చైనాలో సైనిక తిరుగుబాటుపై జోరుగా ప్రచారం

చైనాలో సైనిక తిరుగుబాటుపై జోరుగా ప్రచారం

చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను ఆ దేశ సైన్యం హౌస్ అరెస్ట్ చేసిందన్న పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి  సైతం ‘చైనా ప్రెసిడెంట్ హౌస్ అరెస్ట్’ అంటూ ప్రచారం జరుగుతోందని ట్వీట్ చేశారు. దేశ రాజధాని బీజింగ్ ను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) తన కంట్రోల్ లోకి తీసుకుందని చైనా ప్రజలు కూడా ట్వీట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున సైనిక వాహనాలు బీజింగ్ నగరాన్ని చుట్టుముట్టిన కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. మరోవైపు బీజింగ్ నుంచి వెళ్లే విమానాలు, రైళ్లు, బస్సు సర్వీసులు రద్దయ్యాయంటూ కొందరు ట్వీట్ చేశారు. 

అధ్యక్షుడిగా కొనసాగాలని భావించడంతో.. 

కరోనా కాలంలో దాదాపు రెండేళ్ల పాటు దేశం వదలని జిన్ పింగ్.... ఇటీవల ఉజ్బెకిస్థాన్ లోని సమర్ఖండ్ నగరానికి వెళ్లారు. అక్కడ జరిగిన షాంఘై కో ఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే చైనాలోని కమ్యూనిస్ట్ పార్టీ టాప్ లీడర్లు సమావేశమై పార్టీ చీఫ్, ఆర్మీ ఇంచార్జి పదవుల నుంచి జిన్ పింగ్ ను తొలగించారని అంటున్నారు. వరుసగా మూడోసారి కూడా అధ్యక్షుడిగా కొనసాగాలని జిన్ పింగ్  భావిస్తున్నందు వల్లే సైనిక తిరుగుబాటుకు కారణమని చెబుతున్నారు. సమర్ఖండ్ నుంచి వచ్చాక జిన్ పింగ్ ను హౌజ్ అరెస్ట్ చేశారని చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని చైనా ఆర్మీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అక్కడి న్యూస్ ఏజెన్సీలు కానీ అధికారికంగా ప్రకటించలేదు. 

క్వారంటైన్లో ఉన్నారా ? 

మరోవైపు చైనా అమలు చేస్తున్న జీరో కోవిడ్ పాలసీ ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వాళ్లు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాలి. ఈ రూల్ మేరకు సమర్ఖండ్ నుంచి తిరిగి వచ్చిన జిన్ పింగ్ .. క్వారంటైన్ లో ఉన్నారని కొందరు చెప్తున్నారు.