కాంప్లిమెంటరీ టికెట్ల వల్లే వేదిక మార్పు: ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్

 కాంప్లిమెంటరీ టికెట్ల వల్లే వేదిక మార్పు:  ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్

న్యూఢిల్లీ: బెంగళూరులో ఐపీఎల్ ఫైనల్ నిర్వహించడం అసాధ్యమని తేలడంతోనే వేదికను అహ్మదాబాద్‌‌కు మార్చాల్సి వచ్చిందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. తక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్న చిన్నస్వామి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉచిత (కాంప్లిమెంటరీ) టికెట్ల కోసం భారీగా డిమాండ్ రావడమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. మే 31న జరిగే తుది పోరుకు 1.30 లక్షల సామర్థ్యం గల అహ్మదాబాద్‌‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.

 కర్నాటక ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని ప్రతీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు మూడు చొప్పున ఉచిత ఐపీఎల్ టికెట్లు కేటాయించాలి. కేవలం 40 వేల సామర్థ్యం ఉన్న చిన్నస్వామి స్టేడియంలో ప్రజాప్రతినిధుల కోటాతో పాటు కేఎస్‌‌సీఏ సభ్యుల కోటాను భర్తీ చేయడం బోర్డుకు సవాలుగా మారింది." లీగ్ మ్యాచ్‌‌లకే అక్కడ సామాన్య అభిమానులకు టికెట్లు దొరకడం కష్టమైంది. ఐపీఎల్ ఫైనల్ చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి జనం వస్తారు. వారికి ఎక్కువ టికెట్లు అందుబాటులో ఉండాలంటే పెద్ద స్టేడియం అవసరం" అని ధుమాల్ వివరించారు.