పాంచ్ పటాకా…మళ్లీ ముంబైకే ఐపీఎల్ కిరీటం

పాంచ్ పటాకా…మళ్లీ ముంబైకే ఐపీఎల్ కిరీటం

ఐపీఎల్‌‌లో ముంబై ఇండియన్స్‌‌ కొత్త చరిత్ర సృష్టించింది..! ఎవరికీ సాధ్యంకాని రీతిలో ఐదోసారి టైటిల్‌‌ను సొంతం చేసుకుంది..! బౌలింగ్‌‌లో ట్రెంట్‌‌ బౌల్ట్‌‌ (3/30) ఇచ్చిన శుభారంభాన్ని అందుకున్న కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ (51 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 68) బ్యాటింగ్‌‌లో రెచ్చిపోయాడు..! దీంతో మామూలు టార్గెట్‌‌ను ముంబై ఈజీగా ఛేదించేసింది..! మరోవైపు శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (50 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 నాటౌట్‌‌), రిషబ్‌‌ పంత్‌‌ (38 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) చెలరేగినా.. బౌలర్లు అంచనాలను అందుకోలేకపోవడంతో.. ఢిల్లీ ఫైనల్‌‌ ఫోబియాను అధిగమించలేకపోయింది..! ఫలితంగా ఫస్ట్‌‌ టైమ్‌‌ టైటిల్‌‌ గెలిచే సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది..!!

దుబాయ్‌‌: ఎవరు ఎన్ని అంచనాలు వేసినా..  ఎన్ని వ్యూహాలు పన్నినా.. ఐపీఎల్‌‌–13 టైటిల్‌‌.. డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ ముంబై ఇండియన్స్‌‌నే వరించింది. లీగ్‌‌, నాకౌట్‌‌ దశలో అదరగొట్టిన ఢిల్లీ.. టైటిల్‌‌ పోరులో మాత్రం చతికిలపడిపోయింది. దీంతో ఈ సీజన్‌‌లో నాలుగోసారి ముంబై చేతిలో ఓడి టైటిల్‌‌ గెలిచే గొప్ప చాన్స్‌‌ను మిస్‌‌ చేసుకుంది. ఫలితంగా మంగళవారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో ముంబై 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచి టైటిల్‌‌ నిలబెట్టుకుంది. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 రన్స్‌‌ చేసింది. తర్వాత ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 157 రన్స్‌‌ చేసింది. ఇషాన్‌‌ కిషన్‌‌ (19 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 33 నాటౌట్‌‌) రాణించాడు. బౌల్ట్​కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’అవార్డు లభించాయి.

బౌల్ట్‌‌ దెబ్బ..

భారీ టార్గెట్‌‌ నిర్దేశించాలన్న ఉద్దేశంతో ముందుగా బ్యాటింగ్‌‌కు వచ్చిన ఢిల్లీ ఆశలపై బౌల్ట్‌‌ (3/30) నీళ్లు కుమ్మరించాడు. ఇన్నింగ్స్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌కే స్టోయినిస్‌‌ (0)ను డకౌట్‌‌ చేశాడు. గుడ్‌‌ లెంగ్త్‌‌తో వేసిన షార్ట్‌‌ బాల్‌‌ను ఆడే క్రమంలో స్టోయినిస్‌‌ కీపర్‌‌ డికాక్‌‌కు చిక్కాడు. ధవన్‌‌ (15) మూడు ఫోర్లతో టచ్‌‌లోకి వచ్చినా.. థర్డ్‌‌ ఓవర్‌‌లో బౌల్ట్‌‌ మళ్లీ దెబ్బ కొట్టాడు. సేమ్‌‌ బాల్‌‌ను ఈసారి లెగ్‌‌సైడ్‌‌ సంధించాడు. ఫ్లిక్‌‌ చేయబోయిన రహానె (2) డికాక్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. అయ్యర్‌‌ ఫోర్‌‌తో ఖాతా తెరవగా, నాలుగో ఓవర్‌‌లోనే స్పిన్నర్‌‌ జయంత్‌‌ (1/25) రంగంలోకి వచ్చాడు. జోష్‌‌ మీదున్న ధవన్‌‌ను మంచి టర్నింగ్‌‌ బాల్‌‌తో పెవిలియన్‌‌కు పంపాడు. దీంతో 22 రన్స్‌‌కే 3 కీలక వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది.

పంత్‌‌, అయ్యర్‌‌ జోరు..

పేలవ ఫామ్‌‌తో ఇన్నాళ్లూ నిరాశపర్చిన పంత్‌‌ కీలక మ్యాచ్‌‌లో ఆకట్టుకున్నాడు. అయ్యర్‌‌తో కలిసి ఇన్నింగ్స్‌‌ను గట్టెక్కించే బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు.  ఫిఫ్త్‌‌ ఓవర్‌‌లో అయ్యర్‌‌ రెండు ఫోర్లు కొట్టడంతో 10 రన్స్‌‌ వచ్చాయి. కూల్టర్‌‌నైల్‌‌ (2/29) వేసిన తర్వాతి ఓవర్‌‌లో మరో బౌండ్రీ సాధించి 41/3 స్కోరుతో పవర్‌‌ప్లేను ముగించాడు. ఫీల్డింగ్‌‌ను విస్తరించడంతో ఈ ఇద్దరు సింగిల్స్‌‌, డబుల్స్‌‌కు మొగ్గారు. దీంతో తర్వాతి మూడు ఓవర్లలో 18 రన్స్‌‌ వచ్చాయి. 10వ ఓవర్‌‌లో క్రునాల్‌‌ బౌలింగ్‌‌కు రావడంతో పంత్‌‌ బ్యాట్‌‌ ఝుళిపించాడు. స్ట్రెయిట్‌‌, డీప్‌‌ మిడ్‌‌వికెట్‌‌లో రెండు భారీ సిక్సర్లు బాదడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో ఢిల్లీ 74/3 స్కోరు చేసింది. సెకండ్‌‌ స్పెల్‌‌కు వచ్చిన బుమ్రా 6 రన్స్‌‌ ఇస్తే.. 12వ ఓవర్‌‌లో పొలార్డ్‌‌ను 4, 6తో ఉతికేశారు. తర్వాతి రెండు ఓవర్లలో 5, 9 పరుగులే వచ్చినా స్కోరు 100 దాటింది. 15వ ఓవర్‌‌ (కూల్టర్‌‌నైల్‌‌) లో రెండు ఫోర్లు కొట్టిన పంత్‌‌.. 35 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. కానీ లాస్ట్‌‌ బాల్‌‌కు షాట్‌‌ కొట్టగా ఫైన్‌‌ లెగ్‌‌లో హార్దిక్‌‌ క్యాచ్‌‌ అందుకున్నాడు. దీంతో నాలుగో వికెట్‌‌కు 69 బాల్స్‌‌లో 96 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. స్కోరు 118/4 కు చేరింది. 16వ ఓవర్‌‌ నుంచి ఢిల్లీ ఇన్నింగ్స్‌‌లో ఆశించినంత వేగం రాలేదు. హెట్‌‌మయర్‌‌ (5) తొందరగా ఔట్‌‌కాగా.. అయ్యర్‌‌ 40 బాల్స్‌‌లో ఫిఫ్టీ మార్క్‌‌ను అందుకున్నాడు. ఐదో వికెట్‌‌కు 19 రన్సే సమకూరాయి. అక్షర్‌‌ పటేల్‌‌ (9)తో పాటు అయ్యర్‌‌ కూడా భారీ షాట్లు కొట్టే సాహసం చేయలేదు. ఆఖర్లో రబాడ (0) రనౌటయ్యాడు లాస్ట్‌‌ ఐదు ఓవర్లలో కేవలం 38 రన్సే రావడంతో ఢిల్లీ మోస్తరు టార్గెట్‌‌నే నిర్దేశించింది.

రోహిట్‌‌

చిన్న టార్గెట్‌‌ అయినా.. ముంబై బెటర్‌‌గా ఆడింది. అశ్విన్‌‌ వేసిన ఫస్ట్‌‌ ఓవర్‌‌లోనే రోహిత్‌‌ సిక్స్‌‌తో టచ్‌‌లోకి రాగా, రబాడ (1/32) రెండో ఓవర్‌‌లో డికాక్‌‌ (20)… 4, 6, 4తో 18 రన్స్‌‌ పిండుకున్నాడు. థర్డ్‌‌ ఓవర్‌‌లో ఒకటే ఫోర్‌‌ బాదినా.. తర్వాతి ఓవర్‌‌లో రోహిత్‌‌ 4, 6తో రెచ్చిపోయాడు. జస్ట్‌‌ 4 ఓవర్లలోనే 45 రన్స్‌‌ రావడంతో ముంబైకి శుభారంభం దక్కింది. కానీ ఐదో ఓవర్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌కే స్టోయినిస్‌‌ (1/23).. డికాక్‌‌ను ఔట్‌‌ చేశాడు. సూర్యకుమార్‌‌ (19) వచ్చి రావడంతో 4, 6తో ఖాతా తెరిచాడు. పవర్‌‌ప్లే ముగిసేసరికి ముంబై 61/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఛేంజ్‌‌ బౌలర్లుగా వచ్చిన ప్రవీణ్​ దూబే, పటేల్‌‌నూ ముంబై ప్లేయర్లు వదల్లేదు. 9, 10 ఓవర్లలో రోహిత్‌‌ 6, 6, 4తో 21 రన్స్‌‌ రాబట్టడంతో తొలి పదిలో ముంబై 88/1 స్కోరు చేసింది. 11వ ఓవర్‌‌లో సూర్య అనూహ్యంగా రనౌట్‌‌ అయ్యాడు. అశ్విన్‌‌  బాల్‌‌ను ఎక్స్‌‌ట్రా కవర్స్‌‌లోకి నెట్టిన రోహిత్‌‌ అనవసరంగా రన్‌‌ కోసం పరుగెత్తాడు. నాన్‌‌ స్ట్రయికర్‌‌ వద్దన్నా అలాగే రావడంతో సూర్య వికెట్‌‌ను త్యాగం చేయక తప్పలేదు. రెండో వికెట్‌‌కు 45 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 12వ ఓవర్‌‌లో రెండు ఫోర్లు కొట్టిన రోహిత్‌‌ 36 బాల్స్‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేశాడు. స్కోరు కూడా 100 దాటింది. కిషన్‌‌ కూడా సమయోచితంగా స్పందించాడు. ఓవర్‌‌కు ఆరుకు పైగా రన్స్‌‌ సాధిస్తూ రోహిత్‌‌కు చక్కని సహకారం అందించాడు. స్టోయినిస్‌‌ వేసిన 15వ ఓవర్‌‌లో భారీ సిక్సర్‌‌ బాదడంతో టీమ్‌‌ స్కోరు 125/2కు చేరింది. 16వ ఓవర్‌‌లో కిషన్‌‌ వరుసగా 4, 4తో 11 రన్స్‌‌ రాబట్టాడు. కానీ తర్వాతి ఓవర్‌‌లో భారీ షాట్‌‌కు యత్నించి రోహిత్‌‌ ఔట్‌‌కావడంతో మూడో వికెట్‌‌కు 47 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. పొలార్డ్‌‌ (9) బ్యాక్‌‌ టు బ్యాక్‌‌ ఫోర్లు బాదినా.. రబాడ దెబ్బకు క్లీన్‌‌బౌల్డ్‌‌ అయ్యాడు. ఇక ముంబై గెలవాలంటే 17 బాల్స్‌‌లో 10 రన్స్‌‌ కావాల్సిన దశలో హార్దిక్‌‌ (3) ఔటైనా, కిషన్‌‌ 4 కొడితే.. క్రునాల్‌‌ (1 నాటౌట్‌‌) విన్నింగ్‌‌ షాట్‌‌ కొట్టాడు.