
మందమర్రి, వెలుగు:మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి కళ్యాణిఖని ఓపెన్‌కాస్ట్ మైన్ ముంపు గ్రామం దుబ్బగూడెంలో నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులో అవకతవకలు చోటుచేసుకున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బోగస్ ఇండ్లకు భారీగా పరిహారం ప్రకటించి.. తాతముత్తాల నుంచి గ్రామంలో ఉన్న నిజమైన ఇళ్లకు మాత్రం తక్కువ పరిహారం చెల్లించడంపై నిర్వాసితులు మండిపడుతున్నారు. రీ సర్వే చేసి తమకు న్యాయం చేయాలని, యువతకు ప్యాకేజీ, ఆర్అండ్ఆర్అర్హుల జాబితా వెల్లడించాలని కోరుతూ ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. న్యాయం జరగకపోతే గ్రామం ఖాళీ చేయబోమని, ఓపెన్‌కాస్ట్ పనులను అడ్డుకుంటామని నిర్వాసితులు పేర్కొంటున్నారు.
లిస్టులో పెరిగిన ఇళ్లు ఎక్కడివి?
మందమర్రి ఏరియా కేకే ఓసీపీ మైన్ఏర్పాటులో భాగంగా 2014లో భూసేకరణ ప్రక్రియ మొదలైంది. ప్రాజెక్టులో కాసీపేట మండలం దుబ్బగూడెం, అచ్యుత్‌రావు గొండుగూడను పూర్తి ముంపు గ్రామాలుగా నిర్ధారించారు. దుబ్బగూడెం గ్రామం పరిసరాల్లో క్వాలిటీ బొగ్గు ఉండడంతో నిర్వాసితులకు నష్టపరిహారం నిర్ధారణ కోసం 2016లో సింగరేణి, రెవెన్యూ ఆఫీసర్లు సంయుక్తంగా సర్వే చేశారు. గ్రామంలో 8.2 ఎకరాల విస్తీర్ణంలో 203 ఇండ్లు ఉన్నాయని గుర్తించారు. పంచాయతీ నుంచి కొత్త ఇళ్లకు పర్మిషన్లు ఇవ్వవద్దని పేర్కొంటూ ఆర్డీవో 2015 సెప్టెంబర్ 3న కాసీపేట పంచాయతీ రికార్డులు సీజ్ చేశారు. సర్వే చేసి నంబర్లు వేసిన 203 ఇళ్లకు మాత్రమే ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని రెవెన్యూ ఆఫీసర్లు అప్పట్లో ప్రకటించారు. ఇల్లు ఉంటే పరిహారం స్వాహా చేయవచ్చని కొంతమంది లీడర్లు ప్లాన్చేశారు. గ్రామంలో ఖాళీ స్థలాలున్న వారితో అగ్రిమెంట్ చేసుకుని రాత్రికి రాత్రే డబ్బాల ఇళ్లను నిర్మించారు. స్థానిక నేతలు, ఆఫీసర్ల అండదండలతో సుమారు 40పైగా బోగస్ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. వీటిపై గ్రామస్తులు ఫిర్యాదు చేయగా సర్వే అనంతరం నిర్మించిన ఇళ్లకు ఎలాంటి పరిహారం ఇవ్వబోమని రెవెన్యూ ఆఫీసర్లు తేల్చి చెప్పారు. తాజాగా నష్టపరిహారం లిస్టులో 40 బోగస్ఇళ్ల నంబర్లు రావడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.
అసలు ఇండ్లకు తక్కువిస్తున్రు
40 బోగస్ ఇండ్లకు రూ. 5 లక్షల నుంచి 13లక్షల వరకు పరిహారం ఇస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాత ముత్తాతల నుంచి గ్రామంలోనే నివసిస్తున్న తమకు తక్కువిస్తుండడంపై మండిపడుతున్నారు. గూన, రేకులతో పెద్ద విస్తీర్ణంలో ఏండ్ల కిందట నిర్మించుకున్న శాశ్వత ఇండ్లకు రూ.4 లక్షల నుంచి రూ. 11లక్షల వరకు పరిహారం చెల్లిస్తుండగా స్లాబ్ ఉన్న ఇండ్లకు రూ.20 లక్షల వరకు ఇస్తున్నారు. బోగస్డబ్బా ఇండ్లకు ఎక్కువ పరిహారం ఇచ్చి ఎప్పటినుంచో ఉన్న పెద్ద ఇండ్లకు అతి తక్కువ ఇవ్వడమేంటని గ్రామానికి చెందిన ఎండీ.రఫీ, దుండ్ర రాజేశ్, బొజ్జ రాజయ్య, జుమ్మడి లింగయ్య, సంతోష్, కోట గోపాల్, దుర్గం భూమయ్య తదితరులు ప్రశ్నిస్తున్నారు. గూన ఇల్లు కలిగిన చల్లూరి శాంత అనే మహిళ తనకు అసలు పరిహారమే ప్రకటించలేదని వాపోయింది.