IPL 2024 Final: టాస్ గెలిచిన సన్‌రైజర్స్‌.. ఎర్రమట్టి పిచ్‌పై ఫైనల్ పోరు

IPL 2024 Final: టాస్ గెలిచిన సన్‌రైజర్స్‌.. ఎర్రమట్టి పిచ్‌పై ఫైనల్ పోరు

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ ఫైనల్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. లీగ్‌ దశలో టేబుల్‌ టాపర్లుగా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు టైటిల్‌ పోరులో తలపడుతున్నాయి. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆరంజ్ ఆర్మీ సారథి పాట్ కమ్మిన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఫైనల్ కోసం వాడబోయే పిచ్‌ను ఎర్రమట్టితో తయారు చేశారు. నల్ల మట్టితో పిచ్‌తో పోలిస్తే దీనిపై బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. 180 నుంచి 190 పరుగులు మంచి స్కోరని పిచ్ రిపోర్టు సందర్భంగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ తెలిపాడు.

హెడ్ టు హెడ్ రికార్డు

ఇప్పటివరకూ ఈ ఇరు జట్లు 27 సార్లు తలపడగా.. కోల్‌కతా 18, సన్‌రైజర్స్ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఇక ప్రస్తుత సీజన్‌లో అయ్యర్ సేనతో తలపడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆరంజ్ ఆర్మీ ఓటమిపాలైంది. లీగ్ దశలో 4 పరుగుల స్వల్ప తేడాతో నెగ్గిన కేకేఆర్.. క్వాలిఫైయర్ 1లో 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఇప్పుడు మూడోసారి ట్రోఫీకి అడ్డుగా నిలబడింది. కమ్మిన్స్ సేన తుదిపోరులో విజయం సాధించి.. గత రెండు ఓటములకు ప్రతీకారం తీర్చుకుంటుందా..! లేదా..! అనేది చూడాలి. 

తుది జట్లు

కోల్‌కతా: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

హైదరాబాద్‌: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్.