స్టేషన్ ఘన్ పూర్లో ఎమ్మెల్యే రాజయ్య vs కడియం శ్రీహరి

స్టేషన్ ఘన్ పూర్లో ఎమ్మెల్యే రాజయ్య vs కడియం శ్రీహరి

ఎమ్మెల్యే రాజయ్య,టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య అంతర్గత కలహాలు మరోసారి బయటపడ్డాయి. ఇద్దరు నేతల మధ్య ప్రచ్చన్న యుద్దం కొనసాగుతుంది.జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్యల మధ్య పంచాయితీ పీక్స్ కి చేరుకుంది.  ఇటీవల స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కొందరు ప్రజాప్రతినిధులు దళిత బంధు పథకాన్ని వారి బంధువులకు మాత్రమే ఇస్తున్నారని విమర్శలు చేశారు. లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకుని దళిత బంధు పథకాన్ని ఇస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని, ఈ వ్యవహారాన్ని సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకు వెళ్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు.

దళిత బంధు పంపిణీ పారదర్శకతోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. స్టేషన్ ఘనపూర్ లో మొదటి విడత దళిత బంధు ఇచ్చిన వంద మందిలో ఎవరు అర్హులు కాదో చెప్పాలని నిలదీశారు. కొందరు నేనొస్తా నేనొస్తా అని వస్తున్నారు. కానీ వారు ప్రజాదరణ పొందలేక పోతున్నారని కడియం శ్రీహరిని ఉద్దేశించి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.  అనివార్య కారణాల వల్ల డిప్యూటీ సీఎం పదవి పోయినా సీఎం కేసీఆర్ కు విధేయుడిగానే ఉంటానని చెప్పారు. 

ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని..ప్రజల ఆశీర్వాదం తనకే ఉందని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. స్టేషన్ ఘన్ పూర్ ప్రజలు తన నాయకత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి సభకు ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య హాజరై ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.