- అదుపులో ముగ్గురు నిందితులు పరారీలో మరొకరు
- వరంగల్ సీపీ సన్‍ప్రీత్‍సింగ్ వెల్లడి
వరంగల్, వెలుగు: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను వరంగల్ కమిషరేట్ లోని కేయూసీ, సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ సీపీ సన్‍ప్రీత్‍సింగ్ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లా ముజ్‍పారకు చెందిన ఫిరోజ్ షేక్(37), సుఖ్చంద్ (33), యామీన్(36), ఫిరోజ్ షేక్(24), లిక్కర్ హెరాయిన్‍కు బానిసలుగా మారారు. జల్సాల కోసం చోరీలు చేసేందుకు ముఠాగా ఏర్పడ్డారు. పట్టపగలు తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసి చోరీ చేసి గోల్డ్, నగదు ఎత్తుకెళ్లేవారు.
పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‍లోని పలు ప్రాంతాల్లో చోరీలు చేశారు. కొన్ని నెలల కింద పశ్చిమ బెంగాల్ పోలీసులకు పట్టుబడి రెండు నెలల కింద జైలు నుంచి విడుదల అయ్యారు. తెలంగాణలో చోరీలకు ప్లాన్ చేసి.. గత డిసెంబర్ 17న హనుమకొండకు వచ్చారు. కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధి పరిమళ కాలనీ, సప్తగిరి కాలనీల్లో రెండు ఇండ్ల తాళాలను పగలకొట్టి బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అదే నెలలో మరోసారి ప్రయత్నించి విఫలం చెందారు.
ఈనెల10న గోపాలపురం పరిధి శివసాయి కాలనీలో ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని15 తులాల బంగారం, 5 తులాల వెండి, నగదు ఎత్తుకెళ్లారు. బాధిత కుటుంబాల ఫిర్యాదుతో సీపీ ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, క్రైమ్ అడిషనల్ డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, ప్రశాంత్‍రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ లతో నిఘా పెట్టారు.
బుధవారం ముఠా మరోసారి చోరీకి సిటీకి వచ్చింది. పోలీసులు కేయూసీ జంక్షన్ వద్ద తనిఖీలు చేస్తుండగా చూసి ముఠా పారిపోయేందుకు యత్నిస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుల వద్ద సొత్తు స్వాధీనం చేసుకోగా.. ఫిరోజ్ షేక్ (24) పరారీలో ఉన్నాడు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీసీఎస్ ఇన్ స్పెక్టర్ కె.రామకృష్ణ, కేయూ ఇన్ స్పెక్టర్ ఎస్.రవికుమార్, సిబ్బందిని సీపీ సన్‍ప్రీత్‍సింగ్ అభినందించారు.
