హైదరాబాద్, వెలుగు: దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వైట్ కేన్ డే వేడుకలు జరిగాయి. గురువారం కోఠి ఉమెన్స్ కాలేజ్ నుంచి ఉస్మానియా మెడికల్ కాలేజ్ వరకు కళ్లకు గంతలు కట్టుకొని వైట్ కేన్ లతో దివ్యాంగుల శాఖ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ర్యాలీ నిర్వహించారు. అంధుల స్వయంప్రతిపత్తి, ఆత్మగౌరవానికి ప్రతీకగా వైట్ కేన్ డే నిర్వహిస్తున్నామని డైరెక్టర్ తెలిపారు.
ప్రతి ఏటా అక్టోబర్ 15న దృష్టి లోపం ఉన్నవారి నడకకు ఊతమిచ్చే తెల్లటి కర్ర ప్రాముఖ్యతను, వారి స్వయంప్రతిపత్తిని, హుందాతనాన్ని సమాజానికి చాటిచెప్పడమే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. వైట్ కేన్ అనేది కేవలం అంధులు నడవడానికి ఉపయోగించే ఒక సాధనం మాత్రమే కాదని, అది వారి స్వేచ్ఛకు, ఆత్మవిశ్వాసానికి, సమాజంలో సురక్షితంగా సంచరించే హక్కుకు ప్రతీక అని అన్నారు.
దృష్టి లోపం ఉన్నవారు ఇతరులపై ఆధారపడకుండా, స్వతంత్రంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఇది ఎంతో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అంధులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకోవాలని డైరెక్టర్ సూచించారు. రోస్టర్ పాయింట్లలో ఇతర రిజర్వేషన్లతో పోలిస్తే అంధులకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని తెలిపారు.
