వడ్డీతో సహా రూ. 4.25 కోట్లు కట్టాల్సిందే.. దర్శకుడు గౌతమ్ మీనన్‌కు మద్రాస్ హైకోర్టు ఫాక్!

వడ్డీతో సహా రూ. 4.25 కోట్లు కట్టాల్సిందే.. దర్శకుడు గౌతమ్ మీనన్‌కు మద్రాస్ హైకోర్టు ఫాక్!

ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 15 ఏళ్లుగా సాగుతున్న ఒక ఆర్థిక వివాదంలో సంచలన తీర్పునిచ్చింది.  ఆయన నిర్మాణ సంస్థ  'ఫోటాన్ ఫ్యాక్టరీ' దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ షాక్ ఇచ్చింది.  ఒక సినిమా ప్రాజెక్ట్ కోసం తీసుకున్న కోట్లాది రూపాయలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ పరిణామం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

వివాదానికి అసలు కారణం ఏమిటి?

ఈ వివాదం 2008లో మొదలైంది. గౌతమ్ మీనన్‌కు చెందిన ఫోటాన్ ఫ్యాక్టరీ,  ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సంస్థల మధ్య నవంబర్ 27, 2008న ఒక సినిమా కోసం ఒప్పందం కుదిరింది.  ఈ ప్రాజెక్ట్‌కు "ప్రొడక్షన్ నెం. 6" అని పేరు పెట్టారు.  ఈ ఒప్పందం విలువ సుమారు 13.5 కోట్లు.  ఒప్పందం ప్రకారం, "ప్రొడక్షన్ నెం. 6" అనే వర్కింగ్ టైటిల్‌తో ఒక తమిళ సినిమాను 2009 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలి. ఒకవేళ నిర్ణీత సమయంలో సినిమా పూర్తి కాకపోతే, తీసుకున్న మొత్తాన్ని 24 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలి. ఈ ప్రాజెక్ట్ కోసం గౌతమ్ మీనన్ సంస్థకు  ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్మెంట్ విడతల వారీగా రూ. 4.25 కోట్లు చెల్లించింది. అయితే, ఒప్పందం ప్రకారం సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు, షూటింగ్ జరగలేదు.

ALSO READ : నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్..

కోర్టులో వాదనలు -.. ట్విస్టులు

సినిమా పూర్తి చేయలేదన్న ఆరోపణలతో 2013లో ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సివిల్ సూట్ దాఖలు చేసింది. దీనిపై గౌతమ్ మీనన్ తరపు న్యాయవాదులు ఒక ఆసక్తికరమైన వాదనను వినిపించారు. 2008లో అనుకున్న ఆ ప్రాజెక్టే తర్వాత కాలంలో 'నీదానే ఎన్ పొన్వసంతం'  పేరుతో విడుదలైంది. కాబట్టి తాము బాకీ లేమని వాదించారు. కానీ, జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి ఈ వాదనను క్షుణ్ణంగా తోసిపుచ్చారు. 'నీదానే ఎన్ పొన్వసంతం' చిత్రం 2011లో చేసుకున్న సరికొత్త ఒప్పందం ప్రకారం నిర్మితమైంది. 2008 నాటి అగ్రిమెంట్‌తో దానికి ఎలాంటి సంబంధం లేదని కోర్టు తేల్చి చెప్పింది. కేవలం డబ్బులు చెల్లించకుండా తప్పించుకోవడానికే ఇలాంటి వాదనలు చేస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. 

వడ్డీతో సహా కట్టాల్సిందే!

గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ గౌతమ్ మీనన్ అప్పీల్ చేయగా, తాజాగా జస్టిస్ పి. వేల్మురుగన్ , జస్టిస్ కె. గోవిందరాజన్ తిలకవాడిలతో కూడిన ధర్మాసనం పాత తీర్పునే సమర్థించింది. గౌతమ్ మీనన్ , ఆయన సంస్థ రూ. 4.25 కోట్లను వెంటనే చెల్లించాలని తీర్పు ఇచ్చింది. 2010 నుండి ఇప్పటివరకు 12 శాతం వార్షిక వడ్డీని లెక్కించి బాకీ తీర్చాలి. అదనంగా రూ. 12 లక్షల కోర్టు ఖర్చులను ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సంస్థకు చెల్లించాలని కోర్టు  ఆదేశించింది.

ప్రస్తుతం గౌతమ్ మీనన్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ పాత బాకీ వడ్డీతో కలిపి ఇప్పుడు భారీ మొత్తానికి చేరి ఉండటం ఆయనకు పెద్ద ఆర్థిక భారంగా మారనుంది. 'మిన్నలే', 'కాక కాక', 'వారణం ఆయిరం' వంటి క్లాసిక్ చిత్రాలను అందించిన ఈ సెన్సిబుల్ డైరెక్టర్ ఈ చిక్కుల నుండి ఎలా బయటపడతారో చూడాలి.