చెన్నైకి గుజరాత్‌‌‌‌‌‌‌‌ చెక్‌‌‌‌‌‌‌‌ ..చెన్నై అట్టర్ ఫ్లాఫ్..ప్లే ఆఫ్స్‌‌ నుంచి ఔట్

చెన్నైకి గుజరాత్‌‌‌‌‌‌‌‌ చెక్‌‌‌‌‌‌‌‌ ..చెన్నై అట్టర్ ఫ్లాఫ్..ప్లే ఆఫ్స్‌‌ నుంచి ఔట్
  • 89 రన్స్‌‌ తేడాతో టైటాన్స్‌‌ గెలుపు.. చెలరేగిన సుదర్శన్‌‌, గిల్‌‌, బట్లర్‌‌
  •     బౌలింగ్‌‌లో మెరిసిన సిరాజ్‌‌, రబాడ, రషీద్‌‌ ఖాన్​
  •     ప్లే ఆఫ్స్‌‌ నుంచి సూపర్‌‌కింగ్స్‌‌ ఔట్‌‌

అహ్మదాబాద్‌‌: ఐపీఎల్‌‌–19లో చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ ప్లే ఆశలకు గుజరాత్‌‌ టైటాన్స్‌‌ చెక్‌‌ పెట్టింది. రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌లో సీఎస్కే బ్యాటర్లు అట్టర్‌‌ ఫ్లాఫ్‌‌ అయ్యారు. మహ్మద్‌‌ సిరాజ్‌‌ (3/26), కగిసో రబాడ (3/32), రషీద్‌‌ ఖాన్‌‌ (3/18) బౌలింగ్‌‌ ధాటికి నిలవలేకపోయారు. ఫలితంగా గురువారం జరిగిన ఆఖరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో గుజరాత్‌‌ 89 రన్స్‌‌ తేడాతో చెన్నైపై గెలిచింది. టాస్‌‌ ఓడిన గుజరాత్‌‌ 20 ఓవర్లలో 229/4 స్కోరు చేసింది. సాయి సుదర్శన్‌‌ (53 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 84), శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (37 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 64), జోస్‌‌ బట్లర్‌‌ (27 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 నాటౌట్‌‌) దంచికొట్టారు. తర్వాత చెన్నై 13.4 ఓవర్లలోనే 140 రన్స్‌‌కు ఆలౌటైంది. శివమ్‌‌ దూబే (40) టాప్‌‌ స్కోరర్‌‌. సిరాజ్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

‘టాప్‌‌’ లేపారు..

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన గుజరాత్‌‌కు టాప్‌‌–3 బ్యాటర్లు భారీ స్కోరు అందించారు. సీఎస్కే బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో ఓపెనర్‌‌ గిల్‌‌ ఆరంభం నుంచే బౌండ్రీలతో విరుచుకుపడ్డాడు. రెండో ఎండ్‌‌లో సుదర్శన్ సింగిల్స్‌‌ తీస్తూ అవసరమైనప్పుడు ఫోర్లతో రన్‌‌రేట్‌‌ను కాపాడాడు. ఆరో ఓవర్‌‌లో సుదర్శన్‌‌ 4, గిల్‌‌ 6తో పవర్‌‌ప్లేలో జీటీ 62/0 స్కోరు చేసింది. ఏడో ఓవర్‌‌లో మరో సిక్స్‌‌తో గిల్‌‌ 23 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. 9వ ఓవర్‌‌లో సుదర్శన్‌‌ 6, 4తో 15 రన్స్‌‌ రాబట్టాడు. పదో ఓవర్‌‌లో ఇద్దరు కలిసి మూడు ఫోర్లు కొట్టడంతో గుజరాత్‌‌ స్కోరు 111/0కు పెరిగింది. ఈ క్రమంలో సుదర్శన్‌‌ కూడా 35 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ అందుకున్నాడు. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌‌కు 13వ ఓవర్‌‌లో జాన్సన్‌‌ (1/47) ఝలక్‌‌ ఇచ్చాడు. గిల్‌‌ కొట్టిన షాట్‌‌ను బౌండ్రీ లైన్‌‌ వద్ద శివమ్‌‌ దూబే వెనక్కి పరుగెత్తి క్యాచ్‌‌ అందుకున్నాడు. ఫలితంగా తొలి వికెట్‌‌కు 125 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. బట్లర్‌‌  ఫోర్‌‌తో టచ్‌‌లోకి రాగా, 14వ ఓవర్‌‌లో రెండు సిక్స్‌‌లు, ఓ ఫోర్‌‌తో 22 రన్స్‌‌ వచ్చాయి. తర్వాతి ఓవర్‌‌లో బట్లర్‌‌ సిక్స్‌‌తో 15 ఓవర్లలో స్కోరు 159/1కు పెరిగింది. ఇక్కడి నుంచి ఈ ఇద్దరూ మరింత వేగంగా ఆడారు. 16వ ఓవర్‌‌లో సుదర్శన్‌‌ 4, 6తో 14 రన్స్‌‌ కొడితే, బట్లర్‌‌ 4 దంచాడు. చివరి ఓవర్లలో రెండు సిక్స్‌‌లు కొట్టిన సుదర్శన్‌‌ను 19వ ఓవర్‌‌లో అన్షుల్ కాంబోజ్‌‌ (1/56) ఔట్‌‌ చేశాడు. రెండో వికెట్‌‌కు 82 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఇదే ఓవర్‌‌లో రాహుల్‌‌ తెవాటియా (0) రనౌటయ్యాడు. 23 బాల్స్‌‌లో ఫిఫ్టీ కొట్టిన బట్లర్‌‌ ఆఖరి ఓవర్‌‌లో 4, సుందర్‌‌ (7) 6 కొట్టి ఔటయ్యాడు.

బౌలర్లు అదుర్స్‌‌..

భారీ లక్ష్య ఛేదనలో చెన్నై  లైనప్‌‌ను సిరాజ్‌‌ వణికించాడు. ఇన్నింగ్స్‌‌ తొలి బాల్‌‌కే సంజూ శాంసన్‌‌ (0) డకౌట్‌‌ చేసిన అతను.. మూడో ఓవర్‌‌లో వరుస బాల్స్‌‌లో రుతురాజ్‌‌ (16), ఉర్విల్‌‌ పటేల్‌‌ (0)ను పెవిలియన్‌‌కు పంపాడు. దాంతో సీఎస్కే 29/3తో కష్టాల్లో పడింది. ఓ ఎండ్‌‌లో నిలకడగా ఆడిన మాథ్యూ షార్ట్‌‌ (24), కార్తీక్‌‌ శర్మ (19)తో కలిసి ఇన్నింగ్స్‌‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ రబాడ, రషీద్‌‌ బౌలింగ్‌‌ ధాటికి సాధ్యం కాలేదు. ఆరో ఓవర్‌‌లో రబాడ దెబ్బకు షార్ట్‌‌ వెనుదిరిగాడు. నాలుగో వికెట్‌‌కు 22 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. పవర్‌‌ప్లేలో 58/4తో కష్టాల్లో పడిన చెన్నైకి ఏడో ఓవర్‌‌లో మరో ఎదురుదెబ్బ తగిలింది. కార్తీక్‌‌ రనౌట్ కావడంతో స్కోరు 63/5గా మారింది. ఈ దశలో డేవ్లాడ్‌‌ బ్రెవిస్‌‌ (8) మెల్లగా ఆడినా.. శివమ్‌‌ దూబే ధనాధన్‌‌ షాట్లతో రెచ్చిపోయాడు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో హోరెత్తించాడు. దాంతో తొలి పది ఓవర్లలో సీఎస్కే 109/5 స్కోరు చేసింది. అయితే 11వ ఓవర్‌‌లో రషీద్‌‌ ఖాన్‌‌.. దూబేను ఔట్‌‌ చేసి ఆరో వికెట్‌‌కు 53 రన్స్‌‌ భాగస్వామ్యాన్ని ముగించాడు. అదే జోరుతో తన తర్వాతి ఓవర్‌‌ (13వ)లో డబుల్‌‌ స్ట్రోక్‌‌ ఇచ్చాడు. నాలుగు బాల్స్‌‌ తేడాలో అన్షుల్‌‌ కాంబోజ్‌‌ (19), బ్రెవిస్‌‌ను పెవిలియన్‌‌కు పంపాడు. చివర్లో నూర్‌‌ అహ్మద్‌‌ (1), స్పెన్సర్‌‌ జాన్సన్‌‌ (0)ని వరుస బాల్స్‌‌లో రబాడ ఔట్ చేయడంతో సీఎస్కేకు ఓటమి తప్పలేదు. 

సంక్షిప్త స్కోర్లు

గుజరాత్‌‌: 20 ఓవర్లలో 229/4 (సుదర్శన్‌‌ 84, గిల్‌‌ 64, బట్లర్‌‌ 57*, ముకేశ్‌‌ 1/36). చెన్నై: 13.4 ఓవర్లలో 140 ఆలౌట్‌‌ (శివమ్‌‌ దూబే 40, సిరాజ్‌‌ 3/26, రబాడ 3/32, రషీద్‌‌ ఖాన్‌‌ 3/18).