
న్యూఢిల్లీ: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఐపీఎల్ పద్నాలుగో సీజన్ షెడ్యూల్ విడుదలైంది. హాట్ సమ్మర్‌లో అభిమానుల్లో జోష్ నింపేందుకు పొట్టి లీగ్ సమాయత్తమవుతోంది. ఏప్రిల్ 9న మొదలయ్యే ఐపీఎల్.. మే 30న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ విడత ఐపీఎల్‌లో హోమ్ గేమ్స్ ఉండవు. మ్యాచ్‌ల నిర్వహణకు బీసీసీఐ ఆరు వేదికలను ఎంపిక చేసింది. పింక్ బాల్ టెస్ట్‌కు వేదికగా నిలిచిన అహ్మదాబాద్‌లోని మోడీ క్రికెట్ స్టేడియంలో ప్లేఆఫ్స్‌తోపాటు ఫైనల్ గేమ్ జరగనుంది. ఈ స్టేడియంతోపాటు ముంబై, చెన్నై, కోల్‌కత్తా, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో ఈ టోర్నమెంట్ జరగనుంది. అయితే కరోనా వ్యాప్తి భయాందోళనల దృష్ట్యా ఈ టోర్నీలోని ఏ మ్యాచ్‌కూ ప్రేక్షకులకు అనుమతి లేదు. కాగా, ఐపీఎల్ మ్యాచ్‌ల ఆతిథ్యం హైదరాబాద్‌కు దక్కుతుందని భావించినా నిరాశే మిగిలింది.