సమ్మె టైమ్‌లో అక్రమాలు.. ఇద్దరు డీఎంలపై వేటు

సమ్మె టైమ్‌లో అక్రమాలు..  ఇద్దరు డీఎంలపై వేటు

హైదరాబాద్‌‌, వెలుగు:  సమ్మె కాలంలో ఆర్టీసీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. సంస్థలోని పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని కొందరు ఉన్నతాధికారులు లెక్కాపత్రం లేకుండా వ్యవహరించిన తీరు ఇంటర్నల్‌‌ ఆడిటింగ్‌‌లో బయటపడుతోంది. ఈ వ్యవహారంలో తాజాగా ఇద్దరు అధికారులపై వేటు పడింది. ఆర్టీసీలో 55 రోజులు సమ్మె కొనసాగింది. స్ట్రైక్‌‌ ప్రారంభంలో ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా చూసేందుకు ప్రభుత్వం, ఆర్టీసీ హడావుడి చర్యలు తీసుకున్నాయి. తాత్కాలిక సిబ్బందితో బస్సుల్ని రోడ్లమీదకు తెచ్చాయి. మొదటి 15 రోజులు ట్రిమ్స్‌‌ మిషన్లే వాడలేదు. దీంతో ఎంత ఆదాయం వచ్చింది? జీతాలు ఎంతిచ్చారు? రోజువారీ ఖర్చెంత? తదితరాలపై లెక్కల్లేవు. ఆ సమయంలో కొందరు వీలైనంత పక్కనేసుకున్నారనే ఆరోపణలొచ్చాయి. కొన్ని డిపోల్లో డీజిల్‌‌ను ప్రైవేట్‌‌ వెహికల్స్‌‌కూ పోశారు. ఒక్కో బస్సుకు రూ.10 వేలపైనే కలెక్షన్స్‌‌ వస్తే సగమే చూపారు. దీంతో సమ్మె ముగిశాక ఆర్టీసీ అధికారులు ఇంటర్నల్‌‌ ఆడిటింగ్‌‌ చేయాలని నిర్ణయించారు. దీంతో డిసెంబర్‌‌ రెండో తేదీ నుంచి సికింద్రాబాద్‌‌ రీజియన్‌‌లో ఆడిటింగ్‌‌ ప్రారంభమైంది. ప్రస్తుతం 20 డిపోల్లో ఆడిటింగ్‌‌ పూర్తయినట్లు సమాచారం. మొత్తం 97 డిపోల్లో ఈ ప్రక్రియ జరగనుంది.

ఇద్దరిపై వేటు

మహేశ్వరం డిపోలో ఆడిట్‌‌ చేయగా డీఎం రవీందర్‌‌ అక్రమాలు బయటపడ్డాయి. సమ్మె సమయంలో అక్రమంగా డబ్బులను తరలించారని అధికారులు గుర్తించారు. దీంతో సదరు డీఎంను ఎండీ సునీల్‌‌ శర్మకు సరెండర్‌‌ చేశారు. ప్రస్తుతం ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌‌ లేదు. కూకట్‌‌పల్లి డిపో డీఎం నర్సింహులు కూడా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. 8 వేల దాకా తప్పుడు లెక్కలు చూపించినట్లు తేలింది. దీంతో సదరు డీఎంను అక్కడి నుంచి బస్‌‌పాస్‌‌ల విభాగానికి ట్రాన్స్‌‌ఫర్‌‌ చేశారు.

అక్రమాన్ని ప్రశ్నిస్తే ట్రాన్స్‌‌ఫర్‌‌?

సమ్మె టైమ్‌‌లో దిల్‌‌సుఖ్‌‌నగర్‌‌ డిపోకు చెందిన ఉన్నతాధికారి రెంటెడ్‌‌ కారులో డిపోలోని డీజిల్‌‌ పోయడం అప్పట్లో కలకలం రేపింది. దీన్ని గుర్తించిన సెక్యూరిటీ అధికారి ఫొటో తీశారు. అది వైరల్‌‌ అయింది. అయితే డీజిల్‌‌ పోయించుకున్న సదరు అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, అక్కడి సెక్యూరిటీ అధికారిని ట్రాన్స్‌‌ఫర్‌‌ చేశారు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని వదిలి దాన్ని గుర్తించిన సెక్యూరిటీ ఆఫీసర్‌‌ను ట్రాన్స్‌‌ఫర్‌‌ చేయడంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.