- శాంతి చర్చలను అర్ధాంతరంగా నిలిపేసిన టెహ్రాన్
- లెబనాన్‌పై దాడులు సీజ్ఫైర్ ఉల్లంఘనేనని ఆరోపణ
- ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఐడీఎఫ్ వెనక్కి వెళ్లాలని డిమాండ్
- అప్పటి వరకు ఎలాంటి చర్చలూ జరపబోమని తేల్చిచెప్పిన ఇరాన్
- ఇరాన్ సిటీలపై అమెరికామిసైల్ దాడి
- వేగంగా ప్రతిస్పందించిన ఇరాన్
- కువైట్‌పై డ్రోన్లు, మిసైళ్లతో అటాక్
- ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో అడ్డుకున్న కువైట్
టెహ్రాన్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తన దాడులను ఉధృతం చేయడంతో అంతర్జాతీయ దౌత్య సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. లెబనాన్ లో ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దారుణాలకు నిరసనగా.. అమెరికాతో జరుగుతున్న అన్నిరకాల పరోక్ష చర్చలను, సంప్రదింపులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో పాటు ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హార్మూజ్ జలసంధి’ ని పూర్తిగా మూసేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అలాగే బాబ్ అల్- మందాబ్ జలసంధి సహా ‘ఇతర ప్రాంతాల్లోనూ దాడుల తీవ్రతను పెంచాలని’ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘తస్నిమ్’ ఈమేరకు ఒక ప్రత్యేక కథనాన్ని వెలువరించింది.
ట్రంప్‌కు నేరుగా వార్నింగ్
లెబనాన్‌పై జరుగుతున్న దాడులు ఇరాన్- అమెరికా మధ్య కుదిరిన పరోక్ష కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన కొన్ని గంటల వ్యవధిలోనే శాంతి చర్చల రద్దు నిర్ణయం రావడం గమనార్హం. ‘ఎక్స్’ వేదికగా అరాఘ్చీ స్పందిస్తూ.. ‘ఇరాన్- అమెరికా మధ్య ఉన్న ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్ కు సైతం వర్తిస్తుంది. అక్కడ ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ తీవ్ర ఉల్లంఘనల వల్ల మున్ముందు వచ్చే భయంకరమైన పరిణామాలకు పూర్తిగా అమెరికా, ఇజ్రాయెల్‌లదే బాధ్యత’ అని హెచ్చరించారు.
లొంగే ప్రసక్తే లేదు.. రణరంగంగా మారిన లెబనాన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. హెజ్బుల్లాకు బలమైన ప్రాంతం బేరూత్‌లోని ‘దహియే’ జిల్లాపై విరుచుకుపడాలని ఇజ్రాయెల్ సైన్యాన్ని ఆయన ఆదేశించారు. తీవ్రమైన పోరాటం తర్వాత దక్షిణ లెబనాన్‌లో, ఇజ్రాయెల్ సరిహద్దుకు కేవలం 14.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యూహాత్మక ‘బ్యూఫోర్ట్ కోట’ను ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే తన స్వాధీనంలోకి తెచ్చుకుంది.
‘కూల్ అండ్ రిలాక్స్’ అంటున్న ట్రంప్
పశ్చిమాసియాలో ఇంత పెద్ద సంక్షోభం రేగుతున్నా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తనదైన శైలిలో స్పందించారు. ఇరాన్ లోలోపల ఒక మంచి డీల్ కుదుర్చుకోవాలనే ఆశిస్తోందని, అది వాషింగ్టన్, దాని మిత్రదేశాలకు లాభదాయకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలు ఓపిక పట్టాలని సూచిస్తూ .. ‘జస్ట్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్.. చివరికి అంతా సవ్యంగానే జరుగుతుంది - ఎప్పుడూ జరిగేది ఇదే కదా!’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం విశేషం.
సీజ్ ఫైర్ ఉల్లంఘన.. ఇరాన్ ఫైర్
శాంతి చర్చలను తక్షణమే రద్దు చేయాలన్న వ్యూహాత్మక నిర్ణయంపై ఇరాన్ ప్రభుత్వ మీడియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘లెబనాన్‌లో జియోనిస్ట్ (ఇజ్రాయెల్) ప్రభుత్వం సాగిస్తున్న అమానుష దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా ఒక భాగం. కానీ ఇప్పుడు లెబనాన్ సహా అన్ని ఫ్రంట్‌లలోనూ ఆ ఒప్పందాన్ని వారు పూర్తిగా ఉల్లంఘించారు. అందువల్ల, మధ్యవర్తుల ద్వారా అమెరికాతో జరుగుతున్న దౌత్యపరమైన చర్చలను, పత్రాల (టెక్స్ట్‌ల) మార్పిడిని ఇరాన్ చర్చల బృందం తాత్కాలికంగా నిలిపివేస్తోంది’ అని స్పష్టం చేసింది. ‘గాజా, లెబనాన్‌లలో ఇజ్రాయెల్ సైన్యం సాగిస్తున్న దురాక్రమణ, క్రూరమైన చర్యలను వెంటనే ఆపాలి. లెబనాన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వెనక్కి తగ్గాలని ఇరాన్ అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ విషయంలో ఇరాన్, అలాగే ఇరాన్ మద్దతు గల ప్రతిఘటన దళాల డిమాండ్లు నెరవేరేంత వరకు అమెరికాతో ఎలాంటి చర్చలు ఉండవు’ అని టెహ్రాన్ స్పష్టం చేసింది.
