హైదరాబాద్/గచ్చిబౌలి, వెలుగు: దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన తల్లి మాగంటి మహానంద కుమారి శనివారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ అనారోగ్యం, ఆసుపత్రిలో చేరిన సమయంలో అతని సంరక్షణ, పర్యవేక్షణ పట్ల తీవ్ర నిర్లక్ష్యం సహా మృతికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
తల్లిగా తన కొడుకును చూడనివ్వలేదని, బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను మాత్రం ఐసీయూలోకి పంపించారని తెలిపారు. గోపీనాథ్ మృతి చుట్టూ ఏదో జరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను మాత్రమే హాస్పిటల్‌లోకి అనుమతించడంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. “నా కొడుకు మరణం చుట్టూ ఉన్న అనుమానాస్పద పరిస్థితులపై తీవ్ర వేదనతో ఫిర్యాదు చేస్తున్నాను. నా కొడుకు మృతికి ముందు కొన్ని నెలలుగా వివిధ అనారోగ్యాలు, కోమార్బిడిటీస్ తో బాధపడుతున్నాడు.
వివిధ సందర్భాల్లో గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందాడు. జూన్ 8, 2025న మృతి చెందినట్లు ఆసుపత్రి అధికారికంగా ప్రకటించినప్పటికీ, నా కొడుకు మరణాన్ని ప్రకటించడంలో అనేక అక్రమాలు, జాప్యం జరిగిందని అనుమానిస్తున్నాను. కిడ్నీలు ఫెయిల్ అయినప్పటికీ తీవ్రతను తగిన విధంగా గుర్తించలేదు. ఒక కిడ్నీని తొలగించిన తర్వాత నిర్లక్ష్యం కారణంగా డయాలసిస్ ప్రారంభించడంలో జాప్యం జరిగింది. దీని ఫలితంగా అకాల మరణం సంభవించింది’’ అని ఫిర్యాదులో ఆమె వివరించారు.
నన్ను పంపలే.. కేటీఆర్‌ను మాత్రం పంపారు..
ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన కొడుకును చూడడానికి తాను వెళితే లోపలికి అనుమతించలేదని మహానంద కుమారి తెలిపారు. “నా కొడుకు జూన్ 5, 2025న ఏఐజీ హాస్పిటల్‌లో చేరాడు. ఆసుపత్రిలో నా కొడుకును చూడటానికి నన్ను అనుమతించలేదు. ఐసీయూలో వెంటిలేటర్‌లో ఉన్నప్పుడు కూడా నన్ను చూడనివ్వలేదు. ఇందుకు కారణం జూన్ 6న సునీత కూతురు దిషిరా సంతకం చేసిన లెటర్ ద్వారా భద్రతా సిబ్బందిని ఆదేశించారు. నేను పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ కలవనివ్వలేదు.
కేటీఆర్‌ను మాత్రం నా కొడుకును చూసేందుకు పంపారు. గోపీనాథ్‌ను చూసి వచ్చిన తర్వాత కేటీఆర్ నన్ను పట్టించుకోకుండా, ఎలాంటి విషయాలు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. జూన్ 8న గోపీనాథ్ మృతిని అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా నా కొడుకును చూడటానికి నన్ను అనుమతించలేదు” అని ఆమె పేర్కొన్నారు. ‘‘గన్‌మెన్, సెక్యూరిటీ సిబ్బంది కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారు. గోపీనాథ్ కుప్పకూలినప్పుడు వారు అక్కడ లేరని, ఒకవేళ ఉన్నా స్పందించలేదని తెలుస్తున్నది. క్లిష్టమైన సమయంలో సిబ్బంది లేకపోవడం, నిర్లక్ష్యం చూపడం చాలా అనుమానాలు కలిగిస్తున్నాయి”అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
