రైస్ బ్రాన్ ఆయిల్​పై అంతర్జాతీయ సదస్సు

రైస్ బ్రాన్ ఆయిల్​పై అంతర్జాతీయ సదస్సు

హైదరాబాద్, వెలుగు: రైస్ ​బ్రాన్ ​ఆయిల్ ​ప్రాధాన్యంపై అవగాహన కలిగించడం, దీని ఉత్పత్తిని, వాల్యూ యాడెడ్​ ప్రొడక్టులను పెంచడం, కొత్త టెక్నాలజీలను పరిచయం చేయడానికి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ (ఐఏఆర్​బీఓ), సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్​ఈఏ)  కలిసి  హైదరాబాద్​లో శనివారం అంతర్జాతీయ సదస్సును నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని  తెలంగాణ  ఇన్ఫర్మేషన్  టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ డిపార్ట్‌‌మెంట్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ సీఈఓ కమల వర్ధనరావు ప్రారంభించారు.   రైస్ బ్రాన్ ఆయిల్ పరిశ్రమకు చెందిన 500 మందితో పాటు ఈ నూనెలను ఉత్పత్తి చేసే దేశాలైన ఇండియా, చైనా, థాయ్​లాండ్​, జపాన్, వియత్నాం,  బంగ్లాదేశ్​ నుంచి ప్రత్యేక డెలిగేట్లు వచ్చారు. ఐఏఆర్​బీఓ ప్రెసిడెంట్ అశోక్ సేథియా, ఎస్​ఈఏ ఇండియా ప్రెసిడెంట్ అజయ్ జన్​జన్​వాలా, ఐఏఆర్​బీఓ సెక్రటరీ జనరల్ బీవీ మెహతా,  ఐసీఆర్​బీఓ కాన్ఫరెన్స్ కన్వీనర్  ప్రబోధ్ హల్డే తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో పసుపు విప్లవం..

ఈ సందర్భంగా  జయేష్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వంట నూనెల ఉత్పత్తికి పెద్దపీట వేస్తోందని, దీనివల్ల రాష్ట్రంలో తెలంగాణ పసుపు విప్లవం వస్తోందని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ మౌలిక సదుపాయాలను మరింత పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ‘‘ ప్రభుత్వ బడ్జెట్లో 60 శాతం వ్యవసాయం కోసమే కేటాయించింది. దీనివల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతున్నాయి. రైతు బంధు,  రైతు బీమాల ద్వారా మేలు జరుగుతోంది. వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి కోసం అగ్రి యూనివర్సిటీని ఏర్పాటు చేశాం.  రాష్ట్రంలోకి ఎవరైనా సులభంగా బిజినెస్​చేసేలా టీఎస్​ ఐపాస్ ఇస్తున్నాం.​ మన దగ్గర వరి ఉత్పత్తి చాలా బాగుంది. ఇప్పుడు ఆయిల్ పామ్ సాగు కోసం సుమారు 20 లక్షల హెక్టార్ల భూమిని కేటాయించాం. దీనివల్ల వంటనూనెల దిగుమతులు తగ్గుతాయి”  అని వివరించారు. కమలవర్ధన రావు మాట్లాడుతూ దేశీయంగా నూనెల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం కొన్ని వంటనూనెల దిగుమతులపై సుంకాలను పెంచిందని అన్నారు.  రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి పెరిగితే దిగుమతులు తగ్గుతాయని చెప్పారు. నువ్వులు, వేరుశెనగ,  రైస్ బ్రాన్ ఆయిల్  వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.