
- ఖమ్మం రవాణా శాఖ ఆఫీసులో అక్రమాలు
- ఓనర్ లేకుండా టూ వీలర్ రిజిస్ట్రేషన్ మార్పు
- ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
ఖమ్మం/ ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఓనర్లకు తెలియకుండానే వాహనాల రిజిస్ట్రేషన్లు మారిపోతున్నాయి. ప్రధానంగా టూ వీలర్ ఫైనాన్స్ సంస్థల ఆధ్వర్యంలో ఇలాంటి అక్రమాలు రెగ్యులర్ గా జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొద్ది నెలల కింద ఓ బైక్ ను తప్పుడు పేపర్లతో, తప్పుడు ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ మార్పు చేస్తున్నారంటూ ఓ ఏజెంట్ పై డీటీవోకు మరో ఏజెంట్ ఫిర్యాదు చేశారు.
దీంతో రిజిస్ట్రేషన్ ను నిలుపుదల చేయగా, ఇద్దరు ఏజెంట్లు రవాణాశాఖ ఆఫీసులోనే గొడవ పడ్డారు. తాజాగా కామేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తికి తెలియకుండానే ఆయన బైక్ ను మరొకరి పేరుమీదకు మార్చేశారు. దీనిపై రెండ్రోజుల కింద జిల్లా రవాణా శాఖ అధికారికి బాధితుడు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఫేక్ కాగితాలతో...
ఖమ్మం నగరంలో 30కి పైగా ప్రైవేట్ టూవీలర్ ఫైనాన్స్ సంస్థలున్నాయి. బ్యాంకులు, ప్రైవేట్ కంపెనీల నుంచి టూవీలర్ లోన్లు తీసుకొని, తిరిగి చెల్లించకపోతే ఆయా కంపెనీలు వాటిని రికవరీ చేస్తాయి. ఓనర్ చనిపోయినా, ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోయినా బండిని లాక్కొచ్చి అమ్మకానికి పెడతాయి. ఒకేసారి పెద్ద సంఖ్యలో బైక్ లను వేలంపాట నిర్వహిస్తాయి. టూ వీలర్ ఫైనాన్స్ వాళ్లు ఇతర రాష్ట్రాల నుంచి కూడా బండ్లను కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. వాటికి రిజిస్ట్రేషన్ కార్డులు లేకపోయినా, బండి కొనుక్కున్న వ్యక్తి చనిపోయినా, వాటిని వేలం ద్వారా కొనుగోలు చేస్తున్నారు. వాటి రిజిస్ట్రేషన్ ను ఫేక్ కాగితాలతో తయారు చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఏజెంట్ల ద్వారా రవాణాశాఖలో సిబ్బందికి మామూళ్లు ఇవ్వడం, కొత్తగా తయారు చేసిన పేపర్లతో టూవీలర్లను తిరిగి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ద్వారా అమ్మకానికి పెట్టడం కామన్ గా మారింది. టూ వీలర్ కు ఎలాంటి పేపర్లు లేకుండా, రిజిస్ట్రేషన్, నెంబర్ ప్లేట్ లేకుండా వస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో బండి పేపర్ల కోసం తప్పుడు మార్గాల్లో ఏజెంట్ల ద్వారా ప్రయత్నించడంతో ఆర్టీవో ఆఫీస్ సిబ్బందికి కాసుల వర్షం కురుస్తుందన్న ఆరోపణలున్నాయి.
విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం..
నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల రిజిస్ట్రేషన్ మార్పు ఆఫీస్ ఏవో ఆధ్వర్యంలో జరుగుతాయి. టూ వీలర్ రిజిస్ట్రేషన్ మార్పుపై శనివారం ఫిర్యాదు అందింది. ఫిర్యాదు వచ్చిన రోజు ఏవో సెలవులో ఉన్నారు. సోమవారం(నేడు) పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ తప్పు జరిగిందనేది తేలుస్తాం. దాని తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. - వెంకట రమణ, ఇన్చార్జి డీటీవో, ఖమ్మం
నాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేశారు
నాది కామేపల్లి మండలం అడవి మద్దులపల్లి గ్రామం. ఖమ్మంలో మెకానిక్ తోటకూర వినోద్ కు ఆర్నెళ్ల కింద రిపేర్ కోసం సీడీ డీలక్స్ బండి (టీఎస్ 04ఈఏ 4405) ఇచ్చాను. అప్పటి నుంచి బండి తిరిగివ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఆరోగ్యం బాలేదని, ఆస్పత్రిలో ఉన్నానని చెప్పాడు. చివరకు నాకు తెలియకుండానే నా బండిని అమ్ముకున్నాడు. నా బండి ఒరిజినల్ ఆర్సీ కార్డు నా దగ్గరే ఉంది. ఎటువంటి పేపర్లపై సంతకాలు కూడా చేయలేదు.
ఆర్సీ కార్డు ఆన్ లైన్ లో చెక్ చేస్తే వేరొకరి పేరు మీద మార్చినట్లు ఉన్నది. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని జిల్లా రవాణాశాఖ అధికారికి ఫిర్యాదు చేశాను. నా బండి అక్రమ రిజిస్ట్రేషన్‌కు సహకరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరాను. - జాలె రవి, అడవి మద్దులపల్లి, కామేపల్లి మండలం