బీమా సేవలు ఇంకా ఈజీ .. ఇందుకోసం బీమా సుగమ్​

బీమా సేవలు ఇంకా ఈజీ .. ఇందుకోసం బీమా సుగమ్​
  • త్వరలో ప్రారంభించనున్న ఐఆర్​డీఏ

న్యూఢిల్లీ: బీమా పాలసీలకు సంబంధించిన అన్ని రకాల సేవలను మరింత సులభంగా అందించడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌‌మెంట్ అథారిటీ (ఐఆర్​డీఏ) బీమా సుగమ్​ విధానాన్ని తీసుకురానుంది.  ఫలితంగా ఒకే వెబ్​సైట్​లో పాలసీ సేవలన్నీ అందుబాటులోకి వస్తాయి.  దీనివల్ల పాలసీల కొనుగోలు, ఫిర్యాదుల పరిష్కారం,  క్లెయిమ్ పంపిణీ సులభతరం అవుతుందని ఐఆర్​డీఏ తెలిపింది.

పాలసీ అమ్మకాలు, సర్వీస్​  క్లెయిమ్‌‌లకు బీమా సుగమ్ వన్​ -స్టాప్ షాప్ అవుతుందని ఐఆర్​డీఏ చైర్మన్ దేవాశిష్ పాండా అన్నారు.   ఈ సంస్థ తన 125వ బోర్డ్ మీటింగ్‌‌లో బీమా సుగమ్ ​-ఇన్సూరెన్స్ ఎలక్ట్రానిక్ మార్కెట్‌‌ప్లేస్  రెగ్యులేషన్స్ 2024ని ఆమోదించింది. దీని కింద,  కస్టమర్లకు వివిధ సేవలను అందించడానికి మార్కెట్‌‌ను సులభతరం చేయడానికి, అభివృద్ధి చేయడానికి, నిర్వహించడానికి  లాభాపేక్ష లేని కంపెనీని ఏర్పాటు చేస్తారు. 

బీమా పాలసీదారులకు ఎన్నో ప్రయోజనాలు 

అన్ని సాధారణ, ఆరోగ్య  జీవిత బీమా పాలసీలు ఒకే ప్లాట్‌‌ఫారమ్‌‌లో అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాట్‌‌ఫారమ్ టెక్నాలజీ ఆధారిత బీమా సేవలను అనుమతిస్తుంది. వ్యక్తులు పోర్టల్ ద్వారా జీవిత, మోటారు లేదా ఆరోగ్య బీమా పాలసీలను కొనుగోలు చేయవచ్చు. సర్వీస్, క్లెయిమ్​​రిక్వెస్టులను ఈ పోర్టల్​ ద్వారానే పంపవచ్చు. బీమా సుగమ్ సేవలన్నీ ఉచితం.  ప్రస్తుతం బ్రోకర్లకు 30–40శాతం వరకు కమీషన్ వస్తోంది.

బీమా సుగమ్​తో కమీషన్ 5–8శాతానికి తగ్గుతుంది.  ఒక కస్టమర్​కు వివిధ బీమా సంస్థల నుంచి నాలుగు పాలసీలు ఉండి మరణిస్తే, నామినీ ఈ ప్లాట్‌‌ఫారమ్ నుంచి అన్ని పాలసీల వివరాలు పొందవచ్చు. సర్వీసు రిక్వెస్టులు పంపవచ్చు. అయితే బీమా సుగమ్​ పూర్తి స్థాయిలో పనిచేయాలంటే అన్ని బీమా పాలసీలను డిజిటల్​ చేయాల్సి ఉంటుంది. బీమా సుగమ్​ ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను ఇంకా ఆమోదించలేదు.   "2047 నాటికి అందరికీ బీమా" అనే లక్ష్యానికి అనుగుణంగా బీమా సుగమ్​ను తయారు చేశారు.