సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ కు లక్‌ సరిపోలేదు

సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ కు లక్‌ సరిపోలేదు

హైదరాబాద్‌‌, వెలుగు : గతేడాది మెరుపులు మెరిపించి రన్నరప్‌‌‌‌గా నిలిచిన సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌.. ఈసారి మాత్రం అలాంటి ఆటతీరు కరువై ఎలిమినేటర్‌‌‌‌లోనే ఇంటిముఖం పట్టింది. ఐపీఎల్‌‌‌‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 12 పాయింట్లు సాధించి నాకౌట్‌‌‌‌కు అడుగుపెట్టినా అక్కడ అదృష్టం కలిసిరాలేదు. బలంగా నిలవాల్సిన బౌలింగ్‌‌‌‌ అనూహ్యంగా తేలిపోగా.. బ్యాటింగ్‌‌‌‌లో డేవిడ్‌‌‌‌ వార్నర్‌‌‌‌, జానీ బెయిర్‌‌‌‌స్టో సూపర్‌‌‌‌స్టార్లుగా నిలిచారు. వీరిద్దరూ జట్టులో ఉన్నంతవరకు టైటిల్‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌గా నిలిచిన ఆరెంజ్‌‌‌‌ఆర్మీ .. వీరి నిష్క్రమణ అనంతరం సాదాసీదా జట్టుగా మిగిలింది. లీగ్‌‌‌‌లో జట్టు ఆట ముగిసిన  నేపథ్యంలో ఈ సీజన్‌‌‌‌లో సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ ఆటతీరు ఎలా ఉందో చూద్దాం…

నిలకడలేని కెప్టెన్సీ..

ఈ సీజన్‌‌‌‌లో ఆరెంజ్‌‌‌‌ఆర్మీని కెప్టె్న్సీ నిలకడలేమీ దెబ్బతీసింది. కొన్ని మ్యాచ్‌‌‌‌ల్లో కేన్‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌ సారథ్యం వహించగా.. మరికొన్ని మ్యాచ్‌‌‌‌ల్లో పేసర్‌‌‌‌ భువనేశ్వర్‌‌‌‌ కుమార్‌‌‌‌ స్టాండిన్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా వ్యవహరించాడు. ఈ సీజన్‌‌‌‌లో  భువీ ప్రదర్శన సారథ్యంలో సాదాసీదాగా ఉంది. స్లాగ్‌‌‌‌ ఓవర్లలో కొన్ని సార్లు పరుగులు భారీగా సమర్పించుకున్నాడు. ఇక ఎలిమినేటర్‌‌‌‌ కీలకదశలో బాసిల్‌‌‌‌ థంపికు బంతినిచ్చి చేజేతులా మ్యాచ్‌‌‌‌ను ప్రత్యర్థికి అప్పగించాడని కేన్‌‌‌‌పై అభిమానులు అనుకోవడం సబబే. ఓవరాల్‌‌‌‌గా గతేడాది అద్భుత ఆటతీరుతో జట్టును రన్నరప్‌‌‌‌గా నిలిపిన కేన్‌‌‌‌.. ఈ సీజన్‌‌‌‌లో ఫామ్‌‌‌‌ లేమి, కొన్ని మ్యాచ్‌‌‌‌ల్లో అందుబాటులో లేకపోవడం టీమ్‌‌‌‌ లయను దెబ్బతీసింది.

వార్నర్‌‌‌‌, బెయిర్‌‌‌‌స్టో ధనాధన్‌‌‌‌

ఈ సీజన్‌‌‌‌ ప్రారంభానికి ముందు తమను తాము నిరూపించుకోవాల్సిన దశలో వార్నర్‌‌‌‌, బెయిర్‌‌‌‌స్టో అడుగుపెట్టారు. ఒకవైపు బాల్‌‌‌‌ ట్యాంపరింగ్‌‌‌‌కు పాల్పడి బ్యాన్‌‌‌‌ను ఎదుర్కొన్న వార్నర్‌‌‌‌, మరోవైపు లీగ్‌‌‌‌లో తొలిసారి బరిలోకి దిగిన ఒత్తిడితో  బెయిర్‌‌‌‌స్టో అంచనాలకు మించి సత్తాచాటారు. ఆరెంజ్‌‌‌‌ ఆర్మీ సాధించిన విజయాల్లో సింహభాగం వీరిద్దరి భాగస్వామ్యమే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లీగ్‌‌‌‌ దశ చివరికొచ్చాక ప్రపంచకప్‌‌‌‌ గురించి జట్టును వీరిద్దరూ వీడివెళ్లడంతో ఆరెంజ్‌‌‌‌ఆర్మీ ఇబ్బందిపడింది. ఓవరాల్‌‌‌‌గా ఆరెంజ్‌‌‌‌క్యాప్‌‌‌‌ ప్రదర్శనతో వార్నర్‌‌‌‌ మెగాటోర్నీ బెర్త్‌‌‌‌ దక్కించుకోగా.. బెయిర్‌‌‌‌స్టో విధ్వంసం గురించి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది.

విజయ్‌‌‌‌ శంకర్‌‌‌‌లో కొరవడిన ‘త్రీడి’

బ్యాటింగ్‌‌‌‌, బౌలింగ్‌‌‌‌, ఫీల్డింగ్‌‌‌‌ ఇలా మూడు అంశాల్లో పనికొచ్చే త్రీ డైమన్షయ్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ బెర్త్‌‌‌‌ దక్కించుకున్న విజయ్‌‌‌‌ శంకర్‌‌‌‌ ఆమార్కును ఐపీఎల్లో చూపెట్టలేకపోయాడు. ఈ సీజన్‌‌‌‌ మొత్తం మీద ఒక్క ఆఫ్ సెంచరీ సాధించలేని శంకర్‌‌‌‌.. 15 మ్యాచ్‌‌‌‌ల్లో 20.33 సగటుతో పరుగులు సాధించాడు. అందులో అత్యధిక స్కోరు కేవలం 40 మాత్రమే. ఇక బౌలింగ్‌‌‌‌లో ఎనిమిది ఓవర్లు మాత్రమే వేసి ఒక వికెట్టు పడగొట్టడంలో సఫలమయ్యాడు. సీజన్ కు ముందు తనపై ఎన్నో అంచనాలు పెట్టుకోగా వాటిని దిగ్విజయంగా తుస్సుమనిపించాడు.

ఓవరాల్‌‌‌‌గా ఈ సీజన్‌‌‌‌లో ఆరెంజ్‌‌‌‌ ఆర్మీ జట్టుగా ఆడడంలో విఫలమైంది. బ్యాటింగ్‌‌‌‌లో వార్నర్‌‌‌‌, బెయిర్‌‌‌‌స్టో పై అతిగా ఆధారపడింది. మిడిలార్డర్‌‌‌‌లో మనీశ్‌‌‌‌పాండే లేటుగా ఫామ్‌‌‌‌లోకి రాగా.. మిగతా బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఇక బౌలింగ్‌‌‌‌లో రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌, ఖలీల్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ సత్తాచాటగా.. సిద్ధార్థ్‌‌‌‌ కౌల్‌‌‌‌, సందీప్‌‌‌‌ శర్మ, థంపి పలుమార్లు చెత్త ఆటతీరుతో తుదిజట్టులో చోటు కోల్పోయారు. మొత్తం మీద ఈ సీజన్‌‌‌‌లో 15 మ్యాచ్‌‌‌‌లాడిన సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌  ఆరింటిలో గెలుపొంది తొమ్మిదింటిలో ఓడిపోయింది. లీగ్‌‌‌‌ దశలో  రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరుపై 118 పరుగులతో అతిపెద్ద విజయం సాధించగా.. ముంబైపై 136 పరుగుల ఛేజింగ్‌‌‌‌లో కేవలం 96 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయం పాలైంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌‌‌‌లో అరంగేట్ర అల్జారీ జోసెఫ్‌‌‌‌ (6/12) ధాటికి కకావికలమైంది.