- ఆల్‌రౌండర్ల వేటలో ఫ్రాంచైజీలు
- గ్రీన్, వెంకటేష్ పై ఫోకస్
అబుదాబి: క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలానికి సమయం ఆసన్నమైంది. మంగళవారం జరిగే వేలంలో 10 జట్లలో కలిపి ఖాళీగా ఉన్న 77 స్లాట్స్‌ను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఫ్రాంచైజీల వద్ద రూ. 237.55 కోట్ల బ్యాలెన్స్ ఉండగా.. మొత్తంగా 350 మంది క్రికెటర్లు బరిలో ఉన్నారు. డిమాండ్ అధికంగా ఉండి సప్లై తక్కువగా ఉన్న సీమ్ -బౌలింగ్ ఆల్‌రౌండర్ల కోసం భారీ డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అత్యధిక ధరకు అమ్ముడయ్యే ఆటగాడిగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అతడిని దక్కించుకోవడానికి కేకేఆర్, సీఎస్కే మధ్య బిడ్డింగ్ వార్ జరిగే చాన్సుంది. 13 స్లాట్స్ ఖాళీ ఉన్న కేకేఆర్ వద్ద అత్యధికంగా రూ. 64.30 కోట్లు మిగిలున్నాయి. తమ జట్టును పునర్నిర్మించుకోవాలని చూస్తున్న కోల్‌కతాకు రూ. 43.40 కోట్ల పర్సుతో నిలిచిన సీఎస్కే పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
గ్రీన్‌కు ఇచ్చేది రూ.18 కోట్లే!
గ్రీన్‌తో పాటు కేకేఆర్ రిలీజ్ చేసిన ఇండియా ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్, ఇంగ్లండ్ పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్, వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్‌కు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. వెంకటేష్ అయ్యర్‌ను గతంలో రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్ రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) అవకాశం లేని ఈ మినీ వేలంలో అతన్ని తిరిగి దక్కించుకోవడానికి మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. తనకు కనీసం రూ. 10 కోట్లు పలుకుతాడని అంచనా. ఇక, ఈ వేలంలో గ్రీన్ బిడ్ రూ. 25 కోట్లు దాటినా ఐపీఎల్ గరిష్ట రుసుము నిబంధన ప్రకారం ఈ సీజన్‌లో అతనికి జీతంగా రూ. 18 కోట్లు (అత్యధిక రిటెన్షన్ స్లాబ్) మాత్రమే అందనుంది. బిడ్ మొత్తం జట్టు పర్స్ నుంచి కట్ అవుతుంది. కానీ, ఆటగాడికి మాత్రం రూ. 18 కోట్లే చెల్లిస్తారు.
హిట్టర్లు, వికెట్ కీపర్ల కోసం
ఇంగ్లండ్ పవర్ హిట్టర్, పార్ట్‌టైమ్ స్పిన్నర్ కూడా అయిన లివింగ్‌స్టోన్, సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ కూడా మిలియన్ డాలర్ల మార్కు (రూ. 9 కోట్లు)ను సులభంగా తాకవచ్చు. సీఎస్కే రిలీజ్ చేసిన శ్రీలంక పేస్ సంచలనం మతీశ పతిరానా, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ కూడా డిమాండ్‌లో ఉన్నారు. ఇండియా అన్‌క్యాప్డ్ ఆటగాళ్లలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన అశోక్ శర్మతో పాటు ప్రశాంత్ వీర్, ముకుల్ చౌదరిపై పలు ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. ఇక, తక్కువ బేస్ ప్రైస్ (రూ. 75 లక్షలు) ఉన్న టీమిండియా ప్లేయర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ కూడా బిడ్డర్లను ఆకర్షించాలని ఆశిస్తున్నారు.
