మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడుల వరద.. డెట్ ఎంఎఫ్లకు రూ. 1.6 లక్షల కోట్లు.. యాంఫీ రిపోర్ట్

మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడుల వరద.. డెట్ ఎంఎఫ్లకు రూ. 1.6 లక్షల కోట్లు.. యాంఫీ రిపోర్ట్

న్యూఢిల్లీ: డెట్​/ఫిక్స్​డ్​-ఇన్​కమ్​ మ్యూచువల్ ఫండ్లలోకి (ఎంఎఫ్​) గత నెల పెట్టుబడులు వెల్లువెత్తాయి. లిక్విడ్​ ఓవర్​నైట్ ఫండ్లలో బలమైన పెట్టుబడుల కారణంగా వీటి విలువ రూ. 1.6 లక్షల కోట్లకు చేరింది.  అయితే, సెప్టెంబరులో రూ. 1.02 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. 

అక్టోబరులో పెట్టుబడులు డెట్-ఆధారిత మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువను దాదాపు 10 శాతం పెంచాయి. సెప్టెంబర్​లో రూ. 17.8 లక్షల కోట్లు ఉన్న ఏయూఎం అక్టోబర్​ నెలాఖరు నాటికి రూ. 19.51 లక్షల కోట్లకు పెరిగినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) వెల్లడించింది. దీని ప్రకారం.. ఆగస్టులో, ఈ ఫండ్లలో రూ. 7,980 కోట్ల ఔట్​ఫ్లో ఉంది.  

జులైలో మాత్రం రూ. 1.07 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. ఆర్​బీఐ వడ్డీ రేట్ల కోత గురించి మరింత స్పష్టత కోసం ప్రస్తుతం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. ఫండ్ల ప్రవాహాలు లిక్విడ్​, మనీ మార్కెట్, హై-క్వాలిటీ అక్రూవల్ విభాగాలలోనే ఉండవచ్చని మార్నింగ్‌‌స్టార్ ఇన్వెస్ట్‌‌మెంట్ రీసెర్చ్ ఎనలిస్ట్​ నెహల్ మేశ్రామ్​ చెప్పారు. సంస్థాగత పెట్టుబడిదారులు మిగులు డబ్బులు తిరిగి పెట్టుబడి పెట్టడం వలన అక్టోబర్​లో ఔట్​ఫ్లో విపరీతంగా పెరిగిందని వివరించారు. 

పది కేటగిరీల్లో భారీ ఇన్వెస్ట్​మెంట్లు..

మొత్తం 16 డెట్ కేటగిరీలలో, 10 కేటగిరీలు పెద్ద ఎత్తున నికర పెట్టుబడులను ఆకర్షించాయి. వీటిలో, లిక్విడ్ ఫండ్లు రూ. 89,375 కోట్ల పెట్టుబడులతో ముందున్నాయి. సెప్టెంబరులో ​మాత్రం రూ. 66,042 కోట్ల ఔట్​ఫ్లో కనిపించింది. ఓవర్​నైట్ ఫండ్లు రూ. 24,051 కోట్లను ఆకర్షించాయి. 

మనీ మార్కెట్ ఫండ్లు కూడా బలంగా పుంజుకుని రూ. 17,916 కోట్లను సంపాదించాయి. షార్ట్​-డ్యూరేషన్ విభాగంలో ఇన్​ఫ్లోలు పుంజుకున్నాయి.  కార్పొరేట్ బాండ్ ఫండ్లలోకి రూ. 5,121 కోట్లు వచ్చాయి. క్రెడిట్​ రిస్క్​ ఫండ్స్ మాత్రం బలహీనంగా ఉన్నాయి.

  డైనమిక్ బాండ్ ఫండ్ల నుంచి ఇన్వెస్టర్లు రూ. 232 కోట్లను వెనక్కి తీసుకున్నారు. గిల్ట్ ఫండ్లలో రూ. 931 కోట్ల ఔట్​ఫ్లో ఉంది. ఈక్విటీ ఎంఎఫ్​లలోకి అక్టోబర్​లో రూ. 24,690 కోట్లు వచ్చాయి. ఇవి సెప్టెంబర్​లో రూ. 30,421 కోట్లను ఆకర్షించాయి.