మళ్లీ ఢిల్లీనే..కేకేఆర్‌‌‌‌పై క్యాపిటల్స్‌‌‌‌ మరో విక్టరీ

మళ్లీ ఢిల్లీనే..కేకేఆర్‌‌‌‌పై క్యాపిటల్స్‌‌‌‌ మరో విక్టరీ
  • రాణించిన కుల్దీప్, వార్నర్ 
  • కోల్‌‌‌‌కతాకు వరుసగా ఐదో ఓటమి

ముంబై: కోల్‌‌‌‌కతా నైట్ రైడర్స్‌‌‌‌పై   ఢిల్లీ క్యాపిటల్స్  మరోసారి ఆధిపత్యం చూపెట్టింది. తన మాజీ జట్టుపై కుల్దీప్ యాదవ్(4/14) మళ్లీ మాయాజాలం చేస్తూ ఐపీఎల్‌‌‌‌లో కెరీర్‌‌‌‌  బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వడంతో  గురువారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో  కేకేఆర్ పై 4 వికెట్లతో గెలిచిన ఢిల్లీ ఈ సీజన్ లో నాలుగో విక్టరీ కైవసం చేసుకుంది. మరోవైపు చెత్త బ్యాటింగ్‌‌‌‌తో కోల్‌‌‌‌కతా వరుసగా ఐదో ఓటమితో ప్లేఆఫ్‌‌‌‌ రేసులో వెనుకబడింది. లో స్కోరింగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో  టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్​కతా నిర్ణీత 20 ఓవర్లలో 146/9 స్కోరు మాత్రమే చేసింది. నితీశ్ రాణా (34 బాల్స్ లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57) హాఫ్ సెంచరీతో మెరవగా శ్రేయస్ అయ్యర్ (37 బాల్స్ లో 4 ఫోర్లతో 42) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో  కుల్దీప్ తో పాటు ముస్తాఫిజుర్ (3/18) ఆకట్టుకున్నాడు. అనంతరం 19 ఓవర్లలో 150/6 స్కోరు చేసిన ఢిల్లీ గెలుపొందింది. మొదట్లో వార్నర్ (26 బాల్స్ లో 8 ఫోర్లతో 42) సత్తా చాటగా..  రోవ్‌‌‌‌మన్‌‌‌‌ పావెల్‌‌‌‌ (16 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌, 3 సిక్సర్లతో 33 నాటౌట్) ఫినిషింగ్‌‌‌‌ టచ్‌‌‌‌ ఇచ్చాడు.  కేకేఆర్ బౌలర్లలో ఉమేశ్ (3/24) రాణించాడు. కుల్దీప్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌గా నిలిచాడు.  

కుల్దీప్ మ్యాజిక్..

ఢిల్లీ బౌలర్ల దెబ్బకు కేకేఆర్‌‌‌‌ తల్లడిల్లింది. ఓపెనర్లు ఆరోన్‌‌‌‌ ఫించ్ (3), వెంకటేశ్ అయ్యర్ (6) విఫలమవడంతో పవర్ ప్లేలో 29/2తో ఇబ్బందుల్లో పడింది. ఇక ఎనిమిదో ఓవర్లో బౌలింగ్ కు వచ్చిన కుల్దీప్ వరుస బంతుల్లో ఇంద్రజిత్ (6), నరైన్ (0)ను ఔట్ చేసి ఆ టీమ్‌‌‌‌కు డబుల్‌‌‌‌ షాకిచ్చాడు. ఈ దశలో శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో సగం ఓవర్లకు కోల్ కతా 56/4తో నిలిచింది. ఈ 60 బంతుల్లో కేవలం మూడు ఫోర్లే వచ్చాయంటే ఢిల్లీ బౌలర్లు ఎలా బౌలింగ్‌‌‌‌ చేశారో చెప్పొచ్చు.  ఇక, శ్రేయస్‌‌‌‌, రాణా  కుదురుకుంటున్న దశలో మరోసారి బౌలింగ్ కు వచ్చిన కుల్దీప్.. శ్రేయస్ తో పాటు రసెల్ (0)ను పెవిలియన్ పంపి కేకేఆర్ నడ్డి విరిచాడు. దాంతో, ఆ జట్టు వంద కూడా దాటడం కష్టమే అనిపించింది. కానీ, స్లాగ్‌‌‌‌ ఓవర్లలో  రాణా, రింకూ సింగ్ (23)  దూకుడుగా ఆడి విలువైన రన్స్‌‌‌‌ అందించారు. 17వ ఓవర్లో రెండు సిక్సర్లతో గేర్ మార్చిన రాణా 19వ ఓవర్లో మరో సిక్స్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆఖరి ఓవర్లో  రింకూ, రాణాతో పాటు సౌథీ (0) వికెట్లు తీసిన ముస్తాఫిజుర్ కేవలం 2 రన్సే ఇవ్వడంతో కేకేఆర్ 150కి దగ్గరగా వచ్చి ఆగింది.

తడబడుతూనే..

కేకేఆర్‌‌‌‌ మాదిరిగా ఢిల్లీ ఇన్నింగ్స్‌‌‌‌ కూడా తడబడుతూనే సాగింది. టార్గెట్ చిన్నదే అయినా తొలి బంతికే పృథ్వీ షా (0)ను ఉమేశ్, తర్వాతి ఓవర్లో మిచెల్ మార్ష్ (13)ను హర్షిత్ ఔట్ చేసి ఢిల్లీని ఒత్తిడిలోకి నెట్టారు. ఈ దశలో వార్నర్, లలిత్ యాదవ్ (22) ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూనే బౌండ్రీలూ సాధించడంతో 9 ఓవర్లలోనే 80/2తో ఢిల్లీ విక్టరీకి దగ్గరైంది. కానీ వరుస ఓవర్లలో వార్నర్, పంత్ (2)ను ఉమేశ్ పెవిలియన్ పంపగా.. లలిత్ ను నరైన్ ఎల్బీ చేయడంతో ఒక్కసారిగా కోల్‌‌‌‌కతా రేసులోకి వచ్చింది. కానీ వారి సంతోషానికి అడ్డు తగులుతూ అక్షర్ పటేల్ (24), పావెల్ ఇన్నింగ్స్ ను గాడినపెట్టారు. 15వ ఓవర్లో 6,4 బాదిన అక్షర్ రనౌట్ గా వెనుదిరిగాడు. అప్పటికి ఢిల్లీకి 30 బాల్స్ లో 34 రన్స్ అవసరం. ఆపై శార్దూల్ (8 నాటౌట్) సపోర్ట్ తో 17వ ఓవర్లో 6,4 బాదిన పావెల్‌‌‌‌ ఢిల్లీపై ఒత్తిడి తగ్గించాడు. తర్వాతి ఓవర్లో ఇంకో సిక్స్‌‌‌‌ కొట్టిన అతను.. శ్రేయస్‌‌‌‌ వేసిన 19వ ఓవర్లో విన్నింగ్ సిక్స్ బాదాడు. 

సంక్షిప్త  స్కోర్లు

కోల్​కతా: 20 ఓవర్లలో 146/9 (నితీశ్ 57, శ్రేయస్ 42, కుల్దీప్ 4/14, ముస్తాఫిజుర్ 3/18)
ఢిల్లీ : 19 ఓవర్లలో 150/6 (వార్నర్ 42, పావెల్ 33 నాటౌట్, ఉమేశ్ 3/24)