ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది
  •     విధి నిర్వహణలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
  •     అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం
  •     సైబరాబాద్​ సీపీ అవినాశ్​ మహంతి

హైదరాబాద్‌‌‌‌,వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ ‘మాజీ మంత్రి శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌’పై హత్యకు కుట్ర కేసులో దర్యాప్తు కొనసాగుతున్నదని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నదని, ఈ రెండు కేసుల్లో పూర్తి వివరాలు సేకరించిన తర్వాత కేసుల స్టేటస్‌‌‌‌ గురించి వెల్లడిస్తామని ఆయన చెప్పారు. 

శనివారం కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జరిగిన కేసులకు సంబంధించిన వార్షిక నివేదికను సీపీ విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. కేసులు నమోదు, దర్యాప్తు, కోర్టులో విచారణపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. విధి నిర్వహణలో అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హై ప్రొఫైల్ కేసులైన ఈ రెండు కేసులను అన్ని కోణాల్లో పరిశీలిస్తామని, పూర్తి వివరాలు అందిస్తామని స్పష్టం చేశారు.

డ్రగ్స్‌‌‌‌ కేసులో ఎవర్నీ వదలం

కబాలి తెలుగు సినిమా నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్‌‌‌‌ చౌదరి(కేపీ చౌదరి) కేసు దర్యాప్తులో ఉందని సీపీ తెలిపారు. ఈ కేసులో ఫిల్మ్‌‌‌‌ ఇండస్ట్రీకి చెందిన వారున్నారనేది కేవలం ఆరోపణలు మాత్రమేనని, డ్రగ్స్‌‌‌‌విషయంలో ఎవర్ని వదిలే ప్రసక్తి లేదన్నారు. గోవా నుంచి హైదరాబాద్‌‌‌‌కు 82.75 గ్రాముల కొకైన్‌‌‌‌ను తరలిస్తుండగా కేపీ చౌదరిని సైబరాబాద్‌‌‌‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ కేసులో చౌదరిని విచారించగా డ్రగ్స్‌‌‌‌ కింగ్‌‌‌‌పిన్‌‌‌‌ ఎడ్విన్‌‌‌‌ న్యూన్స్‌‌‌‌తో పాటు పలువురు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 900 మంది నటులతో సత్సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. విచారణలో కేపీ చౌదరి వెల్లడించిన వివరాల ప్రకారం ప్రతి ఒక్కర్నీ విచారిస్తామని సీపీ తెలిపారు.