- శుభవార్త వింటారన్న రూబియో
- ఢిల్లీలో జైశంకర్‌తో భేటీ తర్వాత మీడియా సమావేశం
- ట్రంప్ ప్రకటించే చాన్స్ ఉందన్న అమెరికా విదేశాంగ మంత్రి
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభాన్ని ముగించడానికి, వాణిజ్య నౌకల రవాణా కోసం హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడంతో సహా ఇరాన్‌తో జరుపుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఆదివారం ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో చర్చలు జరిపిన అనంతరం మీడియా సమావేశంలో రూబియో మాట్లాడారు.
వచ్చే కొన్ని గంటల్లోనే శుభవార్త వచ్చే అవకాశం ఉందని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై ప్రకటన చేసే చాన్స్ ఉందని తెలిపారు. ఇరాన్ తో యుద్ధం ముగింపుకు సంబంధించి ఒక ముసాయిదాపై గత 48 గంటల్లో జరిగిన చర్చల్లో పురోగతి కనిపించిందని ఆయన చెప్పారు. అయితే, చర్చల్లో ఏయే అంశాలపై పురోగతి వచ్చిందన్న వివరాలు వెల్లడించలేదు.
‘ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదనేదే మా అంతిమ లక్ష్యం’ అని ఆయన స్పష్టం చేశారు. ‘హార్మూజ్ జలసంధిని ఉపయోగిస్తున్న వాణిజ్య నౌకలను నాశనం చేస్తామని వారు బెదిరిస్తున్నారు. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం’ అని రూబియో అన్నారు.
ఇరాన్ తో శాంతి ఒప్పందం గురించి చర్చించడానికి సౌదీ అరేబియా, ఖతార్, తుర్కియే, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, బహ్రెయిన్, పాకిస్తాన్ నాయకులతో ట్రంప్ శనివారం ఫోన్ లో మాట్లాడారు. ఇరాన్ యుద్ధాన్ని ముగించడం, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్ ఒక ఒప్పందాన్ని ఖరారు చేయడానికి దగ్గరగా ఉన్నాయని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఒప్పందానికి సంబంధించిన తుది అంశాలు, వివరాలపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వివరాలను ప్రకటిస్తాం’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాశారు. కాగా, ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభించి, ప్రతీకార దాడులకు దారితీసినప్పటి నుంచి హార్మూజ్ ద్వారా నౌకల రవాణా తీవ్రంగా దెబ్బతింది.
యురేనియం అప్పగింతకు ఇరాన్ ఓకే?
శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్ తన వద్ద ఉన్న శుద్ధిచేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి అంగీకరించిందని ట్రంప్ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే ది న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది. శుద్ధిచేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించిందని ఇద్దరు అమెరికా అధికారులు చెప్పారని తెలిపింది. ఈ అంశంపై వచ్చే 30 నుంచి 60 రోజుల్లో చర్చలు జరుగుతాయని పేర్కొంది. అయితే, ఇరాన్ సీనియర్ నాయకుడొకరు రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఇరాన్ తన శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అప్పగించడానికి అంగీకరించలేదని చెప్పారు.
అమెరికాతో ప్రస్తుత ప్రాథమిక ఒప్పందంలో ఇరాన్ అణు సమస్య భాగం కాదని, అది తుది ఒప్పందం కోసం జరిగే చర్చల్లోనే పరిష్కారమవుతుందని స్పష్టం చేశారు. కాగా, అమెరికా, ఇరాన్ మధ్య చర్చల ముసాయిదా ప్రకారం, హార్మూజ్ ద్వారా నౌకల రవాణా 30 రోజుల్లోగా యుద్ధానికి పూర్వ స్థాయికి చేరుకుంటుందని ఇరాన్‌కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది. ఆ కాలంలో జలసంధి చుట్టూ ఉన్న నౌకాదళ దిగ్బంధనం పూర్తిగా తొలగించాలని, ఒప్పందం మొదటి దశలో ఇరాన్‌కు చెందిన స్తంభింపచేసిన విదేశీ నిధుల ఒక భాగం కూడా విడుదల అవుతుందని పేర్కొంది.
