హెచ్‌‌‌‌సీఏ టీమ్ సెలెక్షన్స్‌‌‌‌లో అక్రమాలు..! ఫేక్‌‌‌‌ బర్త్ సర్టిఫికెట్లు ఉన్న క్రికెటర్లను ఆడిస్తున్నారని ఫిర్యాదు

హెచ్‌‌‌‌సీఏ టీమ్ సెలెక్షన్స్‌‌‌‌లో అక్రమాలు..! ఫేక్‌‌‌‌ బర్త్ సర్టిఫికెట్లు ఉన్న క్రికెటర్లను ఆడిస్తున్నారని  ఫిర్యాదు

ఉప్పల్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌‌‌సీఏ)లో మరో వివాదం మొదలైంది. ఏజ్ గ్రూప్‌‌‌‌ క్రికెట్ టోర్నీల్లో ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు ఉపయోగించిన ప్లేయర్లను సెలెక్టర్లు ఆడిస్తున్నారని ఓ క్రికెటర్ తండ్రి అనంత రెడ్డి మంగళవారం రాచకొండ సీపీ జి. సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. ఎక్కువ వయసు ఉన్న ప్లేయర్లు ఫోర్జరీ పత్రాలతో లీగ్‌‌‌‌లలో ప్రవేశించడం వల్ల, సరైన వయసు, ప్రతిభ ఉన్న క్రికెటర్లు అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

వీళ్ల వెనుక  కొందరు హెచ్‌‌‌‌సీఏ పెద్దలు, సెలెక్టర్ల హస్తం ఉందని ఆరోపించారు. గతంలో ఏజ్ ఫ్రాడ్ చేసిన ఆరుగురు ప్లేయర్లను బ్యాన్ చేసినప్పటికీ, సెలెక్టర్లు వారిని మళ్లీ స్టేట్, లీగ్ మ్యాచ్‌‌‌‌ల్లో ఆడేందుకు అనుమతించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక ఆటగాడికి రెండు వేర్వేరు బర్త్‌‌‌‌ సర్టిఫికెట్లు ఉన్నా సెలెక్టర్లు  పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపేందుకు కేసును సీపీ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌‌‌‌కు బదిలీ చేశారు.