- నేడు క్వాలిఫయర్–1లో బెంగళూరు X గుజరాత్
- ఆర్సీబీకి బ్యాటింగ్ బలం.. బౌలింగ్‌పైనే గుజరాత్ ఆశలు
- రా. 7.30 స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్
ధర్మశాల: ఐపీఎల్–19 నాకౌట్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే క్వాలిఫయర్–1లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. గుజరాత్ టైటాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇందులో నెగ్గిన టీమ్ నేరుగా ఫైనల్ చేరే అవకాశం ఉండటంతో ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. లీగ్ దశలో ఇరుజట్లు 14 మ్యాచ్‌ల్లో చెరో18 పాయింట్లతో సమంగా నిలిచినప్పటికీ.. మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా ఆర్సీబీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గుజరాత్ రెండో ప్లేస్‌తో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో సీజన్‌లో అత్యంత నిలకడగా రాణించిన బెంగళూరు బ్యాటింగ్ బలానికి.. గుజరాత్ బౌలింగ్‌కు క్వాలిఫయర్–1 మ్యాచ్ మహా సంగ్రామంగా మారనుంది.
కోహ్లీపై భారీ ఆశలు..
గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఆర్సీబీ బ్యాటింగ్‌లో దూకుడు పెరిగింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అనుభవం, ఫామ్‌లో జట్టుకు ఉండటం కొండంత అండగా మారింది. ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, వెంకటేశ్ అయ్యర్ లాంటి యంగ్‌స్టర్స్‌ను విరాట్ నడిపిస్తున్న తీరు అద్భుతం. టాప్ ఆర్డర్ పరుగుల సునామీ సృష్టిస్తుండటంతో ఈ సీజన్‌లో ఆర్సీబీ రెండొందల మార్క్‌ను చాలాసార్లు దాటింది.
ఇక రజత్ పటీదార్, జితేష్ శర్మ, రొమారియో షెఫర్డ్, టిమ్ డేవిడ్, క్రునాల్ పాండ్యాలతో కూడిన ఫినిషింగ్ టీమ్ కూడా అందుబాటులో ఉంది. భారీ టార్గెట్‌ను నిర్దేశించాలన్నా.. ఛేదించాలన్నా వీళ్లలో ఏ ఒక్క ఇద్దరు బ్యాట్లు ఝుళిపించినా సరిపోతుంది. బౌలింగ్‌లోనూ ఆర్సీబీకి తిరుగులేదు. భువనేశ్వర్, హాజిల్‌వుడ్ స్టార్టింగ్‌లోనే ప్రత్యర్థులను దెబ్బతీసి ఒత్తిడి పెంచుతున్నారు. స్పిన్నర్లు క్రునాల్, సుయాష్ శర్మ, రసిక్ సలామ్ నుంచి ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటుంది. ధర్మశాలలో పంజాబ్‌పై గెలిచిన బెంగళూరుకు ఇక్కడి పరిస్థితులపై మంచి అవగాహన ఉంది.
ఓపెనర్ల పైనే భారం..
సీజన్ ఆరంభంలో నిరాశపర్చిన గుజరాత్ రెండో అంచెలో మాత్రం అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ ఇస్తున్న ఆరంభాలు జీటీకి వరంగా మారాయి. వన్‌డౌన్‌లో జోస్ బట్లర్ హిట్టింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. కాకపోతే మిడిలార్డర్‌లో సుందర్, హోల్డర్, రాహుల్ తెవాటియా, నిశాంత్ సింధు అనుకున్న స్థాయిలో ఆడలేకపోవడం మైనస్‌గా మారింది. బౌలింగ్‌లో గుజరాత్‌ను కొట్టే వాళ్లే కనిపించడం లేదు.
మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, ప్రసిధ్ కృష్ణ బుల్లెట్‌లాంటి బంతులతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఈ మ్యాచ్‌లోనూ వీళ్లు చెలరేగితే ఆర్సీబీకి ఇబ్బందులు తప్పవు. రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలం టీమ్‌కు ఎనలేని బలంగా మారింది. అయితే ధర్మశాలలో గుజరాత్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం బలహీనతగా మారింది. ఓవరాల్‌గా ఇరుజట్లలో మ్యాచ్ విన్నర్లకు కొదవ లేకపోవడంతో క్వాలిఫయర్–1 మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
