతరం ఉపవాసాలను విరమించారు.

నాగోబా ఆలయ పరిసరాల్లో చెట్టుపై నాగుపాము..

నాగోబా ఆలయంలో మహాపూజ అనంతరం మెస్రం వంశీయుల పెద్దదేవుడి ఆవరణలోని ఓ టేకు చెట్టు వద్ద నాగుపాము కనిపించింది. నాగోబా కొలువుదీరిన వేళ పాము కనిపించడంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.