
ఇరాన్‌లో గత కొన్ని నెలలుగా హిజాబ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక బ్లాగర్ జంటకు అక్కడి రెవెల్యూషనరీ కోర్టు10 సంవత్సరాల 6 నెలల జైలు శిక్ష విధించింది. హిజాబ్ కు, వీరికి జైలు శిక్షకు సంబంధం ఏంటీ అన్న విషయానికొస్తే.. అస్తియాజ్ హగిగి, అమీర్ మహ్మద్ అహ్మదీ అనే బ్లాగర్ జంట ఇరాన్ నిరసనకారులకు మద్దతుగా టెహ్రాన్‌లోని ఆజాదీ స్క్వేర్‌లో డ్యాన్స్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇరాన్ ప్రభుత్వం ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఈ జంటను నవంబర్ నెలలో అరెస్టు చేశారు. వీరిద్దరూ ఇరాన్ జాతీయ భద్రతకు హాని కలిగించారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని రెవెల్యూషనరీ కోర్టు ఆరోపించింది.
వీరి ఆన్‌లైన్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా నిషేధం కూడా విధించింది. బహిరంగ ప్రదేశంలో డ్యాన్స్ చేసినందుకు వ్యభిచారాన్ని ప్రోత్సహించారన్న అభియోగాలతో కోర్టు వారిని దోషిగా నిర్ధారించింది. ఈ జంటకు జైలు శిక్షతో పాటు సైబర్ స్పేస్‌ను వాడుకున్నందుకు రెండేండ్ల నిషేధం విధించారు. దాంతో పాటు బహిరంగంగా డ్యాన్స్ చేయడంపై రెండేండ్ల పాటు ఇరాన్ నుంచి వారిని బహిష్కరిస్తూ కోర్టు తీర్పునవ్వడం గమనార్హం.