అధిక ధరకు అమ్ముడుపోయిన స్టార్ హిట్టర్

అధిక ధరకు అమ్ముడుపోయిన స్టార్ హిట్టర్

బెంగళూరు: ఐపీఎల్ వేలం రెండో రోజు విదేశీ ఆటగాళ్లకు కాసుల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్ డేంజరస్ బ్యాట్స్ మన్ లియామ్ లివింగ్ స్టోన్ ఈ రోజు జరిగిన ఆక్షన్ లో అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. రూ.11.50 కోట్లు పెట్టి లివింగ్ స్టోన్ ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఇతర ఫ్రాంచైజీల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ.. ఈ హార్డ్ హిట్టర్ ను పట్టుబట్టి కింగ్స్ సొంతం చేసుకుంది. వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఓడియన్ స్మిత్, సౌతాఫ్రికన్ యంగ్ పేసర్ మార్కన్ జాన్సెన్ కూడా మంచి ధర పలికారు. ఓడియన్ స్మిత్ ను రూ.6 కోట్లకు పంజాబ్ కింగ్స్, జాన్సెన్ ను రూ.4.2 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుక్కున్నాయి. శ్రీలంక పేసర్ దుష్మంత చమీరా రూ.2 కోట్లకు లక్నో టీమ్ దక్కించుకుంది. భారత యంగ్ ప్లేయర్ ఖలీల్ అహ్మద్, శివం దూబే కూడా మంచి ధరే పలికారు. ఖలీల్ ను రూ.5.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్, దూబేను రూ.4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకున్నాయి.  

భారత ప్లేయర్లకు నిరాశ

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన భారత అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కిన కర్ణాటక ఆల్‌రౌండర్‌ కృష్ణప్ప గౌతమ్‌ కు ఈసారి వేలంలో తీవ్ర నిరాశ ఎదురైంది. మంచి ధర వస్తుందని ఆశించిన గౌతమ్.. కేవలం రూ.90 లక్షలకు అమ్ముడుపోయాడు. అతడ్ని లక్నో ఫ్రాంచైజీ దక్కించుకుంది. టెస్టు స్పెషలిస్టు అజింక్యా రహానె కూడా తక్కువ ధర పలికాడు. అతడ్ని రూ.1 కోటికి కోల్ కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్, పేసర్ జయంత్ యాదవ్ కూ నిరాశే ఎదురైంది. విజయ్ ను రూ.1.40 కోట్లకు, జయంత్ ను రూ.1.70 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుక్కుంది.  

మోర్గాన్కు షాక్

ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, పేసర్ క్రిస్ జోర్డాన్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్, భారత టెస్టు స్పెషలిస్ట్ ఛటేశ్వర్ పుజారా, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, ఆసీస్  డాషింగ్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ తోపాటు మార్నస్ లబుషేన్, సౌతాఫ్రికా పేసర్ లుంగీ ఎంగిడీ, సౌరభ్ తివారీ ను కొనడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీంతో వీరు అన్ సోల్ట్ గా మిగిలారు. 

మరిన్ని వార్తల కోసం:

ముఖ్యమంత్రిని ఓడించి తీరుతాం

యూపీలో గెలిచేది ఆయనే

ఒక్క సీన్ కోసం రూ. 60 కోట్లు ఖర్చు