నేడు రాంచీలో గ్రాండ్ గా యోగా డే

నేడు రాంచీలో గ్రాండ్ గా యోగా డే

రాంచీ: ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా జార్ఖండ్ రాజధాని రాంచీలోని ప్రభాత్ తారా గ్రౌండ్ లో జరిగే వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు.  శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి కార్యక్రమం మొదలు కానుంది. దాదాపు 40 వేల మంది దీంట్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే గ్రౌండ్ లోకి అనుమతిస్తారు. దీని కోసం గురువారం రాత్రి నుంచే ఉచిత బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొనేవారి కోసం 200 లెవట్రీలు, 200 తాగునీటి కేంద్రాలు, 8 మెడికల్ టీమ్ లు, 21 అంబులెన్స్ లు సిద్ధం చేశారు.  జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్  సిబ్బంది, వందకుపైగా సీసీటీవీలతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాన్ని లైవ్ లో చూసేందుకు  28 ఎల్ఈడీ స్క్రీన్లు రెడీ చేశారు.

ఈ ఏడాది యోగా నినాదం ‘యోగా ఫర్ హార్ట్’.  ప్రధాని మోడీతోపాటు జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము, సీఎం రఘుబర్ దాస్,  కేంద్ర మంత్రి శ్రీపాద్ యశోనాయక్, జార్ఖండ్ హెల్త్ మినిస్టర్ రామచంద్ర చంద్రవంశి వేదికను పంచుకోనున్నారు. ” యోగా ప్రజలను ఒక్కటి చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నాల వల్ల ప్రపంచం యోగా డేను అంగీకరించింది. రాంచీలోని వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొనడం గర్వకారణం. కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశాం” అని జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ గురువారం
వెల్లడించారు.