IPL 2026: ప్రపంచంలోనే అత్యంత ధనికమైన లీగ్‌గా ఐపీఎల్ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. తాజాగా రిలీజ్ అయిన 2025–-26 రిపోర్టుల ప్రకారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలు కేవలం స్పాన్సర్షిప్ డీల్స్ తోనే దాదాపు 1000 కోట్ల రూపాయల మార్కును అధిగమించేశాయి. ఈ స్థాయిలో ఆదాయం పొందడం ఇతర దేశాలలో జరిగే లీగ్‌లకు అందనంత ఎత్తులో నిలిచింది. ఇందులో కేవలం టికెట్ల అమ్మకాలపైనే కాకుండా, కార్పొరేట్ సంస్థల పార్ట్నర్షిప్ తో టీమ్స్ భారీగా లాభాలను ఆర్జిస్తున్నాయి.
స్పాన్సర్షిప్ లో మార్పులు:
గతంలో ఫాంటసీ గేమింగ్ కంపెనీలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని జట్లపై భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుండేవి. కానీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిబంధనల్లో తీసుకొచ్చిన మార్పులతో కొన్ని గేమింగ్ కంపెనీల ప్రాబల్యం తగ్గిపోవడంతో.. ఇతర రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీలు క్రికెట్ క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు క్యూ కడుతున్నాయి. దీంతో ఐపీఎల్ టీమ్స్ ఆదాయ వనరులు మరింత పెరిగాయి.
టాప్ లో ఈ మూడు జట్లే:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆదాయంలో అన్ని జట్లు సమానంగా లాభాలు ఆర్జించడం లేదు. జనాదరణ, బ్రాండ్ విలువ ఆధారంగా కేవలం 1. ముంబై ఇండియన్స్, 2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 3. చెన్నై సూపర్ కింగ్స్ మూడు జట్లు మాత్రమే అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఈ మూడు టీమ్స్ స్పాన్సర్షిప్ విలువ ఒక్కొక్కటి సుమారు రూ. 150 కోట్లకు పైగా ఉంది. వీటి తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాయి. మిగిలిన టీమ్స్ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోయింగ్ కలిగిన ఫ్రాంచైజీగా చరిత్ర సృష్టించింది. దీనికి కారణం విరాట్ కోహ్లీ.. అతడికి ఉన్న అంతర్జాతీయ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ టీమ్ కి భారీగా లాభాలను తెచ్చి పెడుతున్నాయి. దీనికి తోడు, 18 ఏళ్ల తర్వాత 2025లో తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను ఆర్సీబీ గెలవడంతో ఆ జట్టు బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా ఆకాశానికి చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో 2026 బరిలోకి దిగుతుండటంతో స్పాన్సర్లు ఈ జట్టుపై కోట్ల రూపాయలను కుమ్మరిస్తున్నారు.
