- నేడే ఐపీఎల్ ఫైనల్
- నేడు బెంగళూరు, గుజరాత్ మధ్య ఐపీఎల్–19 ఫైనల్
- రెండో కప్‌పై ఇరుజట్ల కన్ను హాట్ ఫేవరెట్‌గా ఆర్సీబీ
- రా. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 19 ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకోడానికి రెండు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. జట్ల బలాల పరంగా చూస్తే ఆర్సీబీ ఫేవరెట్‌గా కన్పిస్తున్నది. సొంత గ్రౌండ్‌లో మ్యాచ్ జరగడం టైటాన్స్‌కు అనుకూలాంశంగా ఉంది.
అహ్మదాబాద్: ఒకరిదేమో దూకుడు మంత్రం.. మరొకరిదేమో సాంప్రదాయ శైలితో కూడిన నిలకడ.. ఇలా రెండు భిన్నమైన వ్యూహాలు కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్–19 ఫైనల్‌కు సిద్ధమయ్యాయి. ఆదివారం జరిగే ఈ మెగా ఫైట్‌లో గెలిచి వరుసగా రెండో ఏడాది ట్రోఫీని ముద్దాడాలని ఆర్సీబీ కసితో ఉంటే.. తమ సొంత గ్రౌండ్‌లో రెండోసారి కప్‌ను కైవసం చేసుకోవాలని గుజరాత్ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో మెగా కప్ ఫైనల్ పోరు సర్వత్రా ఉత్కంఠ మొదలైంది.
ఆర్సీబీ బలం దూకుడు..
కాగితంపై చూస్తే డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఈ సీజన్ మొత్తం భయంలేని ఆటతీరుతో ప్రత్యర్థులను బెంబేలెత్తించింది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌కు తోడు దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, కెప్టెన్ రజత్ పాటిదార్, వెంకటేష్ అయ్యర్ భారీ హిట్టింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. పిచ్ ఎలా ఉన్నా, బౌలర్లు ఎవరైనా సరే.. వీరు హిట్టింగే మంత్రంగా తమదైన శైలిలో పరుగుల వరద పారిస్తున్నారు. దాంతో ఈ సీజన్‌లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించిన జట్టుగా ఆర్సీబీ ఇప్పటికే రికార్డు సృష్టించింది. కీలక టైమ్‌లో నిలకడైన ఇన్నింగ్స్ ఆడుతున్న పాటిదార్ ప్రశాంతత జట్టుకు కొండంత బలాన్నిస్తోంది. కెప్టెన్‌గా కూడా పటీదార్ మంచి మార్క్‌లే అందుకుంటున్నాడు.
బౌలింగ్‌లోనూ ఆర్సీబీకి తిరుగులేదు. 26 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్న పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి కీలకం కానున్నాడు. జోష్ హేజిల్‌వుడ్ (13), రసిక్ సలామ్ (16), క్రునాల్ పాండ్యా (13) వైవిధ్యమైన బౌలింగ్‌తో విరుచుకుపడుతున్న వీళ్ల నుంచి గుజరాత్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. క్రునాల్ బ్యాటింగ్‌లోనూ రాణిస్తుండటం ఆర్సీబీకి అదనపు బలం. ఫీల్డింగ్‌లోనూ బెంగళూరుకు పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు.
టాప్ ఆర్డర్‌పైనే జీటీ భారం..
గుజరాత్ బ్యాటింగ్ బలం మొత్తం టాప్ ఆర్డర్‌పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (722), సాయి సుదర్శన్ (710) ఇచ్చే మెరుపు ఆరంభం జట్టుకు భారీ స్కోరును తెచ్చిపెడుతోంది. ఛేజింగ్‌లోనూ ఈ ఇద్దర్ని అడ్డుకునే బౌలర్లు కనిపించడం లేదు. వన్‌డౌన్‌లో జోస్ బట్లర్ (507) మెరుస్తున్నా.. మిడిలార్డర్ బలహీనంగా ఉండటం మైనస్‌గా కనిపిస్తోంది. ఇక సీజన్‌లో సొంత మైదానంలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో గుజరాత్ ఐదింటిలో గెలవడం సానుకూలాంశం. బ్యాటింగ్‌తో పోలిస్తే గుజరాత్ బౌలింగ్ బలంగా కనిపిస్తోంది.
అహ్మదాబాద్ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే ఆర్సీబీని ముప్పుతిప్పలు పెట్టే స్పిన్నర్లకు జీటీలో కొదవలేదు. పేసర్లు కగిసో రబాడ (28), మహ్మద్ సిరాజ్, జేసన్ హోల్డర్, ప్రసిధ్ కృష్ణతో పాటు రషీద్ ఖాన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. కాకపోతే ఈ సీజన్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన సిరాజ్ ఫిట్‌నెస్‌పై కాస్త ఆందోళన నెలకొంది. క్వాలిఫయర్–2 మ్యాచ్‌లో సిరాజ్ భుజం గాయంతో ఇబ్బందిపడ్డాడు. అతను ఫిట్‌నెస్ సాధిస్తే జీటీకి చాలా ఇబ్బందులు తప్పినట్లే.
జట్లు (అంచనా)
బెంగళూరు: రజత్ పటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ / ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, క్రునాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, జోస్ హేజిల్‌వుడ్, రసిక్ సలామ్, జాకబ్ డఫీ / సుయాష్ శర్మ.
గుజరాత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జేసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, కగిసో రబాడ, ప్రసిధ్ కృష్ణ, సిరాజ్.
పిచ్, వాతావరణం
ఛేజింగ్‌కు అనుకూలం. పరుగుల వరద ఖాయం. గత ఆరు ఫైనల్స్‌లో నాలుగు విజయాలు కూడా లక్ష్యాన్ని ఛేదించిన జట్లే సొంతం చేసుకున్నాయి.
ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక రన్స్ చేసిన జోడీగా రికార్డులకెక్కడానికి గిల్, సుదర్శన్ చేయాల్సిన పరుగులు. ప్రస్తుతం కోహ్లీ, డివిలియర్స్ (939) పేరిట ఈ రికార్డు ఉంది.
ఈ సీజన్‌లో గుజరాత్ ఓపెనర్లు ఐదో ఓవర్ దాటి బ్యాటింగ్ చేసిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింటిలో నెగ్గారు.గత ఐదు టీ20 ఫైనల్స్‌లో హాజిల్‌వుడ్ ఆడిన జట్లే టైటిల్స్ గెలిచాయి. ఇందులో రెండు ఐపీఎల్ ఫైనల్స్ కూడా ఉన్నాయి.ఈసారి కూడా సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో చూడాలి.
