IPL 2026: బీసీసీఐ షాకింగ్ రూల్స్.. ఇక నుంచి అలా చేస్తే భారీ జరిమానాలే!

IPL 2026: బీసీసీఐ షాకింగ్ రూల్స్.. ఇక నుంచి అలా చేస్తే భారీ జరిమానాలే!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి జస్ట్ నాలుగు రోజులకి ముందే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. టోర్నమెంట్ ని మరింత క్రమశిక్షణతో నిర్వహించేందుకు మరో 4 కొత్త నిబంధనలను అమలు చేసేందుకు రెడీ అయింది. ఈ రూల్స్ ని అతిక్రమిస్తే ప్లేయర్స్ భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. 

మ్యాచ్ రోజున నో ప్రాక్టీస్:
కాగా ఐపీఎల్ చరిత్రలో ఆటగాళ్లు మ్యాచ్ జరిగే రోజున కూడా స్టేడియంలో తీవ్రంగా కష్టపడుతూ కనిపిస్తారు. కానీ ఐపీఎల్ 2026 నుంచి దీనిపై బీసీసీఐ బ్యాన్ చేసింది. ఇకపై మ్యాచ్ జరిగే రోజు ఏ ప్లేయర్ కూడా మైదానంలో ప్రాక్టీస్ చేసేందుకు పర్మిషన్ లేదు, పిచ్‌ స్వభావాన్ని కాపాడటం, మ్యాచ్ షెడ్యూల్‌లో ఎలాంటి సమస్యలు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. టీమ్స్ కి మ్యాచ్‌ కంటే ముందే తగినంత సమయం కేటాయిస్తామని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. 

డ్రెస్ కోడ్ తప్పనిసరి: 
ఆటగాళ్ల వస్త్రధారణపై కూడా బీసీసీఐ దృష్టి సారించింది. ఇకపై ఆటగాళ్లు మైదానంలో లేదా మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగే ‘పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్’ సమయంలో స్లీవ్‌లెస్ (భుజాలు కనిపించే) జెర్సీలు ధరించకూడదు. మొదటిసారి ఈ నిబంధనను ఉల్లంఘిస్తే హెచ్చరికతో సరిపెడతారు. కానీ, రెండోసారి తప్పు పునరావృతమైతే భారీ జరిమానా విధిస్తారు. దీనివల్ల ఆటగాళ్లందరూ జెర్సీలను ధరించడం తప్పనిసరి.

టీమ్ బస్సులోనే జర్నీ: 
ప్లేయర్స్ లో క్రమశిక్షణను పెంచేందుకు ఇండియన్ క్రికెట్ బోర్డు మరో కీలక నిబంధన తీసుకొచ్చింది. హోటల్ నుంచి మైదానానికి ప్లేయర్స్ అందరూ తప్పనిసరిగా టీమ్ బస్సులోనే రావాల్సిందేనని తేల్చి చెప్పింది. స్వదేశీ మ్యాచ్‌ల సమయంలో తమ వ్యక్తిగత కార్లను ఉపయోగించే విధానాన్ని రద్దు చేసింది. టీమ్ బస్సులో కేవలం ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ మాత్రమే ఉండాలని తేల్చి చెప్పింది. కుటుంబ సభ్యులకు ఇందులోకి ప్రవేశం లేదని.. అంతేకాకుండా, మ్యాచ్ రోజున ఎలాంటి ఫిట్‌నెస్ పరీక్షలు చేయొద్దని వెల్లడించింది. 

అనధికారిక వ్యక్తులకు నో పర్మిషన్: 
ఐపీఎల్ సమగ్రతను కాపాడేందుకు డ్రెస్సింగ్ రూమ్‌లోకి అనధికారిక వ్యక్తుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించినట్లు బీసీసీఐ వెల్లడించింది. కేవలం గుర్తింపు పొందిన స్టాఫ్ మాత్రమే లోపలికి వెళ్లేలా రూల్స్ తీసుకొచ్చింది. అలాగే స్టేడియంలో ఉండే సిబ్బంది సంఖ్యను కూడా పరిమితం చేసినట్లు పేర్కొంది. వైద్యులు, అత్యవసర సిబ్బందికి మాత్రమే ప్రత్యేక వెసులుబాటుని కల్పించింది. ఈ కొత్త రూల్స్ ఐపీఎల్‌ని మరింత ప్రొఫెషనల్‌గా మారుస్తాయని క్రీడా పండితులు తెలియజేస్తున్నారు.