కొత్త లేబర్ కోడ్స్ రద్దు చేయాలి : ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జనక్ ప్రసాద్

 కొత్త లేబర్ కోడ్స్ రద్దు చేయాలి : ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జనక్ ప్రసాద్

బషీర్​బాగ్​, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జనక్ ప్రసాద్ డిమాండ్​ చేశారు. హిమాయత్ నగర్ లోని ఏఐటీయూసీ భవన్ లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.యూసుఫ్‌‌‌‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జనక్​ ప్రసాద్​ మాట్లాడారు. కొత్త కోడ్ ల వల్ల కార్మికుల కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, యూనియన్ హక్కులు నిర్వీర్యం అవుతున్నాయన్నారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, ఈ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం బాధాకరమన్నారు.

 విదేశీ పెట్టుబడులు, బడా పారిశ్రామికవేత్తల మెప్పు కోసమే కేంద్రం ఈ చర్యకు పూనుకుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టడంతో పాటు గవర్నర్, సీఎంకు వినతిపత్రాలు అందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఐఎన్​టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌‌‌‌.డి.చంద్రశేఖర్‌‌‌‌, ఉపాధ్యక్షుడు విజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌, కార్యదర్శి బి.వెంకటేశం, , బీఆర్‌‌‌‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు పాల్గొన్నారు.