ప్రధాని మోడీ సభకు ఇంటింటికీ ఆహ్వానం

ప్రధాని మోడీ సభకు ఇంటింటికీ ఆహ్వానం
  • ప్రధాని మోడీ సభకు ఇంటింటికీ ఆహ్వానం
  • వచ్చే నెల 3న హైదరాబాద్​లో బహిరంగ సభ
  • నియోజకవర్గ ఇన్​చార్జుల నియామకం
  • 10 లక్షల మంది తరలివచ్చేలా ఏర్పాట్లు

హైదరాబాద్​, వెలుగు:  ప్రధాని నరేంద్రమోడీ సభ కోసం బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ జనసమీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే నెల 3న హైదరాబాద్ లోని పరేడ్​గ్రౌండ్​ లో మోడీ బహిరంగ సభ జరగనుంది. ఇందులో భాగంగా ఆదివారం బీజేపీ స్టేట్​ ఆఫీసులో నియోజకవర్గ ఇన్​చార్జులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్​ భేటీ అయ్యారు. ఇతర కమిటీలతోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. మోడీ సభకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఆహ్వానం పంపాలని నిర్ణయించారు. 

ఇందుకోసం 50 లక్షల ఆహ్వాన పత్రికలు సిద్ధం చేస్తున్నారు. సభకు జనాలను తీసుకువచ్చేందుకు నియోజకవర్గ ఇన్​చార్జులను నియమించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఈ బహిరంగ సభకు హాజరుకానున్న నేపథ్యంలో జన సమీకరణ, విరాళాల సేకరణ, కార్యక్రమాల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం 30 మంది చొప్పున, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సగటున 10 వేలకు తగ్గకుండా ప్రజలు సభకు హాజరయ్యేలా చూడాలని బండి సంజయ్ అన్నారు.

ఒక్కో నియోజకవర్గానికి 10 వేల మంది చొప్పున మొత్తం 10 లక్షల మంది హాజరయ్యేలా చూడాలని సూచించారు. గతంలో ఏ ఇతర పార్టీ ఈ స్థాయిలో బహిరంగ సభ నిర్వహించలేదు అనేలా సభను విజయవంతం చేయాలన్నారు. పోలింగ్ బూత్ అధ్యక్షులు, సభ్యుల నుంచి రూ.1,000, మండల స్థాయి నేతల నుంచి రూ. 20 వేలు, జిల్లా నేతల నుంచి రూ.50 వేలు, రాష్ట్ర నేతల నుంచి రూ. లక్ష చొప్పున విరాళాలు తీసుకోనున్నట్లు తెలిపారు. నేషనల్​ ఎగ్జిక్యూటివ్​ కౌన్సిల్​ మీటింగ్​ నిర్వహణలో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతోనే విరాళాల సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా విరాళాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు స్వీకరించవద్దన్నారు. పార్టీ రాష్ట్ర శాఖ పేరిట ఉన్న ఖాతాకు మాత్రమే డిజిటల్ పేమెంట్లు చేయాలని చెప్పారు.  

రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుతున్నారని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. అందులో భాగంగానే తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించి.. జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించిందన్నారు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపైన ఉందని బండి సంజయ్​ చెప్పారు. అసెంబ్లీ ప్రభారీలంతా తమకు అప్పగించిన నియోజకవర్గ కేంద్రాలకు ఈ నెల 22న వెళ్లి స్థానిక నేతలతో సమావేశమై జన సమీకరణతోపాటు స్థానికంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు సన్నద్ధం చేయాలని ఆయన సూచించారు.

కాగా, ఈ నెలలో నిర్వహించబోయే యోగా దివస్, జాతీయ ఎమర్జెన్సీ డే వంటి కార్యక్రమాల సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపైనా బండి సంజయ్ తోపాటు లక్ష్మణ్, అరవింద్ మీనన్ ఆయా నేతలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా.. బీజేపీ స్టేట్​ ఆఫీస్​లో కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి, డీకే అరుణ ఆధ్వర్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు.