ముంబై: బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సోమవారం నష్టాల్లో కదిలాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లు పడడం, జియోపొలిటికల్ ఉద్రిక్తతలు, కొత్త టారిఫ్ బెదిరింపులు, రూపాయి బలహీనత, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు మార్కెట్‌ను ఒత్తిడిలోకి నెట్టాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 324 పాయింట్లు నష్టపోయి 83,246 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 108 పాయింట్లు తగ్గి 25,585 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలోని 3,074 షేర్లు పడిపోగా, 1,227 షేర్లు పెరిగాయి. రిలయన్స్ 3శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.26శాతం తగ్గాయి. ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, టెక్ మహీంద్రా, హిందుస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో నిలిచాయి.
రియల్ ఎస్టేట్, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ల ఇండెక్స్‌లు నష్టపోగా ఎఫ్‌ఎంసీజీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్‌లు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరప్‌లో నష్టాలు ఎక్కువగా కనిపించాయి.
రూపాయి మళ్లీ 91
డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం 91 మార్క్‌ను దాటింది. చివరికి 14 పైసల లాస్‌తో 90.92 వద్ద ముగిసింది. గ్లోబల్ ట్రేడ్ అనిశ్చితులు, ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐల) విక్రయాలు రూపాయి బలహీనతకు కారణమని విశ్లేషకులు తెలిపారు. ఎఫ్‌ఐఐలు సోమవారం రూ.3,200 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.
గ్రీన్‌ల్యాండ్‌ను అమ్మడానికి ఒప్పుకోని యూరప్ దేశాలపై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అదనపు టారిఫ్‌లను వేశారు. ఈ ఇష్యూతో ఇన్వెస్టర్లలో ఆందోళన పెరుగుతోంది. బ్రెంట్ క్రూడాయిల్ 1.22 శాతం తగ్గి బ్యారెల్‌కి 63.35 డాలర్లకి చేరింది.
బీసీసీఎల్ బంపర్ లిస్టింగ్
భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) సోమవారం స్టాక్ మార్కెట్‌లో బంపర్ బోణీ చేసింది. ఐపీఓ ధర రూ.23తో పోలిస్తే, షేర్ బీఎస్‌ఈలో రూ.45.21 వద్ద లిస్టయి 96శాతం ప్రీమియంతో ప్రారంభమైంది. చివరికి రూ.40.66 వద్ద ముగిసి 76.78శాతం లాభం సాధించింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.18,935 కోట్లకు చేరింది.
