పనిచేయని లోకల్ నెంబర్లతో ఫారిన్​ కాల్స్

పనిచేయని లోకల్ నెంబర్లతో ఫారిన్​ కాల్స్

టెలికాం రెవెన్యూకి భారీ గండి​

మోసగాళ్ల చేతిలోకి లక్షల కొద్దీ డాలర్లు

కట్టడి చేయలేకపోతున్న ప్రభుత్వం, ట్రాయ్

యూజర్లు రిపోర్ట్ చేయాలి

సెన్సిటివ్ డేటా లాగుతున్న టెర్రరిస్ట్‌‌లు

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: ఈ మధ్యన చాలా ఇంటర్నేషనల్ కాల్స్ లోకల్ నెంబర్లతో రావడం పెరిగిపోయింది. ఈ విషయం చాలా మంది యూజర్లు కూడా గమనించే ఉంటారు. విదేశాల్లో ఉండే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్  నుంచి వచ్చే చాలా కాల్స్‌‌కు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ఏదో టెక్నికల్ సమస్యతో ఇలా అవుతుందని యూజర్లు పక్కన పెట్టేస్తున్నారు. కానీ.. ఇలాంటి కాల్స్ వస్తే తమకు రిపోర్ట్ చేయాలని పదే పదే డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ టెల్కో రిక్వెస్ట్ చేసినా ఎవరూ స్పందించని కూడా స్పందించట్లే. కానీ ఇది చాలా పెద్ద ఫ్రాడ్ అని, దీని వల్ల మన టెల్కోలకు, ప్రభుత్వానికి భారీ మొత్తంలో రెవెన్యూ నష్టం ఏర్పడటమే కాకుండా.. జాతీ రక్షణకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని కేంద్రం హెచ్చరిస్తోంది. దీన్ని సిమ్–బాక్స్ ఫ్రాడ్ లేదా ఇంటర్‌‌‌‌కనెక్ట్ బైపాస్ ఫ్రాడ్ లేదా కాల్ మాస్కింగ్ లేదా గ్రే రూటింగ్ అంటారు. అక్రమంగా ఇంటర్నేషనల్ కాల్స్‌‌ను లోకల్ కాల్స్ మాదిరిగా కన్వర్ట్ చేస్తారు. ఇలా చేయడం ద్వారా గ్లోబల్‌‌గా ఉన్న టెలికాం కంపెనీల నుంచి మోసగాళ్లు లక్షల కొద్దీ డాలర్లను దారి మళ్లిస్తారు. దీంతో ప్రభుత్వానికి భారీ మొత్తంలో పన్ను నష్టం ఏర్పడుతుంది.

కమ్యూనికేషన్స్ ఫ్రాడ్ కంట్రోల్ అసోసియేషన్ రిపోర్ట్ చేసిన 2019 గ్లోబల్ టెలికాం ఫ్రాడ్ సర్వే ప్రకారం.. సిమ్–బాక్స్ మోసాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెల్కోలు తమ ఇయర్లీ రెవెన్యూల్లో 28 బిలియన్ డాలర్ల వరకు నష్టపోయాయి. రోజురోజుకు ఈ మోసాలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. గ్రే రూటింగ్‌‌ను నిరోధించాలని టెల్కోలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. మోసగాళ్లు కొత్త కొత్త టెక్నాలజీతో మరింత ముందుకు పోతున్నారు. ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చే కాల్స్‌‌ విషయంలో టర్మినేటింగ్ నెట్‌‌వర్క్ ఆపరేటర్‌‌‌‌కు ఇండియన్ ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టాన్స్ ఆపరేటర్(ఐఎల్‌‌డీఓ) ఇంటర్నేషనల్ టర్మినేషన్ ఛార్జ్ చెల్లిస్తాడు. అయితే మోసగాళ్లు ఇంటర్నేషనల్ టర్మినేషనల్ ఛార్జ్‌‌(ఐటీసీ)కి, డొమెస్టిక్ టర్మినేషన్ ఛార్జ్‌‌(డీటీసీ)కి మధ్యనున్న డిఫరెన్స్‌‌ను తమ జేబులో వేసుకుంటున్నాడు.  ఒకే ఆపరేటర్ నెట్‌‌వర్క్ నుంచి కాల్స్ వెళ్లేలా చేసి డీటీసీ జీరో చేస్తున్నారు. మొత్తం ఐటీసీని వారి జేబులోకి వెళ్లేలా మోసగాళ్లు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఐటీసీకి, డీటీసీకి మధ్య బాగా ఎక్కువగా గ్యాప్ ఉండటం కూడా మోసగాళ్లకు ప్రయోజనకరంగా మారింది. 2003 నుంచి ఈ ఛార్జీలను నాలుగు సార్లు రివైజ్ చేశారు. అయినా కూడా ఈ ఛార్జీల్లో చాలా గ్యాప్ ఉంది. టెల్కోలు ఇంటర్నేషనల్ వాయిస్ యూసేజ్‌‌ను సెపరేట్‌‌గా రిపోర్ట్ చేయవు. నెట్‌‌వర్క్‌‌పై మొత్తం ఎన్ని నిమిషాలు వాయిస్ యూసేజ్ జరిగిందో మాత్రమే రిపోర్ట్ చేస్తాయి. 2019–20లో జియో, ఎయిర్‌‌‌‌టెల్, వొడాఫోన్ ఐడియాల కంబైన్డ్ వాయిస్ యూసేజ్ 8,785 బిలియన్ మినిట్స్‌‌గా ఉంది. వీటిలో ఐటీసీ ఒక నిమిషానికి 30 పైసలుగా, డీటీసీ 6 పైసలుగా ఉంది. మోసగాళ్ల చేతిలోకి నిమిషానికి రూ.0.24 వెళ్లింది.  మొత్తం వాయిస్ యూసేజ్‌‌లో 50 బిలియన్ మినిట్స్‌‌ను మోసగాళ్లు సిమ్ బాక్స్‌‌లోకి మరలించారు. అంటే టెల్కోలకు యాన్యువల్‌‌గా రూ.1,200 కోట్ల నష్టం వాటిల్లిందన్నమాట. ప్రభుత్వం లైసెన్స్ ఫీజుల కింద 8 శాతం, జీఎస్టీ కింద 18 శాతం నష్టపోయింది. ఇది అంచనా మాత్రమే. అసలు నష్టం ఇంకా ఎక్కువ ఉంటుందని టెలికం ఎక్స్​పర్టులు చెబుతున్నారు.

నిమిషానికి ఐటీసీ రూ.0.30

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) 2003లో ఐటీసీని ని మిషానికి రూ.0.30గా నిర్ణయించింది. అన్ని రకాల టర్మినేషన్‌ కాల్స్‌‌కు ఈ ఛార్జ్‌‌లు ఫిక్స్‌‌డ్‌‌గా పేర్కొంది. ప్రస్తుతం ఐటీసీ రూ.0.65గా, డీటీసీ రూ.0.06గా ఉంది. 2016–17 నుంచి క్యారియర్ రూట్ ద్వారా ఇంటర్నేషనల్ ఇన్‌‌కమిం గ్ వాయిస్ టారిఫ్‌‌ బాగా తగ్గిపోతుందని రెగ్యులేటర్ కూడా నోటీసు చేసింది. అంతేకాక ఓటీటీ కమ్యూనికేషన్ అప్లికేషన్స్, గ్రే రూట్ ఆపరేషన్స్ ద్వారా కూడా ఫుల్ కాంపిటీషన్ వస్తోంది. ఫా రిన్‌‌ క్యారియర్స్‌‌కు కాల్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ ఛార్జీలను చెల్లించాల్సి వస్తుందని.. ఇంటర్నేషనల్ కాల్స్ పొందినట్టు తక్కువ మొత్తంలో పొందుతున్నట్టు ఐఎల్‌‌డీఓలు, సర్వీసు ప్రొవైడర్లు ఆరోపిస్తున్నాయి. ఫారిన్ ఆపరేటర్‌‌‌‌కు కాల్ చేస్తే నిమిషానికి ఐటీసీ కింద ఇండియన్ టెల్కోలు రూ.3.50 చెల్లించాల్సి వస్తుంది. కానీ ఇంటర్నేషనల్ ఇన్‌‌కమింగ్ కాల్స్‌‌ను టర్మినేట్ చేసుకున్నప్పుడు మాత్రం నిమిషానికి కేవలం రూ.0.30 పొందుతున్నామని ఇండియన్ సర్వీసు ప్రొవైడర్లు చెబుతున్నాయి. ఒకవేళ ఐటీసీని పెంచాల్సి వస్తే.. గ్రే రూట్ బైపాస్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది. దాని వల్ల నేషనల్ సెక్యూరిటీకి ప్రమాదం వాటిల్లుతుంది. అంతేకాక టెల్కోలు రెవెన్యూ లాస్ అవుతున్నాయి.
ఇల్లీగల్ ఎక్స్చేంజ్‌‌లు మస్తు బయటపడ్డాయ్!

సిమ్-బాక్స్ ఫ్రాడ్ టెల్కోలకు రెవెన్యూ లాస్ కంటే నేషనల్ సెక్యూరిటీకే మరింత ప్రమాదకరంగా మారుతుందని రిపోర్టులు చెబుతున్నాయి. 2017లో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్‌‌ల నుంచి వచ్చే కాల్స్‌‌కు సాయం చేస్తోన్న ఇల్లీగల్ ఎక్స్చేంజ్‌‌ను గుర్తించారు. వీరు ఆ దేశ కాల్స్‌‌ను లోకల్ కాల్స్‌‌గా మార్చి మనీని సంపాదించడమే కాకుండా.. ఇండియాలో ఆర్మీ ఆఫీసర్లకు కాల్స్ చేసేందుకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సాయం చేస్తున్నారు. దేశ సెక్యూరిటీకి సంబంధించిన సెన్సిటివ్ డేటాను రాబడుతున్నారు. 2020 మే నెలలో ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ కూడా సిమ్ బాక్స్‌‌ల ద్వారా ఇంటర్‌‌‌‌కనెక్ట్ రూట్‌‌లను తప్పుదోవ పట్టిస్తోన్న ఇల్లీగల్ ఎక్స్చేంజ్‌‌ను గుర్తించారు. గత కొన్నేళ్లుగా ఇలాంటి ఎక్స్చేంజ్‌‌లు చాలా బయటపడ్డాయి.  టెర్రరిస్ట్‌‌లు సిమ్ బాక్స్‌‌ల ద్వారా కాల్స్ రూట్‌‌ను మార్చి, వారి కాలర్ లైన్‌‌ ఐడెంటిఫికేషన్‌‌ను ఎవరూ గుర్తించకుండా జాగ్రత్తపడతారు. దీంతో కాల్స్‌‌ను ట్రాక్ చేయడం ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ , ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు కష్టంగా మారుతోంది.  ఇల్లీగల్ గ్రే రూట్స్‌‌ను గుర్తించేందుకు, బ్లాక్ చేసేందుకు ప్రభుత్వం, ట్రాయ్ చాలా ప్రయత్నిస్తోంది. సిస్టమ్‌‌లో చాలా లూప్‌‌హోల్స్ ఉన్నాయి. తొలుత వాటిని అడ్రస్ చేయాల్సి ఉంది. డీలర్ నెట్‌‌వర్క్‌‌లు, ఏజెంట్లు ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ కార్డులను జారీ చేస్తుంటారు. ఇలాంటి వాటిపై యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. కేవైసీ మెకానిజంతోనే సిమ్‌‌ కార్డులను జారీ చేసేలా టెల్కోలు, ప్రభుత్వాలు కృషి చేయాలి.