- మీడియా హక్కుల కనీస ధర ఖరారు..
- నాలుగు ప్యాకేజీలుగా రైట్స్
ముంబై: ఐపీఎల్ 15వ సీజన్ లో రెండు కొత్త టీమ్స్‌తో పాటు మ్యాచ్‌లను పెంచిన బీసీసీఐ లీగ్ మీడియా హక్కుల ధరను కూడా రెట్టింపు చేసింది. 2018–22 సీజన్లకు గానూ స్టార్ నెట్ వర్క్ రూ.16,347 కోట్లకు (ఒక్కో మ్యాచ్ కు రూ.51 కోట్లు) రైట్స్ దక్కించుకోగా.. వచ్చే ఐదేళ్ల కాలానికి (2023–27) వేలం వేసే హక్కుల కనీస ధరనే రూ. 32,890 కోట్లుగా (ఒక్కో మ్యాచ్ కు రూ.90 కోట్లు) బోర్డు నిర్ణయించింది. అంటే ఈ–ఆక్షన్‌లో పాల్గొనే కంపెనీలు కనీసం 33 వేల కోట్ల నుంచి బిడ్ వేయాల్సి ఉంటుంది. ఈ సారి మీడియా హక్కులను బోర్డు నాలుగు ప్యాకేజీలుగా విభజించింది. ప్యాకేజీ–ఎలో ఇండియాలో టీవీ హక్కుల కనీస ధర రూ.18,130 కోట్లుగా (మ్యాచ్‌కు రూ. 49 కోట్లు), ప్యాకేజీ–బిలో ఇండియాలో డిజిటల్ హక్కుల ధర రూ. 12,210 కోట్లుగా ( మ్యాచ్‌కు రూ. 33 కోట్లు) నిర్ణయించింది. ప్యాకేజీ–సిలో నాన్ ఎగ్జిక్యూటివ్ డిజిటల్ రైట్స్‌ను చేర్చింది. ఇందులో ప్రతీ సీజన్లో 18 మ్యాచ్‌లు (ఓపెనింగ్, ప్లేఆఫ్ మ్యాచ్ లతో పాటు డబుల్ హెడర్ లోని రెండో మ్యాచ్) ఉంటాయి. ఈ ప్యాకేజ్‌కు రూ. 1440 కోట్ల ( మ్యాచ్‌కు రూ. 16 కోట్లు) బిడ్ వేయాల్సి ఉంటుంది. ప్యాకేజీ–డిలో రెస్టాఫ్ ది వరల్డ్ -టీవీ, డిజిటల్ రైట్స్‌ను రూ. 1110 కోట్లుగా (మ్యాచ్ రూ. 3 కోట్లు) నిర్ణయించింది. ఇప్పటికే ఈ హక్కుల కోసం టెండర్లను ఆహ్వానించిన బోర్డు.. జూన్ 12న విన్నర్ ను ప్రకటించనుంది.

