నేటి నుంచి ఐపీఎల్‌ మీడియా రైట్స్‌ ఈ‑ఆక్షన్‌  

నేటి నుంచి ఐపీఎల్‌ మీడియా రైట్స్‌ ఈ‑ఆక్షన్‌  
  • నేటి నుంచి ఐపీఎల్‌ మీడియా రైట్స్‌ ఈ‑ఆక్షన్‌  
  • బరిలో బడా కంపెనీలు

న్యూఢిల్లీ: క్రికెట్‌‌‌‌ ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌‌ మీడియా రైట్స్‌‌ వేలానికి సర్వం సిద్ధమైంది. రాబోయే ఐదేండ్ల కాలానికి ఐపీఎల్‌‌ మ్యాచ్‌‌లను ప్రసారం చేసే వాళ్లు ఎవరో తేలే సమయం ఆసన్నమైంది.ఆదివారం నుంచి జరిగే ఆక్షన్‌‌లో ప్రపంచ మేటి సంస్థలు పోటీ పడుతున్నాయి. నాలుగు ప్యాకేజీల్లో(ఎ,బి,సి,డి)  ఉన్న 2023–2027 సైకిల్‌‌ మీడియా రైట్స్‌‌ ప్రారంభ ధరను బీసీసీఐ రూ. 32, 440 కోట్లుగా నిర్ణయించింది. తాజా వేలంలో( ఈ–ఆక్షన్‌‌)  కనీసం 45 వేల కోట్ల నుంచి 60 వేల కోట్ల వరకూ మీడియా హక్కులు అమ్ముడయ్యే అవకాశం ఉందని బోర్డు, వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2017లో జరిగిన  వేలంలో స్టార్‌‌ ఇండియా అప్పటికి రికార్డు స్థాయిలో 16,347.50 కోట్లకు ఐదేళ్ల రైట్స్‌‌ (2018–22) కొనుగోలు చేసింది. ఇప్పుడు ఐపీఎల్‌‌లో టీమ్స్‌‌, మ్యాచ్‌‌ల సంఖ్య పెరగడం, ఆటపై ఆసక్తి రెట్టింపు అవడంతో పాటు స్పోర్ట్స్‌‌ బిజినెస్‌‌పై ప్రపంచంలోనే పెద్ద పెద్ద సంస్థలు ఆసక్తి చూపెట్టడంతో ఐపీఎల్‌‌ మీడియా రైట్స్‌‌ ధర క్రితం సారితో పోలిస్తే రెండు, మూడు రెట్లు పెరిగే  అవకాశం కనిపిస్తోంది. మీడియా రైట్స్‌‌ కోసం తొలిసారి ఈ–వేలం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు మొదలయ్యే వేలంలో పోటీదారులు ఆన్‌‌లైన్‌‌ పోర్టల్‌‌లో బిడ్స్‌‌ వేస్తారు. చివరికి అత్యధిక బిడ్‌‌ వేసిన వారికి హక్కులు దక్కుతాయి. ఈ ప్రక్రియ ఆదివారం పూర్తవకపోతే సోమవారం కూడా కొనసాగుతుంది. 

 జీ ఔట్‌‌?  ఆ మూడింటి మధ్యే పోటీ
మీడియా రైట్స్‌‌  రేసు నుంచి అమెజాన్‌‌, గూగుల్‌‌ తప్పుకోగా, తాజాగా జీ ఎంటర్‌‌టైనమెంట్‌‌ కూడా వాటి సరసన చేరినట్లు తెలుస్తోంది. సాధారణ టెక్నికల్‌‌ బిడ్‌‌ దాఖలు చేసిన జీ.. ప్యాకేజ్‌‌–ఎ కోసం ఎలాంటి బిడ్‌‌ వేయలేదని సమాచారం. దీంతో రిలయన్స్‌‌ వయకామ్‌‌–18, సోనీ, డిస్నీ స్టార్‌‌  పోటీలో  ముందున్నాయి. ప్రస్తుతానికి పది కంపెనీలు రేస్‌‌లో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం ఈ మూడింటి మధ్యే ఉన్నట్లు తెలుస్తోంది. టైమ్స్‌‌ ఇంటర్నేట్‌‌ (డిజిటల్‌‌), రిలయన్స్‌‌ జియో (డిజిటల్‌‌), సూపర్‌‌ స్పోర్ట్‌‌ (ఇంటర్నేషనల్‌‌ రైట్స్‌‌)  కూడా బరిలో నిలిచాయి.