వరల్డ్ కప్ కి ఐపీఎల్ విజయసోపానం

వరల్డ్ కప్ కి ఐపీఎల్  విజయసోపానం

వరల్డ్‌‌కప్‌‌లో భారీస్కోర్లకు అవకాశం: వార్నర్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ఏడాది కిందట బాల్ టాంపరింగ్‌‌కు పాల్పడి జట్టులో చోటు కోల్పోయి అందరి ముందు దోషిలా నిలబడిన ఆస్ట్రేలియా క్రికెటర్‌‌ డేవిడ్‌‌ వార్నర్‌‌.. ఈ రోజు సగర్వంగా  ప్రపంచకప్‌‌ జట్టులోకి ఎంపిక కావడానికి ఐపీఎల్‌‌ లే కారణమని విశ్లేషించాడు. స్కాండల్‌‌ తర్వాత సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ తరపున ఆడిన వార్నర్‌‌ దుమ్మురేపాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌‌లాడి 692 పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచి ఆరెంజ్‌‌క్యాప్‌‌ను సొంతం చేసుకున్నాడు. సోమవారం ఐపీఎల్‌‌లో చివరిమ్యాచ్‌‌ ఆడి స్వదేశానికి వెళ్లబోయే ముందు మీడియాతో మనసు విప్పి మాట్లాడాడు.

‘ ప్రపంచకప్‌‌లో ఎంపికవడానికి ఐపీఎల్‌‌ నాకో విజయ సోపానంలా ఉపకరించింది. నా ఆటతీరును మెరుగుపర్చుకునేందుకు నాకీ విరామం పనికొచ్చింది. గత 16–18 వారాల్లో కొంతకాలం క్రికెట్‌‌కు దూరంగా మంచి ఫాదర్‌‌గా, భర్తగా ఉండటానికి ప్రయత్నించాను. అది నాకెంతో ఉపకరించింది. జట్టులో ఒక సరదా అయిన వ్యక్తిగా ఉండేందుకు దోహదపడింది. ఒక ప్రాంక్‌‌స్టార్‌‌గా గుర్తింపు తీసుకొచ్చింది. మనకు అప్పగించిన పనిని సమర్థంగా పూర్తి చేయడం చాలా బాగుంటుంది. హైదరాబాద్‌‌లో బ్యాటింగ్‌‌కు అనుకూలమైన పిచ్‌‌ లభించింది. ఇందుకోసం గ్రౌండ్‌‌స్టాఫ్‌‌ ఎంతగానో శ్రమించారు. నా వరకైతే మూలాలకు కట్టుబడి పనిచేశాను. సహజసిద్ధంగా బ్యాటింగ్‌‌ చేయాలని భావించా. ఇంగ్లండ్‌‌లో జరిగే ప్రపంచకప్‌‌లో భారీస్కోర్లు నమోదయ్యే అవకాశముంది. బంతి ఎక్కువగా స్వింగ్‌‌ అయ్యే అవకాశం లేదు. ఇంగ్లండ్‌‌ గొప్పగా ఆడుతోంది. సొంతగడ్డపై కప్పు జరుగుతోంది కాబట్టి మరింత ప్రభావం చూపుతుంది. డిఫెండింగ్‌‌ చాంపియన్లుగా బరిలోకి దిగబోతున్నాం. మా బలాబలాపై దృష్టి పెట్టి గొప్ప ఆటతీరు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాం’ అని వార్నర్‌‌ చెప్పుకొచ్చాడు.

మరోవైపు కింగ్స్ లెవన్‌‌ పంజాబ్‌‌పై సాధించిన విజయం సమష్టిదని రైజర్స్ కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ వ్యాఖ్యానించాడు. టోర్నీలో కీలకమైన దశలో అందరం రాణించి విజయాన్ని నమోదు చేయడం ఆనందంగా ఉందని తెలిపాడు. జానీ బెయిర్‌‌స్టో, వార్నర్‌‌లాంటి వరల్డ్‌‌క్లాస్‌‌ ఆటగాళ్లను భర్తీ చేయడం చాలా కష్టమని విలియమ్సన్‌‌ పేర్కొన్నాడు.