వనపర్తి జిల్లాలో చివరి ఆయకట్టుకు అందని సాగునీరు

వనపర్తి జిల్లాలో చివరి ఆయకట్టుకు అందని సాగునీరు

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల, చిన్నం బావి, పెబ్బేరు , పాన్ గల్ మండలాల్లో జూరాల, బీమా చివరి ఆయకట్టు కాలువలను ఇరిగేషన్​అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఆయా మండలాల పంట కాలువల్లో జమ్ము, చెత్తా చెదారం పేరుకుపోయి సాగునీరు కిందికి వెళ్లడం లేదు. దీంతో చివరి ఆయకట్టుకు నీరందక పంట పొలాలు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రైతులే సొంతంగా పైసలు ఖర్చు పెట్టి జేసీబీలతో కాలువల్లో జమ్మును తొలగించుకుంటున్నారు.  ఉమ్మడి జిల్లాలో జూరాల, బీమా ఫేజ్ –1,2 , నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు  రైతులకు సాగునీరందిస్తున్నాయి. వీటిని ఆధారం చేసుకొని వనపర్తి జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేస్తున్నారు. వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, జిల్లాల పరిధిలోకి వచ్చే జూరాల , బీమా ఫేజ్ –2, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల నిర్వహణను ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకుంటలేరని రైతులు వాపోతున్నారు.  ఒక సీఈతో పాటు  డీసీఈ, పలువురు డీఈ లు , ఏఈ లు పనిచేస్తున్నా ఒక్కరు కూడా ఫీల్డ్ లో పని చేస్తలేరని  విమర్శిస్తున్నారు. కాల్వల నిర్వహణ సరిగ్గా లేక జూరాల, బీమా చివరి ఆయకట్టు ప్రాంతాలైన వీపనగండ్ల, చిన్నంబావి, పాన్ గల్, కొల్లాపూర్ మండలాల రైతులు నీరందక తరచూ ఆందోళనలు చేస్తున్నారు. కాల్వలకు రిపేర్లు చేయాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో సొంతంగా పైసలేసుకుని కాల్వల్లోని పూడికను, జమ్మును తొలగించుకుంటున్నారు.  ఇలాంటి పనుల కోసం సీఈ పరిధిలో రూ.5 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నా ఖర్చు చేస్తలేరని వాపోతున్నారు.

 నామ్​కే వాస్తేగా సీఈ ఆఫీస్​..

గతంలో ఉన్న మేజర్, మైనర్ , మీడియం ఇరిగేషన్ శాఖలతో పాటు ప్రాజెక్ట్ లన్నింటిని ఒకే గొడుగు కిందకు తెస్తూ ప్రభుత్వం ఏడాది కింద జిల్లాకు ఒక చీఫ్ ఇంజనీర్ ను నియమించింది. వారికి ఒక్కొక్కరికి రూ.5 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్​ను కూడా కేటాయించింది.  అందులో భాగంగా వనపర్తి జిల్లాకు ఏడాది కింద రాష్ట్ర ప్రభుత్వం సీఈ  ఆఫీస్​ శాంక్షన్ ​చేసింది. ఆఫీస్​నిర్మాణం కోసం రూ.67 కోట్లు  కూడా విడుదల చేయడంతో  జిల్లా కేంద్రంలోని పాన్ గల్ రోడ్ లో ఆఫీస్​ను నిర్మిస్తున్నారు. తాత్కాలికంగా ఆఫీస్​ను పెబ్బేరు లో పీజేపీ గెస్ట్ హౌజ్​లో  ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఇటీవల వనపర్తి ఇరిగేషన్ ఐబీ గెస్ట్ హౌస్  ను సీఈ ఆఫీస్​ కోసం వినియోగిస్తున్నారు. అయినా సీఈ,  సంబంధిత ఆఫీసర్లు హైదరాబాద్​ను విడిచి రావడం లేదు. ఏ చిన్న పని ఉన్నా ఇరిగేషన్ ​స్టాఫ్​  హైదరాబాద్​కే వెళ్తున్నారు. మంత్రి, కలెక్టర్ జిల్లాలో నిర్వహించే  సమావేశాలకు కూడా  సీఈ హాజరు కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన జడ్పీ మీటింగ్ లో కూడా ఇరిగే షన్ శాఖ పని తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  పలు సందర్భాల్లో రైతులు  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి,  కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా దృష్టికి తీసుకురావడంతో వారు మందలించినా  అధికారుల్లో ఏ మాత్రం చలనం 
రావడం లేదు. 

కాల్వలకు రిపేర్లు చేస్తం..

జిల్లాలో జూరాల, బీమా ప్రాజెక్టుల చివరి ఆయకట్టుకు నీరందించేందుకు  ప్రయత్నం చేస్తున్నాం. ఎమర్జెన్సీ  పనులను గుర్తించి కాలువలకు రిపేర్లు  చేస్తాం. లైనింగ్ లేక చాలా చోట్ల కాలువలు తెగిపోతున్నాయి. నిధుల కొరత వల్ల కొన్ని చోట్ల తూముల రిపేరు పెండింగ్ లో ఉండగా ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఎమర్జెన్సీ పనులను గుర్తించి రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం.
– శ్రీనివాస్, ఈఈ, వనపర్తి