వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తమ దేశ చమురు, ఇంధన మౌలిక వసతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడులకు ప్లాన్ చేస్తున్నారనే వార్తల మధ్య ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఒకవేళ అమెరికా గానీ, ఇజ్రాయెల్ గానీ తమపై ఎలాంటి సాహసానికైనా ఒడిగడితే.. మిడిల్ ఈస్ట్‌లోని కీలక చమురు, గ్యాస్ రంగాలను సర్వనాశనం చేస్తామని సంచలన హెచ్చరికలు జారీ చేసింది.
ఈ మేరకు ఇరాన్‌కు చెంది వార్తా సంస్థ శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. అమెరికా తమపై దాడులకు దిగితే, ప్రతీకారంగా మిడిల్ ఈస్ట్ ఇంధన నెట్‌వర్క్‌ను దెబ్బతీసేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశామని ఇరాన్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒకరు తెలిపారు. ఈ మేరకు ఓ భారీ హిట్ లిస్ట్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ ఉన్నాయి.
తగిన రీతిలో బుద్ధి చెప్తం
ఇరాన్ హిట్ లిస్ట్‌లో ఉన్న సౌదీ అరేబియాలో ప్రపంచ చమురు సరఫరాలో 5 శాతానికి పైగా వాటా కలిగిన ఘవార్ చమురు క్షేత్రంతోపాటు రోజుకు 70 లక్షల బారెళ్ల చమురును ఉత్పత్తి చేసే అబ్కైక్, ఖురైస్ కేంద్రాలున్నాయి. యూఏఈలో రోజుకు మిలియన్ బారెళ్లకు పైగా ప్రాసెస్ చేసే రువైస్ రిఫైనరీ, జకుమ్ ఆయిల్ ఫీల్డ్, ఖతార్‌లో గ్లోబల్ ఎల్ఎన్‌జీ మార్కెట్‌లో 20 శాతం వాటా కలిగిన నార్త్ ఫీల్డ్, రాస్ లఫ్ఫాన్ గ్యాస్ నెట్‌వర్క్ ఉన్నాయి.
అలాగే, కువైట్‌లోని బుర్గాన్ చమురు క్షేత్రం, బహ్రెయిన్‌లోని సిత్రా రిఫైనరీ, ఇజ్రాయెల్‌కు చెందిన లెవియాథన్, తమర్ గ్యాస్ ఫీల్డ్‌లను కూడా టార్గెట్ చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా ఎలాంటి మూర్ఖపు నిర్ణయం తీసుకున్నా తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఒకవేళ అమెరికా, -ఇజ్రాయెల్‌లు దాడులకు తెగబడితే.. పశ్చిమాసియాలోని కీలక దేశాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించే ప్రమాదం ఉందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తుందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, సీజ్ ఫైర్ చర్చల్లో ఇరాన్‌ను తమ షరతులకు లొంగదీసుకునేందుకు ట్రంప్ ఈ వ్యూహం పన్నుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
