ఇరాన్ వార్నింగ్..ట్రంప్ రియాక్షన్: ఆయన హెచ్చరికలను  నేను పట్టించుకోను..అసలు లారిజానీ ఎవరు? 

 ఇరాన్ వార్నింగ్..ట్రంప్ రియాక్షన్: ఆయన హెచ్చరికలను  నేను పట్టించుకోను..అసలు లారిజానీ ఎవరు? 

వాషింగ్టన్‌‌: ఇరాన్‌‌ అగ్రనేత అలీ లారిజానీ చేస్తున్న హెచ్చరికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా కొట్టిపారేశారు. శనివారం సాయంత్రం సీబీఎస్‌‌ న్యూస్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ నాయకత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ‘‘అతను (లారిజానీ) ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియదు.. అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు. అతని హెచ్చరికలను నేను అస్సలు పట్టించుకోను” అని వ్యాఖ్యానించారు.

లారిజానీ ఇప్పటికే ఓడిపోయారని పేర్కొన్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని అమెరికా పూర్తిగా తుడిచిపెట్టేసిందని ట్రంప్ తెలిపారు. ‘‘కేవలం ఆరు రోజుల్లోనే ఇరాన్‌‌కు చెందిన 42 యుద్ధ నౌకలను సముద్ర మట్టానికి పంపాం. వారి నౌకాదళం, వాయుసేన, క్షిపణి వ్యవస్థలు, డ్రోన్ ఫ్యాక్టరీలు.. ఇలా ప్రతి ఒక్కటి ధ్వంసమయ్యాయి. వారి నాయకత్వం కూడా అంతమైపోయింది” అని వ్యాఖ్యానించారు.  ఇరాన్‌‌పై దాడులు కొనసాగుతాయని చెబుతూ.. ఆ దేశం వెంటనే బేషరతుగా లొంగిపోవాలని డిమాండ్ చేశారు.

ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును అరికట్టడానికే తాము ముందస్తుగా ఈ దాడులు చేశామని ట్రంప్ సమర్థించుకున్నారు.ఈ యుద్ధంలో సహాయం చేస్తామన్న బ్రిటన్ ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు. ‘‘మేం యుద్ధం గెలిచిన తర్వాత రావాలనుకునే వారు మాకు అవసరం లేదు. ఇప్పుడు నౌకలను పంపడం చాలా ఆలస్యం అయింది” అని పేర్కొన్నారు.